మిలియన్ అమేజింగ్  ఉమెన్ కోసం వరల్డ్ టూర్!
x

భరద్వాజ్ 2006లో బైక్‌పై ప్రపంచ యాత్రకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి

'మిలియన్ అమేజింగ్ ఉమెన్' కోసం వరల్డ్ టూర్!

మహిళా దినోత్సవం నాడు పదేళ్ల సుదీర్ఘ ప్రపంచయాత్రకు శ్రీకారం. వినూత్నంగా ఉండాలన్న కోరికే దీనికి పునాది. లక్ష్యానికి పెళ్లి అడ్డని బ్రహ్మచారిగానే ఉన్నా.. భరద్వాజ్.

కొంతమంది చిన్నతనంలోనే పెద్ద కలలు కంటారు. జీవితంలో ఏదో ఒక మంచి పనితో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాలని కోరుకుంటారు. ఆ లక్ష్య సాధనకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అందుకోసం ఎంతగానో శ్రమిస్తారు. కోటికొక్కరు తమ జీవితాన్ని సైతం ఫణంగా పెడతారు. అలాంటి వారిలో ఒకరు భరద్వాజ్ దయాల. తన చిన్న నాటి సంకల్పానికి వైవాహిక జీవితం అడ్డంకిగా మారుతుందని ఏకంగా పెళ్లినే వద్దనుకున్నారు. నెలకు ఆరంకెల జీతాన్ని సంపాదిస్తున్నా బ్రహ్మచారిగా ఉండిపోయారు. ఇప్పుడాయన ఐదున్నర

పదుల వయసులో అన్ని వర్గాల మహిళాల స్థితిగతులపై అధ్యయనానికి నడుం బిగించారు. అలాంటి వారు వెయ్యో పది వేల మందో కాదు.. ఏకంగా పది లక్షల మంది (ఒక మిలియన్) మగువల చిత్రాలను తన కెమెరాలో బంధించి, వాటిని ఓ వెబ్సైట్లో నిక్షిప్తం చేసి ప్రపంచానికి చూపించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రపంచాన్ని చుట్టి రావడానికి ముహూర్తం పెట్టుకున్నారు. దానికి 'మిలియన్ అమేజింగ్ ఉమెన్' (Million Amazing Women) అనే పేరుతో ప్రపంచ యాత్ర (World Tour) కు సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర ఏడాదో, రెండేళ్లో కాదు.. దాదాపు పదేళ్ల పాటు కొనసాగించనున్నారు.

నాటి ప్రపంచ యాత్ర ముగించుకుని వచ్చి ఢిల్లీ పార్లమెంట్ భవనం వద్ద భరద్వాజ్ విజయకేతనం

తన యాత్రకయ్యే ఖర్చును తనకొచ్చే నెల జీతం నుంచే వెచ్చించనున్నారు. అత్యంత అరుదైన ఆ సాహస సంకల్ప యాత్రికుడి పేరు భరద్వాజ్ దయాల. ఊరు విశాఖపట్నం. చదివింది న్యాయశాస్త్రం. సాఫ్ట్ వేర్ ఉద్యోగం. ప్రవృత్తి ఫోటోగ్రాఫర్! ఇప్పటికే మోటార్ సైకిల్ పై సోలో గా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తొలి భారతీయుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు భరద్వాజ్. మహిళల కోసం మరోసారి ప్రపంచ యాత్రకు సంసిద్ధులవుతున్నారు. తన లక్ష్య సాధనకు దారి తీసిన పరిస్థితులపై భరద్వాజ్ తో 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి జరిపిన ఇంటర్వ్యూ విశేషాలివీ!

ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్: మీకు మిలియన్ అమేజింగ్ ఉమెన్ సంకల్పం ఆలోచన ఎందుకు వచ్చింది?

