అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్
x
గొల్లపూడిలోని బీసీ భవన్ లో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ కోచింగ్ ప్రారంభించిన మంత్రి సవిత

అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్

బీసీ యువత సివిల్స్ ఆకాంక్షలకు ప్రభుత్వం బలం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బీసీ) యువతకు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానాలు సాధించేందుకు అవసరమైన సౌకర్యాలను విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఐఏఎస్ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసే ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రాష్ట్ర స్థాయి స్టడీ సర్కిల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆకాంక్షించారు.

మూడు అంతస్తుల భవనం, ఆధునిక గ్లాస్ ఫసేడ్, పర్యావరణ అనుకూల డిజైన్‌తో స్టడీ సర్కిల్ నిర్మాణం జరుగుతుంది. మొదటి అంతస్తులో శిక్షణ గదులు, లైబ్రరీ, రెండవ అంతస్తులో వసతి గదులు, మూడవ అంతస్తులో ఆడిటోరియం రిక్రియేషన్ స్పేస్ ఉంటుంది.

డిజిటల్ క్లాస్‌రూములు, హై-స్పీడ్ ఇంటర్నెట్, జిమ్, క్యాంటీన్, గ్రీన్ స్పేసెస్ ఉంటాయి. సౌర శక్తి ప్యానెల్స్, వర్షజల సంరక్షణ వ్యవస్థలు, ఆధునిక భద్రతా వ్యవస్థలు ఉంటాయి.

విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో ఇప్పటికే నిర్వహిస్తున్న ఉచిత సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను మంత్రి సవిత సోమవారం సందర్శించారు. అక్కడి అభ్యర్థులతో సంభాషించి, వారి శిక్షణ, వసతి ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. "మా లక్ష్యం బీసీ యువతను ఉన్నత స్థానాల్లో చూడటమే. దీనికోసం విద్యా సౌకర్యాలను భారీగా విస్తరిస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు.

అమరావతిలో నిర్మించనున్న ఈ కొత్త స్టడీ సర్కిల్ ద్వారా బీసీ విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందించనున్నారు. ఇంకా రాష్ట్రంలోని మరో మూడు ముఖ్యమైన ప్రాంతాల్లో కొత్త స్టడీ సర్కిళ్లను స్థాపించి, సివిల్ సర్వీసెస్ కోచింగ్‌ను సులభంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. "బీసీ బిడ్డలు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉండాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష" అని మంత్రి సవిత అన్నారు.

గత ఏడాది బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సాధించిన ఫలితాలను మంత్రి గుర్తు చేశారు. మెగా డీఎస్సీ శిక్షణ పొందిన 5 వేల మందిలో 281 మంది ఉపాధ్యాయ పోస్టులు సాధించారు. ఈ ఏడాది కూడా 100 మంది అభ్యర్థులకు నాణ్యమైన ఆహారం, వసతితో కూడిన ఉచిత సివిల్స్ శిక్షణను ప్రారంభించామని తెలిపారు.

ఈ సౌకర్యాలపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన లావణ్య మాట్లాడుతూ "ఢిల్లీలో ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసినా లభించని వసతులు, నిపుణుల బోధన ఇక్కడ ఉచితంగా అందుతోంది" అని అన్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశ్ "ఆర్థిక ఇబ్బందులతో సివిల్స్ కలలు కనలేని గ్రామీణ యువతకు ఈ కార్యక్రమం వరంగా మారింది" అని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ ఐఏఎస్ లక్ష్యాన్ని సాకారం చేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story