గురి తప్పిన సుపారీ!
x
మీడియా సమావేశంలో నిందితులతో పోలీసు అధికారులు

గురి తప్పిన సుపారీ!

తనను మోసం చేసిన విలేకరిని అంతమొందించడానికి తన ప్రియుడితో కలిసి ఓ వివాహిత వేసిన ప్లాన్‌ బెడిసి కొట్టింది.

అనకాపల్లి జిల్లా, ఎస్‌.రాయవరం మండలం, అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భర్తతో విడిపోయి మరొకరితో సన్నిహితంగా ఉంటున్న ఎస్‌.రాయవరానికి చెందిన ఎం.నూకేశ్వరి తనను మోసం చేసిన ఓ జర్నలిస్టును హతమార్చడానికి సుపారీ గ్యాంగ్‌తో ప్లాన్‌ వేయడం, ఆ గ్యాంగ్,, ఆ విలేకరికి బదులు మరొక అమాయకుడిపై దాడి చేయడంతో ఆయన చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. అసలేం జరిగిందంటే?

ఎస్‌.రాయవరం మండల కేంద్రానికి చెందిన ఎం.నూకేశ్వరికి కాకినాడ జిల్లా తుని నివాసితో గతంలో పెళ్లయింది. కుటుంబ తగాదాలతో మూడేళ్ల క్రితం నూకేశ్వరి తన భర్తతో విడిపోయింది. అయినప్పటికీ వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీనిపై తనకు న్యాయం చేయాలని నూకేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నూకేశ్వరికి అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఉంటున్న రుద్ర అనే ఓ న్యూస్‌ ఛానల్‌ విలేకరి పరిచయమయ్యాడు. తరచూ ఆమె వెంట పోలీస్‌ స్టేషన్‌కు తోడుగా వెళ్లేవాడు. పోలీసుల ద్వారా సమస్యను పరిష్కరిస్తానని నమ్మించి ఆమె నుంచి రూ.లక్ష నగదు, 6.5 తులాల బంగారం తీసుకున్నాడు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు సహకరించకపోవడంతో రుద్రను నిలదీసింది. ఇలా ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. తానిచ్చిన బంగారం, నగదు తిరిగి ఇవ్వాలని కోరినా రుద్ర ఇవ్వకపోవడంతో అతనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రుద్ర.. నూకేశ్వరికి తునికి చెందిన బర్రె పైడిరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పైడిరాజు భార్యకు, నూకేశ్వరి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు కారణమైన విలేకరి రుద్రను హత్య చేయించాలని నూకేశ్వరి తన ప్రియుడు పైడిరాజుతో కలిసి ప్లాన్‌ వేసింది. ఇందుకోసం తుని పట్టణానికి చెందిన కిరాయి రౌడీలు శామ్యూల్‌ అలియాస్‌ శ్యామ్, ఇసరపుడి జాన్‌ ప్రసాద్, రాయుడు రాజ్‌కుమార్‌లతో రూ.లక్ష సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఈనెల 11న నూకేశ్వరి, పైడిరాజులు ఈ కిరాయి హంతకులకు విలేకరి ఇంటిని చూపించారు. కిరాయి హంతకులు అదే రోజు రాత్రి పూటుగా మద్యం తాగారు. ఆ మద్యం మత్తులో రూటు మరిచిపోయి విలేకరి ఇంటికి కాకుండా అక్కడకు అర కిలోమీటరు దూరంలో ఉన్న మరొకరి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో నిద్రిస్తున్న నాగేశ్వరరావు (కల్యాణ మండపం వాచ్‌మేన్‌) అనే వ్యక్తిపై ఇనుప రాడ్లతో బలంగా దాడి చేశారు. తాము దాడి చేసి చంపింది విలేకరి రుద్రనే అనుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
నిర్ధారించుకోవడంతో నిజం తెలిసి..
సుపారీ ముఠా ఒప్పందం ప్రకారం తాము రుద్రను చంపేశామని, తమ సొమ్ము ఇవ్వాలని నూకేశ్వరరి, పైడిరాజులకు చెప్పారు. అయితే విలేకరి చనిపోయాడా? లేదా? అని నిర్ధారించుకోవడానికి వీరిద్దరు మరో వ్యక్తి ద్వారా రుద్ర నంబరుకు ఫోన్‌ చేయించారు. అయితే రుద్ర మామూలుగానే మాట్లాడడంతో కంగుతిన్నారు. దీంతో వీరు సుపారీ గ్యాంగ్‌ను నిలదీశారు. తాము చెప్పిన రుద్రను హత్య చేస్తేనే రూ.లక్ష ఇస్తామని, లేకపోతే ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో మరోసారి వెళ్లి చంపుతామని వారికి భరోసా ఇచ్చారు. రుద్రను ఈసారి నిజంగా హతమార్చడానికి ఈనెల 18 సాయంత్రం సుపారీ గ్యాంగ్‌ అడ్డరోడ్డు తిమ్మాపురం పరిసరాల్లోని కొబ్బరితోట వద్ద సంచరిస్తున్నారు. అప్పటికే సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావులు తమ సిబ్బందితో నిఘా కెమెరాల్లో రికార్డయిన ఆనవాళ్లతో అనుమానితుల కోసం గాలింపు చర్యల్లో ఉన్నారు. వీరికి ఈ ముఠా సభ్యులు కనిపించడంతో ఆరా తీశారు. దీంతో హత్యకు జరిగిన కుట్రనంతటినీ పూసగుచ్చారు. పోలీసులు శనివారం నూకేశ్వరి, పైడిరాజులతో పాటు కిరాయి రౌడీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నాగేశ్వరరావు పరిస్థితి విషమం..
కాగా సుపారీ గ్యాంగ్‌ పొరపాటున రుద్రగా భావించి దాడి చేసిన నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న నూకేశ్వరి, పైడిరాజు, వృత్తిని అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్‌ అవతారమెత్తిన విలేకరి రుద్రల అనైతిక వ్యవహారానికి అమాయకుడైన వాచ్‌మేన్‌ నాగేశ్వరరావు అన్యాయంగా బలి పశువయ్యాడంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story