‘సాగునీటి ప్రాజెక్టులపై ఇకనైనా దృష్టి పెట్టండి’.. ప్రభుత్వానికి దశరథరామిరెడ్డి విజ్ఞప్తి
తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన 19 గేటు ద్వారా రిజర్వాయర్ నుండి తరలిపోతున్న నీటిని నిలువరించడానికి స్టాప్ లాగ్ గేట్లను అమర్చడం విజయవంతంగా పూర్తయింది.
తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన 19 గేటు ద్వారా రిజర్వాయర్ నుండి తరలిపోతున్న నీటిని నిలువరించడానికి స్టాప్ లాగ్ గేట్లను సమర్థవంతంగా అమర్చిన సాంకేతిక నిపుణులకు, అందుకు సహకరించిన తుంగభద్ర జలమండలికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అభినందనలు తెలియజేశారు. రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంత రైతుల నీటి అవసరాలను పరిరక్షించడానికి కృషి చేసిన కన్నయ్యనాయుడును, సాంకేతిక నిపుణుల బృందం, స్టాప్ లాగ్ గేట్లను అమర్చే సాహస ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా బొజ్జా కొనియాడారు. తుంగభద్ర డ్యాం గేట్ల జీవిత కాలం 45 సంవత్సరాలైనప్పటికీ, డ్యాం నిర్మాణం జరిగి 70 సంవత్సరాలైనా వాటిని మార్చకపోవడం వలన జరిగిన ఉపద్రవం భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాలకు బొజ్జా విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టించే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణాల పట్ల గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి రైతుల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా బొజ్జా ఆవేదన వ్యక్తం చేసారు. శ్రీశైలం ప్రాజెక్టు భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చిన 2009 వరదలలో దెబ్బతిన్న శ్రీశైలం ప్లంజ్ పూల్, ఏడు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న అలగనూరు రిజర్వాయర్, కీలకమైన నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపడం వలన ఎలాంటి ఉపద్రవం జరుగుతుందో తెలియని గోరుకల్లు రిజర్వాయర్, మరమ్మత్తులు చేపట్టకపోవడంతో ఏమి జరుగుతుందో తెలియని సుంకేసుల బ్యారేజ్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర గేట్ల పరిస్థితి, మరమ్మత్తులకు నోచుకోని కేసి కెనాల్, తెలుగు గంగ, హంద్రీనీవా ప్రధాన కాలువలు ఎక్కడ పంటచేలను ముంచుతాయో, ఆయకట్టుకు నీరు ఎలా అందుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాలకులకు పట్టలేదని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా క్రియాశీలకంగా వ్యవహరించి సంపద సృష్టించే పై సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయించి, రాయలసీమ సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టాలని బొజ్జా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.