అరకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఇది తప్పక చదవండి
x

అరకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఇది తప్పక చదవండి

Sunday Special: అరకు సౌందర్యాన్ని కనులారా వీక్షించడానికి ఇదే సరైన సమయం..


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

అరకులోయ.. ఈ పేరు వింటేనే ఒళ్లంతా పులకించిపోతుంది. ప్రకృతి రమణీయతను సొంతం చేసుకున్న ఈ సుందర పర్యాటక ప్రదేశానికి వెళ్లాలన్న కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అక్కడి అందాలను ఆస్వాదించాలని మనసు పరితపిస్తుంటుంది. అందుకే ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్లాలా? అని పర్యాటక ప్రియులు ఎంతగానో తహతహలాడుతుంటారు. ఒకసారి, రెండు సార్లు కాదు.. ఎన్నిసార్లయినా అరకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఏడాదిలో ఆగస్టు నుంచి మార్చి వరకు వర్షాకాలం, శీతాకాలాల్లో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే వాతావరణం ఉంటుంది. అందుకే ఈ సమయంలో టూరిస్టులు అరకు సౌందర్యాన్ని కనులారా వీక్షించడానికి ప్లాన్ వేసుకుంటారు. మరి అందాల అరకును చూడటానికి ఎలా వెళ్లాలి? ఏఏ మార్గాలున్నాయి? అక్కడుండే సదుపాయాలేంటి? ఇలాంటి సందేహాలున్నాయా? అయితే ఈ కథనం మీ కోసమే...




రైలు, రోడ్డు మార్గాలు..

విశాఖపట్నం నుంచి అరకు వెళ్లడానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. రైలు మార్గంలో 131 కి.మీలు, రోడ్డు మార్గంలో 113 కి.మీల దూరం ఉంది. బస్సులో వెళ్లే మూడు గంటలు, కారులో రెండున్నర గంటలు, రైలులో అయితే 4.10 గంటల ప్రయాణ సమయం పడుతుంది. వైజాగ్ నుంచి అరకు వెళ్లేందుకు రెండు రైళ్లున్నాయి. ఒకటి ఉదయం (కిరండోల్ పాసింజర్-08551) ఒకటి, రాత్రి (కిరండోల్ ఎక్స్ ప్రెస్-18514) మరొకటి బయల్దేరతాయి. పాసింజరు రైలు విశాఖలో 6.45 గంటలకు బయల్దేరి 10.55కి అరకు చేరుకుంటుంది. మరో రైలు రాత్రి 9.20కి బయల్దేరి అర్థరాత్రి 12.28కి వెళ్తుంది. అందువల్ల ఉదయం పాసింజరే అరకు పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.




రైల్ కం రోడ్ మార్గానికే మొగ్గు..

విశాఖ నుంచి అరకుకు రైలులో వెళ్లి, బస్సులో తిరిగి రావడానికే చాలామంది మొగ్గు చూపుతారు. ఎందుకంటే మార్గమధ్యలో కూ.. అనుకుంటూ 58 గుహల్లో నుంచి 84 వంతెనల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. మధ్య దారిలో కొండలపై నుంచి నురుగలు కక్కుతూ జలజల పారే జలపాతాలు, పాతాళంలో ఉన్నట్టుండే లోయలు, అక్కడక్కడ మంచు తెరలు, పచ్చని అరణ్యంలో చెట్లు, వాటిలో రకరకాల జంతువులు కనువిందు చేస్తాయి. వీటన్నిటినీ చూడడానికి రెండు కళ్లు చాలవేమో అనిపిస్తాయి. నాలుగ్గంటల తర్వాత రైలు అరకు రైల్వేస్టేషన్ చేరుకుంటుంది, అక్కడ నుంచి పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి కార్లు, జీపులు, మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి. టూరిస్టుల ఆసక్తికి అనుగుణంగా పర్యాటక శాఖ అరకుకు రోడ్ కం రైల్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో పర్యాటకులను విశాఖ నుంచి అరకుకు రైలులో తీసుకెళ్లి బస్సులో (ఒకరోజులో) తీసుకొస్తుంది. ఒక్కొక్కరికి పెద్దలకు రూ.1,710, పిల్లలకు రూ.1,370 ధర నిర్ణయించింది.




ఈ ప్యాకేజీలో ఏముంటాయంటే!

