5వ నంబర్ అంటే భయపడుతున్న కొండా
x

5వ నంబర్ అంటే భయపడుతున్న కొండా

చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి 5 అంకె అంటేనే వణికిపోతున్నారు. కొండా ఎందుకంతగా వణికిపోతున్నట్లు ?


చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి 5 అంకె అంటేనే వణికిపోతున్నారు. నిజానికి 5 అంకె ఏమీ అశుభానికి సంకేతం కాదు. అయినా సరే కొండా ఎందుకంతగా వణికిపోతున్నట్లు ? ఎందుకంటే తన పేరును పోలిన పేరుతో మరో అభ్యర్ధి కూడా చేవెళ్ళ ఎంపీగా పోటీచేస్తున్నారు కాబట్టి. దాంతో బీజేపీ అభ్యర్ధికి పెద్ద సమస్య వస్తోంది. ఎలాగంటే కొండా ప్రచారానికి వెళ్ళిన ప్రతిచోటా తనకు ఓట్లేసి గెలిపించమని అడుగుతున్నారు. పోటీచేసే ప్రతి అభ్యర్ధి ఓట్లేసి గెలిపించమనే అడగటం చాలా సహజం. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్ది చాలామంది అభ్యర్ధులు డమ్మీ బ్యాలెట్ లేదా డమ్మీ ఈవీఎం మెషీన్ను ముద్రిస్తారు. అందులో తమ పేరు, వరుస నెంబర్ ను కూడా ప్రింట్ చేసి ఓటర్లకు పంచుతారు.

ఇలా ఎందుకు చేస్తారంటే బ్యాలెట్ అయినా ఈవీఎం మెషీన్లో అయినా తమ గుర్తు విషయంలో ఓటర్లు అయోమయానికి గురికాకూడదని. కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్తు, పేరు ఓటర్లకు బాగా గుర్తుండిపోతే పోలింగుకు వెళ్ళినపుడు ఎలాంటి కన్ప్యూజన్ లేకుండా ఈవీఎం మోషీన్లో తాను చెప్పిన నెంబర్ కు ఓట్లేస్తారని కొండా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇపుడు కొండాకు పెద్ద సమస్య వచ్చిపడింది. అదేమిటంటే ప్రచారానికి వెళుతున్న కొండా తన గుర్తు, పేరును ప్రస్తావించినపుడల్లా ‘ఈవీఎం మెషీన్లో 5 నెంబర్ తమకు ఎందుకు తెలీదు, తప్పకుండా ఓట్లేస్తా’మని హామీ ఇస్తున్నారు. దాంతో కొండాకు షాక్ తగిలినట్లవుతోంది.

సమస్య ఎక్కడుంది ?

కారణం ఏమిటంటే ఈవీఎం మెషీన్లో వరుససంఖ్యలో 5వ నెంబర్లోని పేరు తనది కాదు. తన పేరు లాంటి అభ్యర్ధి మరో కొండా విశ్వేశ్వరరెడ్డిది. బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కొండా విశ్వేశ్వరెడ్డి వరుస సంఖ్య 2 అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీచేస్తున్న ఇంకో కొండా విశ్వేశ్వరరెడ్డి వరుస నెంబర్ 5. రెండు పేర్లు ఒకటే కాబట్టి జనాలంతా వరుస సంఖ్య 5ను బాగా గుర్తుపెట్టుకున్నారు. అందుకనే బీజేపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా తప్పకుండా వరుససంఖ్య 5 పైన ఓట్లేస్తామని గట్టిగా చెబుతున్నారట. వరుససంఖ్య 2ని జనాలు వదిలేసి 5ని గుర్తు పెట్టుకోవటంతో రేపటి పోలింగ్ లో తన కొంప ముణిగిపోతుందని బీజేపీ అభ్యర్ధి వణికిపోతున్నారు.

హైకోర్టు ఏమంది ?

