అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
x

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు భాగస్వామ్యంతో ప్రమాదాలను సులువుగా నివారించుకోవచ్చని అగ్నిమాపక డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌ పేర్కొన్నారు.


వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఈ అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ పేర్కొన్నారు. అగ్నిమాపక సేవల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం లోని పెద్ద పెద్ద నగరాల్లోని ఓల్డ్‌ సిటీల్లో అనుకోని అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుందని, రహదారులు ఇరుకుగా ఉండటం, షాపుల పై అంతస్థుల్లో నివాస గృహాలు ఉండటం ప్రమాద తీవ్రతకు కారణాలుగా ఉంటున్నాయన్నారు. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్‌ ఛార్మినార్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉండటానికి ఇలాంటి అంశాలే కారణాలుగా స్పష్టమవుతున్నాయన్నారు. ఏపీలో విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి సిటీస్‌లో కూడా ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని, వీటి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

నాటి పరిస్థితులకు అనుగుణంగా పాత భవనాల్లోని విద్యుత్‌ వైరింగ్‌ చేపట్టారని, అయితే ఇప్పుడు మనం వాడుతున్న విద్యుత్‌ లోడ్‌కు అనుగుణంగా వైరింగ్‌లో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు. దీంతో షార్ట్‌ సర్యూట్‌ వంటి ప్రమాదాలను నివారించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. వైరింగ్‌లలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ఎస్‌ వైర్‌ ను వాడటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. అలాగే ప్రతి గదికి మైక్రో సర్క్యూట్‌ బ్రేకర్స్‌ (ఎంసీబీ)లను ఏర్పాటు చేసుకోవాలని, ఎసీలను బిగించే సమయంలోనే వైర్‌ కెపాసిటీని ఒక సారి పరిశీలించాలని, అలాగే ప్రతి భవనానికి ఎర్తింగ్‌ చేయించుకోవాలని కోరారు. తక్కువ ఖర్చుతో వీటిని అమర్చుకుంటే ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఉండొచ్చన్నారు.
షార్ట్‌ సర్యూట్‌ లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎక్కువగా పోగ కమ్ముకోవడం వంటి ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటున్నాయని, వీటి నివారణ కోసం ప్రతి గృహంలో స్మోక్‌ డిటెక్టర్లు, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి గృహానికి బ్రీతింగ్‌ బాల్కాని ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు.
శ్రీకాకుళంలో ఓ షాపింగ్‌ మాల్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది లోపలకు వెళ్లడానికే ఆరుగంటల సమయం పట్టిందని, లోపన ఉన్న దుస్తులు కాలడంతో అధిక పొగ కమ్మేసిందని, దీంతో చాలా మంది ఊపిరాడక ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఇటువంటి పరిస్థితి ఇతర ప్రాంతాల్లో తలెత్తకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్‌ఓసీలు ఇచ్చే సమయంలోనే ఇవన్నీ పరిశీలిస్తున్నామన్నారు.
Read More
Next Story