తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం–టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో ఇటీవల దీనిపై నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతవరణాన్ని కాపాడటానికి మరో సారి నడుం బిగించింది. అందులో భాగంగా తిరుమల కొండపైన రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. రాజకీయ నాయకులు శ్రీవారి దర్శనం చేసుకొన్న అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడే సందర్భంలో రాజకీయ ప్రసంగాలు చేయడం, విమర్శలు చేయడం, ద్వేషపూర్తి మాటలు అనడం పరిపాటిగా మారింది. గత కొంత కాలంగా ఈ వాతావరణం బాగా పెరిగింది. దర్శనానికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు ద్వేషపూర్తి వ్యాఖ్యలు చేయడం మామూలుగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యల వల్ల తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని, దీంతో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని ఇటీవల జరిగిన టీటీడీ బోర్టు సమావేశంలో తీర్మానం చేశారు. దీనిని తాజాగా అమలులోకి తీసుకొస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.