తెలంగాణా జిల్లాను మహారాష్ట్రలో కలపాలా ?
x

తెలంగాణా జిల్లాను మహారాష్ట్రలో కలపాలా ?

కొమరంభీం అసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయాలని బీజేపీ సిర్పూర్ ఎంఎల్ఏ పాల్వాయ్ హరీష్ బాబు డిమాండ్ చేశారు.


తెలంగాణా జిల్లాను మహారాష్ట్రలో కలిపేయాలనే డిమాండ్ సంచలనంగా మారింది. ఆమధ్య రాష్ట్ర విభజన కోసం దాదాపు పుష్కరకాలం తెలంగాణాలో ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. కారణం ఏదైనా మొత్తానికి రాష్ట్ర విభజన జరిగటంతో ప్రత్యేక తెలంగాణా సాధ్యమైంది. ప్రత్యేక తెలంగాణా ఏర్పడి పదేళ్ళు అవగానే మరో వేర్పాటు డిమాండ్ తెరపైకి రావటం అదికూడా అసెంబ్లీలోనే జరగటం సంచలనమైంది. ఇంతకీ విషయం ఏమిటంటే కొమరంభీం అసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయాలని బీజేపీ సిర్పూర్ ఎంఎల్ఏ పాల్వాయ్ హరీష్ బాబు డిమాండ్ చేశారు.

దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని పాల్వాయ్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జిల్లాల విభజన జరిగినపుడైనా కొత్తగా ఏర్పడిన కొమరంభీం అసిఫాబాద్ జిల్లా డెవలప్ అవుతుందని అనుకుంటే ఇపుడు కూడా నిరాస తప్పలేదని ఆవేధన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శివారు జిల్లా అయిన అసిఫాబాద్ జిల్లాకు నీళ్ళు, నిధుల కేటాయింపులో మొదటినుండి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. నీళ్ళు, నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నపుడు జిల్లా తెలంగాణాలోనే ఉండటంలో అర్ధంలేదన్నారు.

అసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయటం వల్ల తమకు చాలా లాభాలున్నట్లు చెప్పారు. జిల్లాలోని 2 లక్షల మంది జనాభాలో సుమారు 1.2 లక్షలమందికి మరాఠీ వచ్చన్నారు. తమ జిల్లాకు దశాబ్దాలుగా మహారాష్ట్రతో ఉన్న సంబంధాల వల్ల జిల్లాలోని చాలామంది మరాఠీ భాషను అనర్ఘళంగా మాట్లాడగలరని ఎంఎల్ఏ చెప్పారు. భాష రాని వాళ్ళు నెలరోజులు కష్టపడితే మరాఠీ సులభంగా వచ్చేస్తుందన్నారు. భాషపరంగా ఎలాంటి సమస్య లేదుకాబట్టి తమ జిల్లాను వెంటనే మహారాష్ట్రలో కలిపేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఉండి అభివృద్ధికి దూరంగా ఉండేకన్నా మహారాష్ట్రలో కలిపేస్తే ఆ ప్రభుత్వంతో మాట్లాడుకుని డెవలప్మెంట్ చేసుకుంటామని పాల్వాయ్ చెప్పటం ఆశ్చర్యమేసింది.

ఎంఎల్ఏ డిమాండ్ చేశారని కాదుకాని ఇప్పటికే జిల్లాలోని 11 గ్రామాలు ఇటు తెలంగాణా అటు మహారాష్ట్రతో సంబంధాలు నెరుపుతున్నాయి. 11 గ్రామాల్లోని జనాలందరూ రెండు రాష్ట్రాల్లోని సంక్షేమపథకాలు అందుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందుకోవటమే కాకుండా జనాలందరికీ రెండు ఓట్లు కూడా ఉన్నాయి. తెలంగాణా, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినపుడు అవకాశాన్ని బట్టి రెండు రాష్ట్రాల్లోను జనాలు ఓట్లేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే బహుశా ఎంఎల్ఏ పాల్వాయ్ హరీష్ బాబు తమ జిల్లా మొత్తాన్ని మహారాష్ట్రలో కలిపేయాలని డిమాండ్ చేసింది. ఇపుడు ఒక ఎంఎల్ఏ డిమాండుగానే కనబడుతున్నప్పటికీ ప్రభుత్వం జాగ్రత్తపడకపోతే ముందు ముందు ఇదే పెద్ద ఉద్యమంగా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Read More
Next Story