ఈ ప్యాకేజీలో కిరండోల్ పాసింజర్ రైలులో సీటు కేటాయిస్తారు. అల్పాహారం అందిస్తారు. అరకులో రైలు దిగాక పర్యాటక శాఖ బస్సులో ట్రైబల్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్ (పద్మాపురం గార్డెన్స్) కాఫీ మ్యూజియం, థింసా డ్యాన్స్ వంటి స్థానిక పర్యాటక ప్రదేశాలను చూపిస్తారు. అరకు హరిత రిసార్ట్స్ మధ్యాహ్నం భోజనం తర్వాత తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ తోటలను చూపించి బొర్రా గుహల సందర్శనకు తీసుకెళ్తారు. ఆపై గాలికొండ వ్యూపాయింట్, టైడాలోని జంగిల్స్ బెల్స్క తీసుకెళ్తారు. అక్కడ సాయంత్రం స్నాక్స్ ఇచ్చాక విశాఖ బయల్దేరతారు. రాత్రి ఎనిమిది గంటలకు విశాఖకు చేరుస్తారు. ప్యాకేజీలో ట్రైబల్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్ల ప్రవేశ రుసుమును మాత్రం పర్యాటకులే భరించాలి. మిగిలిన ప్రదేశాల సందర్శన రుసుమును పర్యాటక శాఖ భరిస్తుంది. వీరి వెంట ఉండే గైడ్ పర్యాటక ప్రదేశాల విశిష్టతలను వివరిస్తాడు. అలాగే అరకుకు ఒకరోజు రోడ్డు ప్యాకేజీ కూడా ఉంది. ఇందులో పెద్దలకు రూ.1,590, పిల్లలకు రూ.1,270 ధర నిర్ణయించింది.




అద్దాల బోగీలో ప్రయాణం అద్భుతం.

అరకు టూర్కు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ 2017లో ఏసీ విస్టాడోమ్ (అద్దాల బోగీ) కోచ్లను ప్రవేశపెట్టింది. కిరండోల్ పాసింజర్కు రెండు విస్టాడోమ్ లను జత చేస్తుంది. రైలు ఈ కోచ్లను అరకులో వదిలిపెట్టి కిరండోల్ వెళ్లిపోతుంది. వీటిని తిరుగు ప్రయాణంలో సాయంత్రం కిరండోల్ నుంచి రైలుకు జత చేసి విశాఖ తీసుకొస్తారు. ఈ విస్టాడోమ్ కోర్కు విశాలమైన అద్దాలుండడం, 360 డిగ్రీలు. తిరిగేలా కుషన్ చైర్లు ఉండడం వల్ల బోగీలోంచి లోయల్లోంచి ప్రకృతి అందాలన్నీ ఎంతో మధురానుభూతిని కలిగిస్తాయి. అంతేకాదు.. కోచ్లోని కుర్చీలు 360 డిగ్రీలు తిరిగేలా అమర్చారు. దీంతో ఈ విస్టాడోమ్ కోచ్ వెళ్లే పర్యాటకులు ప్రకృతి అందాలను చూసి విస్తుపోతుంటారు. ఈ కోచ్లో విశాఖ నుంచి అరకు వెళ్లడానికి టిక్కెట్టు ధర రూ.735 ఉంది. అయితే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల కొందరికే టిక్కెట్లు లభ్యమవుతాయి. ఈ కోచ్లో ప్రయాణించే వారికి అల్పాహారం, టీ/కాఫీ ఉచితంగా అందిస్తారు.




అరకు టూర్లో చూడ చక్కనివి..

ఇక అరకు, పరిసరాల్లో చూడచక్కని ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రత్యేకత. వాటిలో కొన్ని....

కాఫీ మ్యూజియం: ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీతో తయారు చేసిన 60 రకాల కాఫీ రుచులు, 600 రకాల కాఫీ చాక్లెట్లు లభిస్తాయి. కప్పు కాఫీ ధర రూ.15 నుంచి 150 వరకు ఉంటుంది.

పద్మాపురం గార్డెన్స్: విశాలమైన పద్మాపురం గార్డెన్స్ నిత్యం పచ్చదనంతో పరవశింపజేస్తుంది.

ట్రైబల్ మ్యూజియం: ఈ మ్యూజియంలో గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకృతులు, థింసా నృత్యాల బొమ్మలు వంటివెన్నో సజీవంగా దర్శనమిస్తాయి.

బొర్రా గుహలు! ఇవి అరకుకు 36 కి.మీల దూరంలో ఉన్నాయి. సుమారు 50 వేల ఏళ్ల క్రితం ఏర్పడినట్టుగా భావిస్తున్న ఈ గుహలు దేశంలోకెల్లా అత్యంత లోతైనవి. రెండు కి.మీల వరకు విస్తరించి ఉన్నాయి.





కటికి జలపాతం: ఇది బొర్రా గుహలకు 4 కి.మీల దూరంలో ఉంది. ఇది 50 మీటర్ల ఎత్తున్న కొండపై నుంచి కిందకు జాలువారుతూ పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. చాపరాయి: అరకుకు 15 కి.మీల దూరంలో ఉన్న ఈ చాపరాయి జలపాతం నిత్యం ప్రవహిస్తుంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, విశాలమైన రాళ్ల మీదుగా నీరు ప్రవహిస్తూ కనువిందు చేస్తుంది. అనంతగిరి కాఫీ తోటలు: విశాఖ మన్యానికే పేరు తెచ్చిపెట్టిన అనంతగిరి కాఫీ తోటలు రోడ్లకిరువైపులా అలరిస్తుంటాయి. ఆ పరిసరాలను పచ్చదనంతోనే కాదు.. చల్లదనంతోనూ ఆకర్షిస్తుంటాయి.

