ఆదివాసీ ‘భలి పారొబ్‌’లో పవన్ కల్యాణ్!
x
అడవిబాట కార్యక్రమంలో గిరిజనులతో పవన్‌ కల్యాణ్‌ సెల్ఫీ (ఫైల్‌)

ఆదివాసీ ‘భలి పారొబ్‌’లో పవన్ కల్యాణ్!

స్నేహానికి ప్రతీక అయిన ఈ ఉత్సవంలో పాల్గొంటున్న తొలి రాజకీయ నాయకుడు పవనే...


ఆదివాసీల్లో స్నేహనికిచ్చే విలువ వెలకట్టలేనిది. అనాదిగా నేస్తానికి వారి పూర్వీకులు వేసిన పునాది ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఒక తరానికే స్నేహం పరిమితం కాకుండా పిల్లపిల్ల తరంతరాలు కొనసాగేలా తీర్చిదిద్దిన అతి గొప్ప సంప్రదాయమే ‘భలి పారొబ్‌’ పండుగ! మూడేళ్లకోసారి మాత్రమే జరుపుకునే ఈ ఉత్సవం 12 రోజుల పాటు ఉంటుంది. ఈ ఏడాది అల్లూరి జిల్లా అరకులోయ మండలం మాడగడలో ఆగస్టు 25న ప్రారంభమైన ఈ పండుగను సెప్టెంబర్‌ 5న (శుక్రవారం) ముగిస్తున్నారు. ముగింపు ఉత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పండుగ చరిత్రలో ఈ స్థాయి రాజకీయ నాయకులు హాజరు కాకపోవడం విశేషం!


ఒకరికొకరు వంగి నమస్కరించుకుంటున్న నేస్తాలు

భలి పొరొబ్‌ పండుగ ఏమిటి?
గిరిజనులు మూడేళ్లకోసారి, వరుసగా మూడేళ్ల పాటు జరుపుకునే భలి పారొబ్‌ ఉత్సవానికో ప్రత్యేకత ఉంది. మిగతా పండుగల్లా పిండివంటల కోసమో, తినుబండారాల కోసమో జరుపుకునేది కాదిది. దీని వెనక స్నేహం పది కాలాల పాటు పదిలంగా పరిఢవిల్లాలన్న ఉద్దేశంతో వందల ఏళ్ల క్రితమే అంకురించింది. అప్పట్నుంచి అది కొనసాగుతూ వస్తోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరి కొన్ని గిరిజన గ్రామాల్లోనూ ఈ పండుగను జరుపుకునే ఆచారం ఉన్నప్పటికీ మాడగడలోనే ప్రధాన ఉత్సవం నిర్వహిస్తారు. మాడగడలో బలి దేవత నేతృత్వంలో 12 మంది గ్రామదేవతలు కొలువై ఉంటారు. ఉత్సవం ఆరంభమైన నాటి నుంచి 12 రోజుల పాటు ఈ గ్రామ దేవతలను పూజిస్తారు. తొలిరోజు మానవాళి, పాడిపంటలు, సుఖ సంతోషాలు, మైత్రితో జీవించాలని ఆకాంక్షిస్తూ రూపొందించిన పాటను మొదలు పెట్టి ఆఖరి రోజు వరకు పాడతారు. గ్రామదేవత వద్ద ఇద్దరు మహిళా పూజారిణులు, ఇద్దరు సహాయ కన్యలూ ఉంటారు.
ఈ ఉత్సవంలో 12 మంది అన్నదమ్ములు, 12 మంది అక్కచెల్లెళ్లు కీలకపాత్ర పోషిస్తారు. తొలిరోజు ఈ 12 మంది అక్కచెల్లెళ్లు సమీపంలోని పవిత్ర గెడ్డకు వెళ్లి ఇసుకను తీసుకొచ్చి బలి దేవాలయంలో భద్రపరుస్తారు. గ్రామ బారికి వారికి ఒడిశా నుంచి తెచ్చిన గోధుమ గింజలను ఈ అక్కచెల్లెళ్లకు ఇస్తాడు. చిన్నబుట్టల్లో ఆ విత్తనాలు వేస్తారు. ఆరు రోజుల్లో అవి మొలకెత్తుతాయి. వాటిని బలి పుష్పాలుగా భావిస్తారు. అలాగే తమ ప్రాంతంలో పండిన పండ్లు, కూరగాయలను అక్కడకు తెచ్చి ఉంచుతారు. వాటిని, ఆ పుష్పాలను దొంగిలించకుండా గిరిజనులు దేవుడిగా భావించే భీమరాజు శిష్యులు మాదిరి ఉపవాసంతో కాపలా ఉంటారు.
వీరిని ముళ్లపీటపై కూర్చోబెడతారు. అయినా వాటికి గుచ్చుకోకపోవడమే మహత్మ్యంగా భావిస్తారు. ముగింపు రోజున ఈ శిష్యులు గ్రామంలో ఎవరికీ కనిపించకుండా అనంతగిరి మండలం వాలాపీ గ్రామంలోని దోనుమరికొండకు కాలినడకన చేరుకుంటారు. అక్కడ కొండదేవుడిని బెత్తం వృక్షం చూపించమని నృత్యాలు చేస్తూ వేడుకుంటారు. పండుగ ముగిసిన మర్నాడు భలి పుష్పాలను ఆయా గ్రామాల్లో పంచుతారు. భలి పుష్పాలను తిరిగి గెడ్డలో వదిలి పెట్టడంతో పండుగను ముగిస్తారు. ఈ సంప్రదాయ ఉత్సవానికి అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

