బెల్టు షాపులు తొలగించి..నీరా కేఫ్‌లు పెట్టాలి
x

బెల్టు షాపులు తొలగించి..నీరా కేఫ్‌లు పెట్టాలి

ఆంధ్రప్రదేశ్‌లో గోవా, యానాం అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారని కల్లుగీత కార్మికులు ఆరోపిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో బెల్టు షాపులు తొలగించి.. నీరా కేఫ్‌లు పెట్టాలని, బెల్టుషాపులకు బదులుగా నీరా కేఫ్‌లు ఏర్పాటు చేసేంత వరకు పోరాటం చేసేందుకు కల్లుగీత కార్మికులు రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. కల్లుగీత కార్మికుల సంఘం విజయవాడలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ.. చెట్టు మీద నుంచి పడిపోయిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియాని సీఎం చంద్రబాబు రద్దు చేశారని.. ఇంత కంటే దుర్మార్గం మరొకటి ఉండదని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్లుగీత కార్మికుల సమస్యలపైన, వారికి ఇచ్చిన హామీలపైన ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదని, పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో గోవా, యానం అక్రమ మద్యంను అమ్ముతున్నారని ఆరోపించారు. ఏపీలో 3396 వైన్‌ షాపులు ఉంటే 75వేల బెల్టుషాపులను పెట్టించిందని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అంతేకాకుండా స్పిరిట్‌తో తయారు చేసిన కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో మద్యాన్ని వరదలై పారిస్తూ.. ముంచెత్తుతున్నారని విమర్శలు గుప్పించారు.

బెల్టుషాపులు పెడితే.. పెట్టిన వారి తోలు తీస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్రలు చెప్పారని, కానీ ఇంత వరకు ఎంత మంది తోలు ఒలుశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర నియోజక వర్గంలో లెక్కలేనన్ని బెల్టు షాపులు ఉన్నాయని, వరదలా మద్యం ఏరులై పారుతోందని జుత్తిగ నరసింహమూర్తి మండిపడ్డారు. లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తిని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు. కల్లుగీత కార్మికుల ద్రోహం చేస్తున్న తీరు మీద, బెల్లుషాపులు తొలగించి, వాటికి బదులుగా నీరా కేఫ్‌లు ఏర్పాటు చేయాలనే దానిపై సెప్టెంబరు 30 వరకు దశల వారీగా ఆందోళనలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 2న అన్ని జిల్లాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించడంతో పాటు ఆగస్టు 30న అన్ని జిల్లాల్లోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాలను ముట్టడించే ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 10న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి వినతి పత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 12న బెల్టుషాపులు, కల్లు పాలసీ, ఉపాధిపైన అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబరు 25న జిల్లాల్లో సమీక్షలు, సభలు నిర్వహించనున్నట్లు జుత్తిగ నరసింహమూర్తి వెల్లడించారు. తమ ఆందోళనలపై అప్పటికీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు స్పందించకపోతే సెప్టెంబరు 30న మరో కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏపీలో కూడా నీరా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
Read More
Next Story