భరద్వాజ్: ఫోటోగ్రఫీ ప్రవృత్తిగా చేసుకున్న నాకు ఈ ప్రపంచంలో అప్పటికి, ఇప్పటికీ మహిళల ఆర్థిక, జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? వారెంతగా అభివృద్ధి చెందారు? వారి పోరాటాలు, విజయాలు, లక్ష్య సాధనకు ఎంచుకున్న మార్గాలు, వారి బాగు కోసం ఇంకేమి చేయాలి? వంటి ఆలోచనలు నాలో రేకెత్తాయి. మహిళలు ఒక్కో దేశంలో ఒక్కోలా జీవనం సాగిస్తున్నారు. వీరిలో మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న వారూ, ఇప్పటికీ అట్టడుగు స్థితిలో దుర్భర జీవితంతో

కాలం వెళ్లబుచ్చుతున్న వారూ ఉన్నారు. అలాంటి వారి కోసం ఏ కొన్ని దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచమంతా తిరిగితే అన్ని వర్గాలు, జాతుల మహిళామణుల స్థితిగతులు ప్రత్యక్షంగా అవగతమవుతాయి. అందుకోసమే మిలియన్ అమేజింగ్ ఉమెన్ ప్రాజెక్టును సంకల్పించాను. వాటన్నిటినీ భావితరాల కోసం నిక్షిప్తం చేస్తాను.

తన ప్రపంచ పర్యటనలో దుబాయ్ రాజు సోదరునితో భరద్వాజ్

ద ఫెడరల్: మీ ప్రపంచ యాత్రకు శ్రీకారం ఎప్పుడు?

భరద్వాజ్: మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల కోసం చేపడ్తున్న ఈ యాత్రను అదే రోజున ప్రారంభించడం సముచితమని భావించాను. అందుకోసం ఆ రోజు విశాఖలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. దానికి దేశంలోని వివిధ రంగాల్లోని విశిష్ట మహిళలను ఆహ్వానిస్తున్నాను. వారిలో గృహిణి నుంచి ఉన్నత స్థానంలోను, సేవారంగంలోను ఉన్న పది మందికి మోస్ట్ అమేజింగ్ ఉమెన్ అవార్డులిస్తాం. అనంతరం అదే రోజు ప్రపంచ యాత్రకు శ్రీకారం చుడతాను. అంతకు ముందు ప్రధాని మోదీతో ఫిబ్రవరి నెలలో దీనిపై పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది.

ద ఫెడరల్: మిలియన్ అమేజింగ్ ఉమెన్ లక్ష్య ఛేదన ఎలా?

భరద్వాజ్: నేను పర్యటించే దేశాల్లో మహిళల స్థితిగతులను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటాను. వీరిలో కూలీ నాలి చేసుకునే వారి నుంచి అత్యున్నత పదవులు, స్థితిలో ఉన్న (లోకల్ టూ గ్లోబల్) వారూ ఉంటారు. వారి కష్టాలు, విజయాలు, స్వయంకృషి, మహిళా సాధికారత, అభివృద్ధికి ఆ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ఇంకేమి చేయాలి? వంటి అంశాలన్నిటినీ తెలుసుకుంటాం. ఇలా ఒక మిలియన్ అంటే. పది లక్షల మంది మహిళా మణుల పోర్ట్రెయిట్ల సహా వారి జీవితాల స్థితిగతులను డాక్యుమెంట్ చేసి వాటిని మిలియన్ అమేజింగ్ ఉమెన్ వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తాను. ఇందుకోసం ఆయా దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, మీడియా, సామాజిక మాధ్యమాల సహకారం తీసుకుంటాను.

ద ఫెడరల్: మీ యాత్ర ఎన్ని దేశాలు? ఎన్నాళ్లు ?

భరద్వాజ్: మిలియన్ అమేజింగ్ ఉమెన్ కోసం ప్రపంచ యాత్రను 195 దేశాల్లో చుట్టి వస్తాను. రోజుకు పది గంటల సమయం వెచ్చిస్తే ఈ యాత్ర పూర్తి కావడానికి దాదాపు పదేళ్లు పట్టవచ్చని అంచనా. రోజూ ఆన్లైన్ ఉద్యోగానికి కూడా కొంత సమయం కేటాయిస్తాను. నాతో పాటు మరో ముగ్గురు సహాయకులు ఉంటారు. ప్రతి మూడు నాలుగు నెలకొకసారి వారి స్థానంలో కొత్తవారు వస్తారు. నా సుదీర్ఘ ప్రయాణం టాటా వింగర్ లేదా ఫోర్స్ ట్రావెలర్ లో చేయాలనుకుంటున్నాను.

సినిమాటోగ్రఫీ సెటప్ తో భరద్వాజ్

ద ఫెడరల్: ఈ యాత్రకయ్యే ఖర్చు సంగతి?

