ఏపీలో నితీష్ తుఫాన్.. జగన్ చేతికి అస్త్రమేనా..!
ప్రత్యేక హోదాపై బీహార్ తీర్మానం చేయడం ఆంధ్ర రాజకీయాల్లో దుమారం రేపింది. ఇది జగన్‌కు ఆయుధంలా మారడంతో పాటు చంద్రబాబును సంకటంలో పడేస్తుందా..
ఆంధ్రప్రదేశ్‌లో బీహార్ సీఎం నితీష్ కుమార్ తుఫాను చెలరేగింది. ఆయన తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాజకీయాల వేడిని పెంచనున్న వాతావరణం కనిపిస్తోంది. అదే ప్రత్యేక హోదా అంశం. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటులో నితీష్ కుమార్.. జేడీఎస్, చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రధాన భూమిక పోషించాయి. వారిద్దరూ లేకుంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే లేదన్నట్లు మారింది. ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకారం తెలిపారు. అనుకున్నట్లే ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాకముందే నితీష్ కుమార్ తనదైన రాజకీయం మొదలు పెట్టేశారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనకు జేడీయూ పార్టీ ఆమోదం తెలిపింది. ఇదే టీడీపీకి అతిపెద్ద తలనొప్పిగా మారనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో మంచి అవకాశం కోసం చూస్తున్న జగన్ చేత వజ్రాయుధంలా మారనుందని కూడా మేధావులు చెప్తున్నారు.
తుఫాన్ రేపిన నితీష్
నితీష్ కుమార్, ఆయన పార్టీ తమ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు యావత్ దేశ వ్యాప్తంగా రాజకీయ తుఫాను రేపారు. జేడీయూ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా.. టీడీపీకి గొంతుపై కత్తిలా మారనుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపాదన పెడతారా లేకుంటే మౌనం పాటిస్తారా అనేది చూడాలి. అదే విధంగా ఒకవేళ మౌనం పాటిస్తే ఆంధ్ర ప్రజలు ఊరుకుంటారా అనేది కూడా పెద్ద సవాల్‌గా మారనుంది. ఒకవేళ చంద్రబాబు డిమాండ్ చేస్తే అందుకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా ఏమైనా చెప్పి సముదాయిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది.
మంచి ఛాన్స్ మిస్ అయిందా..!
అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకంగా మారారో అందరూ ఆయనకు సూచించింది ఒక్కటే. ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణానికి నిధులు వంటి కీలక విషయాలను డిమాండ్ చేయాలని. కానీ చంద్రబాబు అలా చేయలేదు. ఎందుకో కారణం ఎవరికీ తెలియదు. ఇప్పుడు నితీష్ కుమార్.. కేంద్రం ముందు ప్రత్యేక హోదా తీర్మానం ఉంచనున్నా క్రమంలో మంచి అవకాశాన్ని చంద్రబాబు చేజేతులారా చెడగొట్టుకున్నారా అన్న అనుమానాలు అధికమవుతున్నాయి. విశ్లేషకులు కూడా ఇందుకు అవుననే సమాధానం చెప్తున్నారు.
జగన్‌కి రాని అవకాశం ఇది!
కేంద్రం ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం అనేది జగన్‌కు రాని అవకాశం అని పలువురు విశ్లేషకులు చెప్పారు. ఈ అవకాశం జగన్‌కు వచ్చి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి ఉండేవాళ్లని అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి మన అవసరం లేదని, వారే స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్న కారణంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకున్నానని తన నిస్సహాయతను బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు. అటువంటి మంచి అవకాశం దక్కినా నేడు చంద్రబాబు దుర్వినియోగం చేసుకున్నారని కూడా వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
జగన్ చేతికి వజ్రాయుధమేనా
ఇప్పుడు ఆరు ఎంపీ స్థానాలు ఉన్న జేడీయూ.. బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తుండగా 21 మంది ఎంపీలు ఉన్న ఆంధ్ర సీఎం మాత్రం మౌనం పాటించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ మైనస్ కానుంది. అదే విధంగా ఇప్పుడు నితీష్ కుమార్.. ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం అనేది ఆంధ్ర మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌చేతిలో వజ్రాయుధంలా మారనుంది. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. ఏదైనా సాకు దొరికితే చాలనుకున్న జగన్ చేతికి ఇప్పుడు వజ్రాయుధం లాంటి ప్రత్యేక హోదా అంశమే లభించింది. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోసం పోరాడాలని వైసీపీ నిర్ణయించుకుంది. కానీ అది కేవలం ఒక పార్టీకి సంబంధించిన అంశం కావడంతో ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించడం కష్టమే. ఇటువంటి సమయంలో ప్రత్యేక హోదా అనేది జగన్‌కు మంచి ఆయుధం అవుతుంది.
ప్రత్యేక హోదా అంశానికి ప్రజల నుంచి భారీ మద్దతు లభించడం పక్కా. ఎందుకంటే ప్రత్యేక హోద అనేది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్.. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇటువంటి ఈ అంశాన్ని తీసుకుని జగన్.. ప్రజల్లోకి మంచి ఫలితాలు రాబట్టొచ్చు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం బలంగా పడేలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏంటి అనేది తెలుసుకోవడం కూడా యావత్ దేశం ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తుంది.
బాబు అందుకే ఆగారా..
ఈ క్రమంలోనే చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశాన్ని కావాలనే లేవనెత్తలేదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. నితీష్ ఈ అంశాన్ని తీసుకొస్తారన్న పూర్తి నమ్మకం ఉండటంతోనే ముందుగా ఇతర డిమాండ్లను నెరవేర్చుకోవడంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారని, ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌కు మంచి సమయం వచ్చిందని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆరు ఎంపీ సీట్లు ఉన్న కూటమి సభ్య పార్టీ డిమాండ్‌ను నెరవేరిస్తే 21 సీట్లు ఉన్న తమ డిమాండ్‌ను కూడా నెరవేర్చి తీరాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని చంద్రబాబు పట్టుబట్టొచ్చని వారు అంటున్నారు. ఒకవేళ అలానే పట్టుబట్టి.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి చంద్రబాబు.. ప్రత్యేక హోదా తెస్తే చరిత్రలో ఆయన పేరు సువర్ణక్షరాలతో ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఎన్‌డీఏ స్పందన ఎలా ఉంటుందో!
అయితే ఇప్పటి వరకు బీహార్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. వారి ప్రవర్తన చూస్తుంటే మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన కూడా వారికి లేదనే అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఒత్తిడి తెచ్చిన ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకాలు చాలా స్వల్పంగానే కనిపిస్తున్నాయి. మరి ఈ అంశంలో చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి? బీహార్ ప్రత్యేక హోదాపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? ఈ అవకాశాన్ని జగన్ తనకు అనుగుణంగా ఎలా మలుచుకోనున్నారు అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Next Story