భలి పండుగలో పాల్గొన్న గిరిజనులు

చెవిలో పుష్పంతో స్నేహ బంధం!
అన్నిటికీ మించి ఈ బలి పొరాబ్‌ పండుగలో మరో ప్రత్యేకత ఉంది. పండుగ ముగింపు రోజు గోధుమ గింజల నుంచి వచ్చిన మొలకలను పుష్పంగా భావిస్తారు. దానిని తమకు నచ్చిన వారి చెవిలో పెడితే ఆ రోజు నుంచి వాళ్లు నేస్తం అయినట్టే. ఇలా ఆడవారు, మగవారు ఎవరు ఎవరికైనా పుష్పం పెట్టి స్నేహాన్ని కోరుకోవచ్చు. ఒకసారి నేస్తం అయ్యాక వారు జీవితాంతం మిత్రులుగానే ఉంటారు. ఎప్పుడూ శత్రువులు కారు. వీరే కాదు.. వారి పిల్లలు, పిల్లల పిల్లలు కూడా స్నేహంగానే కొనసాగుతారు. మరో విచిత్రమేమిటంటే? స్నేహితులయ్యాక వీరు ఇక పేరు పెట్టి పిలుచుకోకూడదు. నేస్తం అని మాత్రమే పిలుచుకోవాలి. ఎప్పుడైనా ఒకరికొకరు తారసపడితే వారు ధరించిన పాదరక్షలను (చెప్పులను) విడిచిపెట్టి రెండు చేతులు జోడించి చిరునవ్వుతో ఒకరికకొకరు నమస్కరించుకోవాలి. ‘జువార్‌ గోత్‌ (ఇది ఒరియా పదం.. తెలుగులో నమస్కారం మిత్రమా) అని సంభోదించుకుంటారు. ఇలా ఒకరు ఎంతమందితోనైనా స్నేహాన్ని (పువ్వు పెట్టి) కొనసాగించుకోవచ్చు. స్నేహబంధాలు స్వార్థ బంధాలుగా మారిపోయి కొన్నాళ్లకే తెంచుకుంటున్న ఈ రోజుల్లో తరతరాలు మైత్రీ బంధాన్ని కొనసాగిస్తున్న ఈ గిరిజనులే అసలు సిసలైన నేస్తాలు!

భలి దేవతకు పూజలు చేస్తున్న పూజారిణులు

5న మాడగడకు పవన్‌ కల్యాణ్‌..
బలి పారొబ్‌ పండుగ ముగింపు రోజు ఈనెల 5న ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆరోజు ఆయన నేరుగా మాడగడకు చేరుకుంటారు. ఈ ఉత్సవం గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న పవన్‌.. గిరిజనులకు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో మాడగడ గిరిజనులు తమ గ్రామానికి రావాలని పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం బలి పారొబ్‌ ఉత్పవంలో పాల్గొనడానికి మాడగడకు వస్తున్నారు.

భీమరాజు శిష్యులు కూర్చునే ముళ్లపీటలు

పవన్‌ కోసం ఎదురు చూస్తున్నాం..
‘పవన్‌ కల్యాణ్‌ మా గిరిజన సంప్రదాయాలను గౌరవించడం గొప్ప విషయంగా భావిస్తున్నాం. మా గిరిజనులంతా ఆనందిస్తున్నాం. గతంలో ఎప్పుడూ మా ఈ పండుగకు ఏ రాజకీయ నాయకులను ఆహ్వానించ లేదు. తమంతట తాము ఎవరూ రాలేదు. పవన్‌ మాత్రమే తొలిసారిగా వస్తున్నారు. ఆయన రాక కోసం మా మాడగడ గ్రామం అంతా ఎదురు చూస్తోంది’ అని మాడగడ సర్పంచ్‌ మాడియా కె.జ్యోతి ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.

భీమరాజు శిష్య బృందం

అడవిబాటలో అడుగెట్టిన పవన్‌..
పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో అడవి బాట కార్యక్రమంలో తొలిసారిగా అల్లూరి జిల్లాలో ఏప్రిల్‌ ఏడో తేదీన అడుగుపెట్టారు. రెండు రోజుల పాటు ఆయన ఆ జిల్లా పల్లెల్లో పర్యటించారు. గిరిజనుల కష్టసుఖాలనడిగి తెలుసుకున్నారు. పవన్‌ తన పర్యటన ముగించుకుని వెళ్లాక గిరిజనులకు చెప్పులను పంపించారు.
Read More
Next Story