జగన్ వ్యవహారం నచ్చకే బాలినేని రాజీనామా
వైఎస్‌ఆర్‌సీపీకి బాలినేని రాజీనామా చేస్తారనే తర్జన భర్జనలకు తెరపడింది. జగన్ వ్యవహారం నచ్చక రాజీనామా చేశారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకీ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. అక్కడ నుంచే రాజీనామా చేసి ఆ లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందని, వైఎస్‌ఆర్‌సీపీకి గుడ్‌బాయ్ చెప్పి జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ కూడా సాగుతోంది.
లేఖ సారాంశం ఇదే..
కొన్ని కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో వెల్లడించారు. రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్తే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను. అంతిమంగా ప్రజా శ్రేయస్సే రాజకీయాలకు కొలమానం. విలువలను నమ్ముకొనే దాదాపు 5 సార్లు ప్రజా ప్రతినిధిగా, రెండు సార్లు మంత్రిగా పని చేసాను అన్న తృప్తి, కొంత గర్వంగా కూడా ఉందని లేఖలో తెలిపారు. రాజకీయాలు వేరు. బందుత్వాలు వేరు. వైఎస్‌ఆర్ కుటుంబానికి సన్నిహితుడనని, అయినా ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నానని, ఎలాంటి మొహమాటాలను పోలేదని లేఖలో పేర్కొన్నారు. అంతిమంగా ప్రజా తీర్పును ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే. నేను ప్రజా నాయకుడిని. ప్రజల తీర్పే నాకు శిరోధార్యం. రాజకీయాల్లో భాష, గౌరవంగా, హుందాగా ఉండాలని నమ్మే నికార్సైన రాజకీయం తాను చేసినట్లు తన లేఖలో చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్‌తో తొలి రాజకీయ ప్రస్థానం
కాంగ్రెస్ పార్టీతోనే బాలినేని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. విద్యార్థి నాయకుడిగా రంగ ప్రవేశం చేసిన బాలినేని మంత్రి వరకు ఎదిగారు. ప్రకాశం జిల్లా యుజన కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షునిగాను, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బాలినేనికి మంచి ప్రేయారిటీ ఇచ్చారు. వైఎస్‌ఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి పదవి ఇచ్చి రాజకీయాల్లో బాలినేనికి ఎదురు లేదని అనిపించారు. తర్వాత రోశయ్య మంత్రి వర్గంలోను మంత్రిగా కొనసాగారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం కాగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.
ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బాలినేని పని చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో తన కంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్‌ఆర్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డికి బాలినేని స్వయాన బావ అవుతారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలోను, వైఎస్‌ఆర్‌సీపీలోను బాలినేనికి పెద్ద పీట వేస్తూ వచ్చారు.
చంద్రబాబు సానుకూలంగా లేక పోవడంతో..
బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఒంగోల్లోను, రాష్ట్ర రాజకీయాల్లోను చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో బాలినేనికి మాజీ సీఎం వైఎస్ జగన్ కనీస ప్రేయారిటీ కూడా ఇవ్వ లేదు. బాలినేని చెప్పిన ఏ ఒక్క మాటను జగన్ సానుకూలంగా తీసుకోలేదు. ఒంగోలు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందిగా పలుమార్లు కలిసి అడిగినా జగన్ బాలినేని మాటను తోసి పుచ్చారు. ఆర్థికంగా పార్టీతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతారని బాలినేని చెప్పినప్పటికీ.. మీ వరకు మీరు చూసు కోవాలని.. మాగుంట విషయం వద్దని జగన్ బాలినేనికి తేల్చి చెప్పారు. అప్పటి నుంచి జగన్‌పై గుర్రుగానే ఉన్నారు. దీంతో ఎన్నికల సమయంలోనే వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు బాలినేని ప్రయత్నించినట్లు ప్రచారం కూడా సాగింది. అయితే చంద్రబాబు ఈ విషయంలో సానుకూలంగా స్పందిక పోవడంతో ఆ ప్రయత్నాన్ని బాలినేని విరమించుకున్నారు.
జనసేనలోకి..
తర్వాత ఎన్నికలు జరగడం, బాలినేని ఓడిపోవడం, టీడీపీలో చేరిన మాగుంట ఎంపీగా గెలవడం జరిగి పోయాయి. ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి వైఎస్‌ఆర్‌సీపీని వీడాలనే ఆలోచనల్లోనే బాలినేని ఉన్నారు. జనసేనలో చేరేందుకు తన సహచరుల ద్వారా పవన్ కళ్యాణ్‌కు కూడా సమాచారమిచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ ఏ విషయం తేల్చ లేదు. రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే రేపు అంటే గురువారం పవన్ కళ్యాణ్ బాలినేనికి అప్పాయింట్‌మెంట్ ఇచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రేపు పవన్ కళ్యాణ్‌తో బాలినేని కలిసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు రాజీనామా చేసిన వెంటనే ఒంగోలులోని కొంత మంది ముఖ్య నాయకులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి జనసేనలో యాదవ సామాజిక వర్గం మన వైపు మొగ్గు చూపుతారా లేదా? అని బాలినేని అడిగినట్లు తెలిసింది.
Next Story