భరద్వాజ్: నా యాత్రకు నెలకు సగటున రూ 3 లక్షలు ఖర్చవుతుంది. నేను ఆన్లైన్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాను. నాకు నెలకు రూ.3 లక్షల వరకు జీతం వస్తుంది. ఆ మొత్తాన్ని నా యాత్ర కోసమే వెచ్చిస్తాను.

ద ఫెడరల్: మీ సంకల్పానికి స్ఫూర్తి ఎవరు?

భరద్వాజ్: చిన్నప్పట్నుంచి నేను అందరిలా కాకుండా వినూత్నంగా ఉండాలనుకునే వాణ్ని. నా సంకల్పానికి నేనే స్ఫూర్తిదాతను. నాకు కలిగిన ఆలోచనే నా తొలి ప్రపంచ యాత్ర. ఆ ఆలోచనే ఇప్పుడు ‘మిలియన్ అమేజింగ్ ఉమెన్’ ప్రాజెక్టు నా లక్ష్యం వైపు పయనించేందుకు పునాదులు వేసింది.

ద ఫెడరల్: గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారా?

భరద్వాజ్: తొలిసారి నేను 19 ఏళ్ల క్రితం 2006లో మోటార్ సైకిల్ ప్రపంచ యాత్ర చేపట్టాను. నా యాత్రను విశాఖపట్నంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఐదు ఖండాలు, 16 దేశాల్లో 47 వేల కిలోమీటర్లు ప్రయాణించాను. నా యాత్ర పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. తిరుగు ప్రయాణంలో నేటి ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. నాటి యాత్రలో అప్పట్లో దేశంలోనే సోలో బైక్ రైడర్గా ప్రపంచ యాత్ర పూర్తి చేసిన తొలి భారతీయుడినిగా రికార్డు సాధించాను. ఆ అనుభవంతోనే ఇప్పుడు రెండోసారి మిలియన్ అమేజింగ్ ఉమెన్ ప్రాజెక్టు యాత్రకు సన్నద్ధమవుతున్నాను. తొలి ప్రపంచ యాత్ర తర్వాత కూడా యువతకు ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతపై అవగాహన కోసం వందేమాతరం పేరిట ఒకసారి, ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధారణపై అవగాహనకు మరోసారి, మహిళా సాధికారితపై ఇంకోసారి దేశమంతటా టూర్ చేశాను.

భరద్వాజ్ దయాల

ద ఫెడరల్: మీ కుటుంబం నుంచి సపోర్టు ఎలా ఉంది?

భరద్వాజ్: నాకు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు. వాళ్లందరికీ ఇదివరకే పెళ్లిళ్లు అయ్యాయి. నాకు ఏళ్ల తరబడి యాత్రల పేరిట దేశ, విదేశాల్లో తిరగడం, ఫోటోలు తీయడం అంటే నాకు ఇష్టం. అందువల్ల పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం, పిల్లలు వంటి బాంధవ్యాలతో నా స్వేచ్ఛకు, ఆసక్తికి విఘాతం కలుగుతుంది. అందువల్ల పెళ్లి తలంపును విరమించుకున్నాను. నా నిర్ణయం అమ్మా నాన్నలకు ఇష్టం లేకపోయినా అతి కష్టమ్మీద వారికి నచ్చజెప్పాను. చివరకు వాళ్లూ అంగీకరించారు. కొన్నాళ్ల క్రితం అమ్మానాన్నలు కన్నుమూశారు. నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు నా ఆసక్తికి అడ్డు చెప్పకుండా ప్రోత్సహిస్తున్నారు.

ద ఫెడరల్: మీ అల్టిమేట్ గోల్ ఇంకేమైనా ఉందా?

భరద్వాజ్: మిలియన్ అమేజింగ్ ఉమెన్ ప్రాజెక్టును పూర్తి చేయడమే నా జీవిత లక్ష్యం. ఇప్పుడు నా వయసు 55 ఏళ్లు. నేను చేపట్టే ప్రపంచ యాత్ర పూర్తి కావడానికి పదేళ్లు పడుతుంది. అప్పటికి నాకు 65 ఏళ్లు నిండుతాయి. ఈ యాత్ర విజయవంతంగా పూర్తయితే అంతకు మించిన ఆనందం, సంతృప్తి ఇంకేం ఉంటుంది నాకు చెప్పండి?

Read More
Next Story