వైసీపీ ఖాళీ ఖాయం.. చెప్పిన బీజేపీ ఎంపీ
x

వైసీపీ ఖాళీ ఖాయం.. చెప్పిన బీజేపీ ఎంపీ

వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నేత ఆదినారాయణ వెల్లడించారు. కానీ అదంతా జగన్ ప్లానే అన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే..


ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి మహా రసవత్తరంగా మారుతోంది. ఇన్నాళ్లూ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీకి ఈ సారి ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదాను కూడా కల్పించలేదు. కేవలం 11 స్థానాలకు వైసీపీ పరిమితం చేశారు. దీంతో వైసీపీ నుంచి ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు వైదొలిగారు. రానున్న రోజుల్లో ఈ వలసలు మరింత పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీ బీజేపీ నేత ఆదినారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే వైసీపీ ఖాళీ కానుందని, వైసీపీ ఎంపీలు భారీ సంఖ్యలో బీజేపీ బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈరోజే రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్న క్రమంలో ఆదినారాయణ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అసలు స్వరమే వినిపించలేని పార్టీ ఉండటం అనవసరం అనుకునే మంచి అవకాశం కోసం వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మిథున్ రెడ్డి నాయకత్వంలోనే చేరికలు!

‘‘ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఖాళీ కావడం ఖాయం. వైసీపీ లోక్‌సభ ఎంపీ మిథున్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ ఎంపీలు చాలా మంది బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవినాష్ రెడ్డి మినహా మిగిలిన వారంతా బీజేపీలో చేరేలా మిథున్ రెడ్డి నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. వారిని చేర్చుకోవడంపై బీజేపీ నుంచి సానుకూల స్పందన ఏమీ రాలేదు. అయినా వారు తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు. మిథున్ రెడ్డి ఆఖరికి తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలో చేర్చాలని పైరవీలు చేస్తున్నారు’’ అని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఆయన వ్యాఖ్యలపై వైసీపీ పార్టీ స్పందించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రచారాన్ని వైసీపీ ఖండిస్తుందా లేదా అనేది చర్చనీయాంశమవుతోంది.

అదంతా జగన్ ప్లానా!

అయితే మరో పక్క ఆదినారాయణ రెడ్డి ప్రచారంలో వాస్తవం ఉన్నప్పటికీ.. అదంతా జగన్ ప్లాన్ కూడా కావొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేడర్‌ను కేసుల నుంచి కాపాడుకోవడానికి జగన్ ఈ ప్లాన్ వేశారన్న వాదనలూ తీవ్రంగా వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరితే ఎంతటి అవినీతి నేత అయినా కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న ప్రచారం దేశవ్యాప్తంగా భారీగా జరుగుతోంది. ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ.. వైసీపీ నేతలపై కేసులు పెట్టడానికి సన్నద్దమవుతోందని, తమ పార్టీ నేతలను, కేడర్‌ను ఆ కేసుల నుంచి కాపాడటానికే తమ ఎంపీలందరినీ బీజేపీలోకి పంపాలని జగన్ ప్లాన్ వేశారని, దాని ప్రకారమే వైసీపీ ఎంపీలు(మిథున్ రెడ్డి సహా) బీజేపీతో మంతనాలు చేస్తుండొచ్చని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Read More
Next Story