ఇద్దరు మిత్రుల మధ్య గ్యాప్ ? కారణమిదేనా ?
x

ఇద్దరు మిత్రుల మధ్య గ్యాప్ ? కారణమిదేనా ?

ఢిల్లీ పరిణామాల నేపధ్యంలో కేసీఆర్-జగన్మోహన్ రెడ్డి మధ్య బాగా గ్యాప్ వచ్చేసిందనే చర్చ తెలంగాణా రాజకీయాల్లో బాగా జరుగుతోంది.


ఇపుడీ విషయంపైనే రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఢిల్లీ పరిణామాల నేపధ్యంలో కేసీఆర్-జగన్మోహన్ రెడ్డి మధ్య బాగా గ్యాప్ వచ్చేసిందనే చర్చ తెలంగాణా రాజకీయాల్లో బాగా జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు కొన్ని రాజకీయపార్టీలు మద్దతుతెలిపినా బీఆర్ఎస్ మాత్రం ఎక్కడా కనబడలేదు. ధర్నాలో కనబడకపోగా కనీసం కేసీఆర్ లేదా కేటీఆర్ నుండి మద్దతు ప్రకటన కూడా రాలేదు. దాంతో ఇద్దరు అధినేతల మధ్యా గ్యాప్ వచ్చేసిందనే ప్రచారం పెరిగిపోతోంది.



ఏపీలో వైసీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ నేతలు, క్యాడర్ పై దాడులు పెరిగిపోతున్నాయి. వైసీపీ నేతలు, క్యాడర్ను టార్గెట్ చేసి టీడీపీ నేతలు, క్యాడర్ దాడులు చేస్తున్నారంటు జగన్ అండ్ కో నానా గోలచేస్తున్నారు. జరుగుతున్న ప్రతిదాడి వెనుక టీడీపీ నేతలు, క్యాడరే ఉన్నారనటానికి ఆధారాలు లేవు కాని చాలా ఘటనల్లో సైకిల్ పార్టీ నేతలు, క్యాడర్ ఉన్నారన్నది వాస్తవం. జగన్ లెక్కప్రకారం గడచిన నెలరోజుల్లోనే వైసీపీ క్యాడర్ 35 మందిని టీడీపీ నేతలు, క్యాడర్ హత్యచేశారు. ఇళ్ళల్లోకి దూరి మరీ కొట్టడం, కొన్నిచోట్ల వైసీపీ నేతల వాహనాలను దగ్ధంచేయటం, కొందరు ఊర్లువదిలేట్లుగా బెదిరించటాలు, ధౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. నడీరోడ్డులోనే మాచర్లు, వినుకొండలో వైసీపీ కార్యకర్తలను హత్యచేసినా పోలీసులు పట్టించుకోవటంలేదని జగన్ ఆరోపిస్తున్నారు.



చంద్రబాబునాయుడు, లోకేష్ తెరవెనుక ఉండి తమ నేతలు, క్యాడర్ పై ఉద్దేశ్యపూర్వకంగానే దాడులు చేయిస్తున్నట్లు జగన్ ఆరోపిస్తున్నారు. పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నపుడు టీడీపీ నేతలు, క్యాడర్ దాడులుచేయటం సంచలనమైంది. మిథున్ మద్దతుదారులు ప్రతిఘటించటంతో టీడీపీ నేతలు, క్యాడర్ ఎంపీ కారును కాల్చేశారు. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో జగన్ నాయకత్వంలో ఢిల్లీలో ఉదయం నుండి సాయంత్రం వరకు ధర్నా జరిగింది. నిరసన కార్యక్రమంలో ఇండియా కూటమిలోని సమాజ్ వాదీపార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, శివసేన అధినేత ఉద్థవ్ థాక్రే తరపున రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తో పాటు మద్దతుదారులతో పాటు మరికొన్ని పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. జాతీయ మీడియా కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని బాగా హైలైట్ చేసింది.



జగన్ ఆధ్వర్యంలో అంత ఇంపార్టెంట్ కార్యక్రమం జరిగితే బీఆర్ఎస్ నుండి ఒక్క ఎంపీ కూడా పాల్గొనలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. అయినా నిరసన కార్యక్రమంవైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎంపీలు అటువైపు చూడలేదు సరే మరి కేసీఆర్ లేదా కేటీఆర్ కు ఏమైంది ? జగన్ నిరసన కార్యక్రమానికి మద్దతిస్తున్నట్లు లేదా సంఘీభావంగా ఒక ప్రకటన కూడా లేదు. కేసీఆర్-జగన్ ఎంతటి ఆప్తమిత్రులో అందరికీ తెలిసిందే. ఇద్దరు అధికారంలో ఉన్నపుడు సమావేశాల్లో చాలా ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళని సంగతి అందరికీ తెలిసిందే. ఇపుడంటే ఇద్దరు ఓడిపోయారు కాబట్టి కలిసి మాట్లాడుకునేందుకు ఏమీలేదనే చెప్పాలి. అయినా బీఆర్ఎస్ ఓడిపోగానే కేసీఆర్ కు ప్రమాదం జరిగి కాలి తుంటిఎముక విరిగి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నపుడు జగన్ పరామర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది.



కేసీఆర్ ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా బీఆర్ఎస్ పార్టీ నేతలు, క్యాడర్ మీద కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి దాడులు జరగలేదు. కాబట్టి పార్టీల పరంగా కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. అదే ఏపీ విషయంలో చూస్తే వైసీపీ నేతలు, క్యాడర్ బిక్కబిక్కుమంటున్నారు. ఏరోజు ఎవరిపైన టీడీపీ నేతలు, క్యాడర్ దాడులుచేస్తారో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో జగన్ ను ఊరడిస్తు కేసీఆర్ లేదా కేటీఆర్ నుండి ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా రాలేదంటేనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మిత్రుడు జగన్ కష్టాల్లో ఉంటే అండగా నిలబడాల్సిన కేసీఆర్ పట్టించుకోపోవటంతోనే ఇద్దరు మిత్రుల మధ్య గ్యాప్ వచ్చేసిందనే ప్రచారం పెరిగిపోతోంది.




ఢిల్లీలో నిరసన కార్యక్రమం తర్వాత జగన్ ఇండియా కూటమివైపు వెళుతున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జాతీయస్ధాయిలో ఏదో కూటమి అండ అవసరమని జగన్ కు అర్ధమైనట్లుంది. అందుకనే తమకు మద్దతుగా ఉండమని ఇండియా, ఎన్డీయే కూటములను జగన్ విజ్ఞప్తిచేశారు. చంద్రబాబు ఎన్డీయేలో ఉన్న కారణంగా బహుశా అధికారకూటమి నుండి జగన్ కు మద్దతు దొరకలేదు. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇండియా కూటమిలోని పార్టీల నుండి మద్దతు లభించింది. ఇక కేసీయార్ విషయానికి వస్తే తొందరలోనే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ ప్రచారానికి ఊతమిచ్చేట్లుగానే నరేంద్రమోడికి వ్యతిరేకంగా కేసీయార్ ఏమీ మాట్లాడటంలేదు. ఒకపుడు అగ్గిరాజేస్తా, మంటలు మండిస్తా అని చెప్పిన కేసీయార్ ఇపుడు అలాంటి మాటలు మాట్లాడటంలేదు. జగన్ ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారన్న సమాచారం ఉండటంతోనే కేసీయార్ దూరంగా ఉంటున్నారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా కొద్దిరోజుల్లోనే ఈ విషయమై క్లారిటి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏమి జరుగుతుందో.

Read More
Next Story