విజయవాడ నగరం మధ్యలో అందమైన కొండ గుహలు
x

విజయవాడ నగరం మధ్యలో అందమైన కొండ గుహలు

చరిత్రలో ఎన్నో గొప్ప కట్టడాలు, అప్పటి తీపి గుర్తులు ఇప్పటి వారిని ముగ్దుల్ని చేస్తుంటాయి. అటువంటి వాటిలో విజయవాడ నగరంలోని గుహలు ఒకటిగా చెప్పుకోవచ్చు.


విజయవాడ నగరం ప్రాచీన చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం. పట్టణం నడిబొడ్డులో ఐదు చోట్ల చిన్న కొండ గుహలు ఉన్నాయి. ఆ కొండలపై శిల్పాలు, శిలలు, గుహలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ గుహల్లో పూర్వం కొందరు మునులు, సాధువులు ఉన్నారని చరిత్ర కారులు చెబుతుంటారు. స్థానికులు రోజూ చూస్తుంటారు కాబట్టి పెద్దగా పట్టించుకోరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆ గుహలు చూడాలని, అక్కడ ఏముందో తెలుసుకోవాలని ఉత్సాహాన్ని చూపిస్తారు. ఈ చిన్న కొండలు పట్టణానికి మధ్యలో ఉండటం. కొండ రాళ్ల చుట్టూ పచ్చని చెట్లు ఉండటంతో శోభను ఇస్తున్నాయి.

ప్రాచీన చారిత్రక ప్రదేశాలను కాపాడేందుకు పురావస్తు శాఖ కృషి చేస్తోంది. అయితే పురావస్తు శాఖను ప్రభుత్వం మరిచిపోవడంతో ఆ శాఖ పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. చారిత్రక ప్రదేశాలు గత వైభవానికి ప్రతీకలని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్ర ద్వారానే నాటి పాలన ఎలా ఉంది. ఇతర అంశాలు ఎలా ఉండేవనేది తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. పైగా చారిత్రక ప్రదేశాలు ప్రస్తుతం పర్యాటక ప్రదేశాలుగా కూడా ఉపయోగ పడుతున్నాయి. సుమారు 15 లక్షలకు పైగా జనం నివశిస్తున్న విజయవాడ నగరంలో ఉన్న కొండలకు గుహలు పలువురురిని ఆకట్టుకునేలా ఉన్నాయి. మునిసిపల్‌ కార్పొరేషన్‌ వారు కొండలకు చుట్టూ ఇనుప కంచ వేశారు. అక్కడక్కడ పచ్చని చెట్లు ఉన్నాయి. మరికొన్ని నీడనిచ్చే మొక్కలు కొండలకు కింది భాగాన పెంచితే గుహలు చూసేందుకు వచ్చే వారు అక్కడ కూర్చుని కాసేపు సేద తీరుతారని పలువురు పట్టణవాసులు చెబుతున్నారు. చిన్న కొండ కాబట్టి పైకి ఎక్కి చుట్టూ తిరుగుతారు. ఈ ప్రాంతం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
నగరంలో జనావాసాల మధ్య ఉన్న కొండ గుహలన్నీ ఒకేరాయితో ఉండటంతో ఆ రాయిని చెక్కి నిర్మించినవిగా చరిత్ర చెబుతోంది. మొదటి గుహ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వెనక ఉన్న రెడ్‌ సర్కిల్‌లో ఉంది. ఈ గుహ కింది భాగంలో గంగానమ్మకు స్థానికులు పూజలు చేస్తుంటారు. ఒకే పెద్ద రాయిగా కొండ ఉంటుంది. ఆ రాయిపై చెక్కిన మెట్ల మీదుగా పైకి ఎక్కితే గుహ కనిపిస్తుంది. గుహ లోపలికి వెళ్లటానికి మూడు ద్వారాలు ఉన్నాయి. ఈ గుహలోపల ద్వార పాలకుడు, ఖాళీగా ఉండే దైవ పీఠం దర్శనం ఇస్తుంది. అయితే ప్రస్తుతం గుహ ద్వారాలు మూసి ఉన్నాయి. 2010లో సవరించిన చట్టం ప్రకారం ఈ కొండలకు చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరు ఆక్రమించినా శిక్షార్హులవుతారు. రెండు సంవత్సరాలు శిక్ష, లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఏనుగుతో పాటు మరికొన్ని జంతువుల శిల్పాలు, ఆకారాలు రాతిమీద చెక్కారు.
రెండవ గుహ శిఖామణి సెంటర్‌లో ఉంది. నటరాజ గుహగా పిలిచే దీనిలో వలంపురి గణపతి దర్శనం ఇస్తాడు. పీబీ సిద్ధార్థ కళాశాల వద్ద మరో రెండు గుహలు ఉన్నాయి. ఇక్కడ త్రిమూర్తుల విగ్రహాలు, దుర్గాదేవి దర్శనమిస్తారు. దుర్గాదేవి విగ్రహం వెనక్కు తిరిగి కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఇది అతిపురాతణమైన దుర్గమ్మ విగ్రహం అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారికి భక్తులు పూజలు చేస్తుంటారు. ఈ గుహలకు పక్కన ఉండే చిన్న సందు నుంచి వెళ్తే మరో గుహ కనిపిస్తుంది. అక్కడ విశాలమైన ప్రాంగణం, మూడు పీఠాలు ఉన్నాయి. ఇవి త్రిమూర్తుల ప్రతిమల కోసం నిర్మించి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.
ఈ గుహలు ఐదో శతాబ్దానికి చెందినివిగా చరిత్రకారులు చెబుతున్నారు. పూర్ణ కుంభాలు, కలశం ఈ గుహల్లో దర్శనమిస్తున్నాయి. నటరాజ గుహలో స్వామి రాక్షసుడిపై నాట్యం చేస్తున్నట్లు చెక్కిన శిల్పం ఆకట్టుకుంటుంది. ఈ గుహలోపల భాగంలో శ్రీకృష్ణుని లీలలు కనిపిస్తాయి. ఇక్కడ మూడు గదులుగా నిర్మాణాలు ఉన్నాయి. మధ్య గదిలో శిథిలమైన శివలింగ పీఠం కనిపిస్తుంది. మూడో గుహలో నాగశిల్పం, బ్రహ్మ, విష్ణు, శివుడి శిల్పాలు ఉన్నాయి. మొగల్రాజపురం గుహలు మొదట బౌద్ధ భిక్షువుల ఆవాసాల కోసం నిర్మించినవిగా దీనిపై అధ్యయనం చేసిన వాళ్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చరిత్రకారులూ ధృవీకరిస్తున్నారు.
Read More
Next Story