విశాఖ తీరంలో అత్యంత అరుదైన బార్కుడియా పాము!
x

విశాఖ తీరంలో అత్యంత అరుదైన 'బార్కుడియా' పాము!

ప్రపంచంలో ఇప్పటివరకు దీని ఉనికి ఇక్కడే. దీనికి ‘విశాఖపట్నం లింబ్‌లెస్ స్కింక్'గా నామకరణం. తొలిసారి 1790లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో.


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

అది అచ్చం పాములా ఉంటుంది. కానీ పాము కాదు.. విషపూరితమూ కాదు.. బల్లి జాతికి చెందినది. అయినా బల్లిలా ఉండదు. దానిపేరు 'బార్కుడియా'! ప్రపంచంలోకెల్లా భారతదేశ తూర్పు తీరంలోనే వీటి ఉనికి ఉంది. అదీ విశాఖ తీరం ప్రాంతంలోనే. అందుకే దీనికి విశాఖపట్నం లింబ్ లెస్ స్కింగ్గా నామకరణం చేశారు. అత్యంత అరుదైన ఈ వింత జీవి కథ, కమామిషు ఏమిటో మీరూ ఒక్కసారి చదవండి..

ప్రపంచంలో బార్కుడియా జాతులు రెండే ఉన్నాయి. వీటిలో ఒకటి బార్కుడియా ఇన్సులారిస్. రెండోది బార్కుడియా మెలనోస్టిక్టా. ఇన్సులారిస్ రకం ఉనికి ఒడిశా, తమిళనాడులోని చెన్నై తీర ప్రాంతాల్లో ఉన్నట్టు 1917 సంవత్సరంలో కనుగొన్నారు. అయితే దానికంటే అత్యంత అరుదైన బార్కుడియా మెలనోస్టిక్టా మాత్రం విశాఖపట్నం తీర ప్రాంతంలో అంతకు ముందు అంటే 1790లోనే స్కాట్లండ్కు చెందిన ప్యాట్రిక్ రస్సెల్ అనే సర్జన్, ప్రకృతి ప్రేమికుడు మొదటిసారిగా గుర్తించారు.

ఆ తర్వాత 1950-80 మధ్య కాలంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు విశ్వవిద్యాలయం పరిసరాల్లో వీటి ఉనికి ఉన్నట్టు కనుగొన్నారు. అప్పట్లో ఒక్క విశాఖలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా బార్కుడియా లేదని తేల్చారు. అనంతరం దానిని కోల్కతాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో భద్రపరిచారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ 2015 సెప్టెంబరు 28న విశాఖ కైలాసగిరి కొండపై జనార్థన్ ఉప్పాడ అనే బర్డ్‌వాచర్కు ఇది కనిపించింది.

సరిగ్గా ఏడాది అనంతరం 2016 సెప్టెంబర్ 29న విశాఖ నగరంలోని పందిమెట్ట వద్ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (డబ్ల్యూసీటీఈ) బోర్డు మెంబరు వివేక్ రాథోడ్ గుర్తించారు. ఇటీవల 2023 మే నెలలో కంబాలకొండ అభయారణ్యంలోనూ రాథోడ్, స్పెన్సర్ గంటా, యజ్ఞపతి అనే వార్లతో పాటు అటవీశాఖ అధికారులకు ఈ బార్కుడియా దర్శనమిచ్చింది.

లభ్యమైన ప్రాంతం పేరుతో..

సాధారణంగా అరుదైన జంతువులను గాని, సరీసృపాలను (పాము జాతులను) గాని వాటి ఉనికిని తొలిసారిగా కనుగొన్న చోట (టైప్ లొకాలిటీగా పేర్కొంటారు)ను దాని పేరుకు ముందు చేరుస్తారు. ప్రపంచంలో మొట్ట మొదటసారి బార్కుడియా మెలనోస్టిక్టా ఉనికి 1790లో విశాఖపట్నంలో లభ్యం కావడంతో దీనికి ‘విశాఖపట్నం లింబ్లెస్ స్కింక్'గా నామకరణం చేశారు.

ఇదెలా ఉంటుందంటే?

ఈ బార్కుడియాకు అన్నీ ప్రత్యేకతలే! 'దీనికి కాళ్లుండవు. పొడవైన శరీరాన్ని కలిగి ఉంటుంది. చూడటానికి విషపూరితమైన పాములా అనిపిస్తుంది. కానీ అస్సలు ప్రమాదకారి కాదు.. గోధుమ వర్ణంలో ఉంటుంది. చిన్న కనురెప్పలు మాత్రమే ఉంటాయి. చెవి రంధ్రాలు చీలిపోయినట్టు కనిపిస్తాయి. 8-10 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. వదులు ఇసుక, ఎర్రమట్టి నేలల్లో భూగర్భ బొరియల్లో జీవిస్తుంది. దీని ముందు పెదవి సూదిగా ఉండడం వల్ల వదులుగా ఉన్న ఇసుక/మట్టిలోకి తేలిగ్గా చొచ్చుకుపోగలుగుతుంది.

పాములా పాకుతుంది. భూమి అడుగు భాగంలో ఉండే క్రిమి కీటకాలను, పురుగులను తింటుంది' అని విశాఖలోని గీతం యూనివర్సిటీ జూనియర్ రీసెర్చి ఫెలో యజ్ఞపతి ఆడారి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. ఇలాంటి అత్యంత అరుదైన బార్కుడియాలను సంరక్షించుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందని (డబ్ల్యూసీటీఈ) బోర్డు మెంబరు వివేక్ రాథోడ్ తెలిపారు. ఎవరికైనా ఇలాంటి బార్కుడియాలు కనిపిస్తే వాటిని చంపేయకుండా తమకు (ఫోన్ నంబరు 8555913274) సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Read More
Next Story