విశాఖ డెయిరీకి ఇక బీజేపీ గొడుగు!
x

పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ చైర్మన్, డైరెక్టర్లు

విశాఖ డెయిరీకి ఇక బీజేపీ గొడుగు!

పురందేశ్వరి సమక్షంలో ఆ పార్టీలో చేరిన చైర్మన్ ఆడారి. టీడీపీ వేధింపులతో ఇటీవలే వైసీపీకి రాజీనామా.

వ్యాపారాలతో పాటు రాజకీయాలు చేసుకునే వారికి ఎప్పుడూ ఏదొక గొడుగు అవసరమవుతుంది. ఏ పార్టీ అండ లేకుండా మనుగడ సాగించడం కష్టమవుతుంది. తమ పార్టీలో ఉన్నంతకాలం వారి తప్పులు ఒప్పులుగానే కనిపిస్తాయి. అక్రమాలు, అవకతవకలు సవ్యంగానే ఉంటాయి. ఎప్పుడైనా ఆ నాయకులు పార్టీ మారితే అసలు కష్టాలు ప్రారంభమవుతాయి. ఆ వ్యక్తి/ నాయకుడే లక్ష్యంగా సంస్థపై పనిగట్టుకుని వేధింపులు మొదలవుతాయి. ఒకప్పటి ఒప్పులు ఇప్పుడు తప్పులుగా మారిపోతాయి. రాజకీయాల్లో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ వ్యవహారం ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది.

ఉత్తరాంధ్ర సహా ఉభయ గోదావరి జిల్లాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉన్న విశాఖ డెయిరీ రాజకీయాలతో ముడిపడి ఉంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఆడారి తులసీరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే ఉన్నారు. దాదాపు నలభ య్యేళ్లు టీడీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆయన తనయుడు ఆనందకుమార్, కుమార్తె రమాకుమారి, డెయిరీ డైరెక్టర్లు మూకుమ్మడిగా టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరిపోయారు. కొన్నాళ్లకు తులసీరావు మరణించారు. వైసీపీలో చేరిన తర్వాత ఆడారి కుటుంబంతో డెయిరీకి ఏ కష్టాలు రాలేదు. పైగా రాజకీయంగానూ ఆ పార్టీలో చెప్పుకోదగిన ప్రాధాన్యత కూడా లభించింది.

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొద్ది నెలలకే డెయిరీకి కష్టాలు మొదలయ్యాయి. ఈ డెయిరీపై పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు రావడం, వీటిపై సభా సంఘం ఏర్పాటు కావడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఇక వైసీపీలో ఉంటే డెయిరీతో పాటు తమకూ ఎలాంటి ఇబ్బందులెదురవుతాయోనన్న భయంతో కొన్నాళ్లు వైసీపీకి దూరంగా ఉన్నారు. అంతా ఊహించినట్టే ఇటీవల ఆ పార్టీకి డెయిరీ చైర్మన్ ఆడారి ఆనందకుమార్, ఆయన సోదరి రమాకుమారి సహా డెయిరీ డైరెక్టర్లంతా వైసీపీకి గుడ్బై చెప్పేశారు. తమపై కక్షగట్టిన టీడీపీలో చేరేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో బీజేపీలో చేరడమే సరైన మార్గంగా భావించారు.

దీంతో బీజేపీలోని ముఖ్యుల ద్వారా ప్రయత్నించారు. అటు నుంచి 'కాషాయ సిగ్నల్' రావడంతో బుధవారం రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. డెయిరీ చైర్మన్ ఆడారి ఆనందకుమార్ తో పాటు ఆయన సోదరి రమాకుమారి, డెయిరీ డైరెక్టర్లు కాషాయ కండువా కప్పుకున్నారు. వీరి చేరికల కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్రాజు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇక విశాఖ డెయిరీకి బీజేపీ అండ..

మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖ డెయిరీకి బలమైన రాజకీయ పార్టీ అండ అవసరం ఉంది. టీడీపీ నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణ లభించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్కటే శరణ్యం. వీటన్నిటినీ బేరీజు వేసుకునే డెయిరీ చైర్మన్ బీజీపీలో చేరాలన్న నిర్ణయానికొచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు అధికారికంగా బీజేపీలో చేరడం ద్వారా విశాఖ డెయిరీపై ప్రభుత్వ దూకుడు త గ్గడమే కాదు.. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని, సేఫ్ జోన్లోకి వెళ్లినట్టేనని బలంగా నమ్ముతున్నారు.

Read More
Next Story