సాయంత్రం 6.30 నుంచే బీహార్ ఎగ్జిట్ పోల్స్ హడావిడి
x

సాయంత్రం 6.30 నుంచే బీహార్ ఎగ్జిట్ పోల్స్ హడావిడి

బీహార్ ఎగ్జిట్ పోల్స్ ప్రసారానికి ఛానళ్ల తహతహా


బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత ఇవాళ సాయంత్రం 6.30 గంటల నుంచే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేందుకు ప్రముఖ ఛానళ్లు ఏర్పాటు చేస్తున్నాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. రాష్ట్రంలోని 123 నియోజకవర్గాల్లో ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ పోలింగ్ ముగిసిన వెంటనే — సరిగ్గా 6.30 గంటలకు — వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించనున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ఎప్పటిలాగే ఈ సారి కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ప్రజలు ఎటు వైపు మొగ్గుచూపుతున్నారో అంచనా వేసే ప్రయత్నంలో అన్ని ఛానెల్లు, విశ్లేషకులు మునిగిపోయారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలాసార్లు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి, ఈసారి కూడా అవే ప్రధాన చర్చా కేంద్రంగా మారాయి.
రెండో విడతలో పెరిగిన పోలింగ్...
తొలి విడత పోలింగ్ ఈ నెల 6న జరిగి, 65.08 శాతం అనే రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఆ ఉత్సాహం కొనసాగిస్తూ రెండో విడతలో కూడా ప్రజలు విస్తృతంగా పాల్గొన్నట్లు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల సమయానికే 60.03 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 70 శాతం వరకు పోలింగ్ జరుగుతుందని అంచనా.
3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోగా, నేపాల్ సరిహద్దుకు సమీపంలోని చంపరాన్, ఈస్ట్ చంపరాన్, సీతామర్హి, మధుబని, సుపౌల్, అరారియా, కిషన్‌గంజ్ జిల్లాలు ఈ దశలో ముఖ్యమైన ప్రాంతాలుగా నిలిచాయి. కిషన్ గంజ్ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల సమయానికి 66.16 శాతం పోలింగ్ జరిగింది.

ఈ ప్రాంతాల్లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. అయితే, రాజకీయ వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ ఈసారి “జన్‌సురాజ్” పార్టీతో ఎన్నికల రంగంలో అడుగుపెట్టడం ఓటర్లలో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఫలితాల ద్వారా స్పష్టమవుతుంది.
ఎగ్జిట్ పోల్స్‌కు ముందే ఊపిరి బిగబట్టిన పార్టీలు
సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగానే, ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న సమయం — 6.30 గంటలు — బిహార్‌లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠను కలిగిస్తోంది. జాతీయ ఛానళ్లు తమ సర్వేలు సిద్ధం చేసుకున్నాయి. ప్రతి సంస్థ తమ డేటా ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించబోతోంది. ఈ ఫలితాలు ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంటాయో అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చనీయాంశంగా ఉంది.
నవంబర్ 14న కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్
మొత్తం 243 నియోజకవర్గాల కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనుంది. ప్రతి దశలో ఎన్నికల కమిషన్ సీటు వారీగా ఫలితాలను ప్రకటించనుంది.
Read More
Next Story