అందుకనే అర్జంటుగా హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈవీఎం మెషీన్లో తమ రెండుపేర్లు ఒకేలాగ ఉండటంతో తనకు చాలా ఇబ్బందిగా ఉందని పిటీషన్లో చెప్పారు. తమ రెండుపేర్లు ఒకేలా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందికాబట్టి కనీసం వరుస సంఖ్యను అయినా మార్చమని అభ్యర్ధించారు. రెండు పేర్లు ఒకేలాగ ఉండటంతో తమకు కేటాయించిన వరుస నెంబర్లను అయినా మార్చాలని బీజేపీ అభ్యర్ధి కొండా విజ్ఞప్తిచేశారు. ఈవీఎంలో తన వరుస నెంబర్ 2 కాబట్టి మరో అభ్యర్ధి కొండా వరుస నెంబర్ 10 తర్వాత ఉండేట్లుగా కేంద్ర ఎన్నికల కమీషన్ను ఆదేశించాలని పిటీషన్లో కోరారు. ఈవీఎంలో బీజేపీ అభ్యర్ధి కొండా నెంబర్ 2 అయితే ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్ధి కొండా నెంబర్ 5 అవటమే పెద్ద సమస్య వచ్చిపడింది.

ఇదే విషయమై హైకోర్టులో జరిగిన విచారణలో ఎన్నికల కమీషన్ తరపు లాయర్ అవినాష్ దేశాయ్ మాట్లాడుతు ఎన్నికల ప్రక్రియ అమల్లో ఉందికాబట్టి పిటీషన్ను కొట్టేయాలని చెప్పారు. ఈవీఎంలు సిద్ధమైపోయి, వరుస సంఖ్యలు కూడా సిద్ధమైపోయాయన్నారు. ఈ దశలో ఈవీఎంల్లో వరుససంఖ్యలు మార్చటం సాధ్యంకాదన్నారు. కొండా తరపు లాయర్ వాదన వినిపిస్తు పోటీలో ఉన్న 46 మందిలో తమకు 5వ నెంబర్ కేటాయించిన అభ్యర్ధితోనే సమస్యలు ఉన్నట్లు చెప్పారు. రెండువైపుల వాదనలు విన్న హైకోర్టు పిటీషనర్ వేసిన కేసును కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని చెప్పిన హైకోర్టు పిటీషనర్ వినతిని పరిశీలించి అవకాశం ఉంటే న్యాయంచేయమని ఆదేశించింది. కోర్టులో వాదనలు విన్నతర్వాత అర్ధమైంది ఏమిటంటే ఈవీఎంలో అభ్యర్ధుల పేర్లు, వరుస నెంబర్లు మార్చటం సాధ్యంకాదని. దాంతో ఏమిచేయాలో తెలీక ఇపుడు బీజేపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి దిక్కులు చూస్తున్నారు.

ఇట్రెస్టింగ్ పాయింట్

ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఇదే సమస్య కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డికి కూడా ఉంది. రెవల్యూషనరీ సోషల్ పార్టీ అభ్యర్ధిగా గాదె రంజిత్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఇన్షియల్స్ ను తీసుకుంటే ఇద్దరిదీ జీ రంజిత్ రెడ్డనే కేనబడుతుంది. కాని పూర్తి పేరును చూస్తే కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి, రెవల్యూషనరీ పార్టీ అభ్యర్ధి గాదె రంజిత్ రెడ్డి. మరి కారణాలు ఏమిటో కాంగ్రెస్ అభ్యర్ధి మాత్రం రెవల్యూషనరీ పార్టీ అభ్యర్ధి రంజిత్ రెడ్డిని పట్టించుకోవటంలేదు. వరుస సంఖ్యలో ఇద్దరి మధ్య బాగా తేడా ఉన్నట్లుంది. అందుకనే గడ్డం పెద్దగా పట్టించుకోవటంలేదు.

Read More
Next Story