
టిటిడి చైర్మన్‌పై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
విలువైన భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారో సమాధానం చెప్పాలి. భూమన కరుణాకర్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత విలువైన భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి ప్రశ్నించారు. ఈ విషయంలో తన ప్రశ్నలకు బీఆర్ నాయుడు ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదని ఆయన అన్నారు.
గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన, తన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా బీఆర్ నాయుడు బూతులు తిడుతున్నారని ఆరోపించారు. "బీఆర్ నాయుడి వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావడం హిందువుల దురదృష్టం" అని భూమన తీవ్రంగా విమర్శించారు.
అలాగే, తనపై బీఆర్ నాయుడు చేస్తున్న ఆరోపణలపైనా భూమన స్పందించారు. బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయనో దోపిడీదారుడు, పైరవీకారుడు అని ధ్వజమెత్తారు. "అలాంటి వ్యక్తి బెదిరింపులకు మేము భయపడం. నాపై చేసే ఆరోపణలకు సీబీఐ విచారణకైనా సిద్ధం" అని ఆయన సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ సొసైటీలో బీఆర్ నాయుడు అనేక అక్రమాలు చేశారని, అతని అరాచకాలపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని భూమన స్పష్టం చేశారు.
బీఆర్ నాయుడు తన టీటీడీ చైర్మన్ పదవిని రాజకీయాలకు వాడుకుంటున్నారని భూమన ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలపై నిరంతరం దూషణలకు దిగుతున్నారని చెప్పారు. "క్విడ్ ప్రో కింద బీఆర్ నాయుడికి ఆ పదవి వచ్చింది. ఆ పదవి శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలి" అని ఆయన బీఆర్ నాయుడిని హెచ్చరించారు.