జంగిల్ బెల్స్: అరకుకు 40 కి.మీల దూరంలో విశాఖ వెళ్లే దారిలో ఉంది జంగిల్ బెల్స్. పక్షుల కిలకిలరావాలతో అలరించే ఈ బెల్స్లో రాత్రి పూట బస చేయడానికి అనువుగా కాటేజీలు ఏర్పాటు చేశారు.

లంబసింగి: అరకు నుంచి 92 కి.మీల దూరంలో లంబసింగి ఉంది. డిసెంబరు/జనవరిల్లో జీరో డిగ్రీలకు పడిపోయే ప్రఖ్యాత ప్రదేశం లంబసింగి. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా మంచు తెరలతో కప్పి పర్యాటకులకు కనువిందు చేస్తుంది.

గాలికొండ వ్యూపాయింట్: అరకుకు 16 కి.మీలో ఉన్న ఈ వ్యూపాయింట్

సముద్రమట్టానికి 3,800 అడుగుల ఎత్తులో ఉంది. ఇది తూర్పు కనుమల్లో రెండో ఎత్తైన కొండ

వంజంగి హిల్స్: ఇవి అరకుకు 50 కి.మీలు, పాడేరుకు సమీపంలోను ఉన్నాయి... వీటికి మేఘాల కొండలనే పేరు కూడా ఉంది. సముద్రమట్టానికి 3,400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండలపై నుంచి చూస్తే వాటికంటే మేఘాలు కిందకు ఉన్నట్టు కనిపిస్తూ మధురానుభూతిని కలిగిస్తాయి.




రైలు, బస్సుల్లోనే కాదు..

విశాఖ నుంచి అరకు అందాల వీక్షణకు రైలు, బస్సుల్లోనే కాదు.. కొంతమంది సొంత వాహనాల్లోనూ వెళ్తుంటారు. మరికొందరు అద్దె వాహనాలను బుక్ చేసుకుని సందర్శించి వస్తారు. కొందరు ఒకరోజులోనే వెళ్లి వస్తే ఇంకొందరు రెండు, మూడు రోజుల ట్రిప్ వేసుకుంటారు. పర్యాటకులకు స్వర్గధామంగా భాసిల్లుతున్న అరకుకు నిత్యం వేల సంఖ్యలో పోటెత్తుతుంటారు. వీరిలో 90 శాతానికి పైగా బొర్రాగుహలను సందరిస్తుంటారు.




అందుబాటులో రూమ్లు.. కాటేజీలు..

అరకు సందర్శనకు వచ్చే వారి కోసం పెద్ద సంఖ్యలో కాటేజీలు, రూమ్లు. అందుబాటులో ఉన్నాయి.. పర్యాటక శాఖతో పాటు ప్రైవేటు వ్యక్తులు వీటిని నిర్వహిస్తున్నారు. అరకు, పరిసర ప్రాంతాల్లో టూరిజం శాఖకు చెందిన గదులు 200 వరకు ఉన్నాయి. వీటిలో అరకులో మయూరి రిసార్ట్స్ లో 85, వేలీ రిసార్ట్స్ 58, టైడా జంగిల్ బెల్స్లో 16, అనంతగిరి హిల్ రిసార్టులో 28, లంబసింగిలో 15 చొప్పున ఉన్నాయి. వీటి ధర నాన్ ఏసీ రూ.1,400 నుంచి, ఏసీ రూమ్లు రూ.5,000 వరకు ఉంది. ఇవి కాకుండా ఒక్క అరకులోనే ప్రైవేటుకు చెందిన 70 వరకు లాడ్జిల్లో దాదాపు 600 గదులు లభ్యమవుతాయి. వీటిలో కూడా కనీస అద్దె రూ.1,000-3,000 వరకు ఉంది. ఇక అరకు పర్యటనకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ఏపీ టూరిజం ఆన్లైన్లో ప్యాకేజి బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. అవసరమైన వారు www.aptdc.in ను సంప్రదించవచ్చు. ఇంకా విశాఖ రైల్వే స్టేషన్ గేట్ నంబరు 1లో ఐఆర్సీటీసీ కార్యాలయం పక్కనున్న ఏపీ టూరిజం కౌంటర్ లేదా 9848813484 ను కూడా కాంటాక్ట్ చేయవచ్చు.





విశాఖ-అరకు పాసింజర్ రైలు టిక్కెట్టు చార్జీ ఇలా.. సాధారణ టికెట్టు రూ.30, సెకండ్ సిట్టింగ్ రూ.45, స్లీపర్ క్లాస్ రూ.100, థర్డ్ ఎకానమీ రూ.505, విస్టాడోమ్ కోచ్ రూ.735

Read More
Next Story