కుప్పంకు ’భువనమ్మ భరోసా‘
x

కుప్పంకు ’భువనమ్మ భరోసా‘

నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో ఉన్నారు.డీకేపల్లిలో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొనడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని వెల్లడించారు.


ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు. కుప్పం నియోజకవర్గంలోని డీకేపల్లిలో జరిగిన హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి ఆ ఘట్టాన్ని “ప్రత్యేకమైన అనుభూతి”గా అభివర్ణించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న త్రాగు నీరు, సాగు నీరు ఒకేసారి కుప్పానికి చేరుకోవడంతో ప్రజల కళ్లల్లో కనిపించిన ఆనందం, నవ్వులు హృదయాన్ని హత్తుకున్నాయని ఆమె వెల్లడించారు.

“ఈ రోజు హంద్రీనీవా నీరు కుప్పానికి చేరింది. దీన్ని సాక్షాత్తూ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను కుప్పానికి తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల దేవుడయ్యారు” అని భువనేశ్వరి భావోద్వేగంతో చెప్పారు. ప్రజల ప్రేమ.. ఎన్నటికీ మరచిపోలేని అనుభవం అని వెల్లడించారు. దశాబ్దాలుగా నీటి ఎద్దడితో సతమతమైన కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా త్రాగు నీరు, సాగు నీరు రెండూ ఒకేసారి అందడం ఒక చారిత్రక ఘట్టం. ఈ సందర్భంగా డీకేపల్లి వద్ద జరిగిన జలహారతి కార్యక్రమం ప్రజల్లో అపార ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి ఆ సంతోషాన్ని పంచుకోవడం మరింత సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు.

కుప్పం పర్యటన రెండో రోజు ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను, నాయకులను ఆప్యాయంగా కలిసిన భువనేశ్వరి ప్రతి ఒక్కరినీ పలకరించి, వారి సమస్యలు విని, భరోసా ఇచ్చారు. “కుప్పం ప్రజలు మా మీద చూపుతున్న ప్రేమ, ఆప్యాయత ఎన్నటికీ మరువలేనివి. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఆమె ఎమోషనల్‌గా పేర్కొన్నారు.

సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్న వినికిడి పరికరాలను అవసరమైన వారికి అందజేశారు. స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకుని కుప్పం పేరు రాణించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ALEAP (అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) బృందాన్ని కలిసి మాట్లాడారు. మహిళల సాధికారత, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార అవకాశాల కోసం వారు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. “తమ భవిష్యత్తును ధైర్యంగా నిర్మించుకుంటున్న ప్రతి మహిళకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని ఆమె ట్వీట్ చేశారు.

Read More
Next Story