
బాలకృష్ణ నాపై వ్యంగ్యంగా మాట్లాడటం టీవీలో చూశా: చిరంజీవి
ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సినీ హీరో చిరంజీవి, సినిమా టోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తనపై వ్యంగ్యంగా మాట్లాడినట్లు టీవీలో చూశానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కోవిడ్ సమయంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు అప్పటి వైఎస్ జగన్ సర్కార్‌తో సంప్రదింపులు జరపాలని కోరగా, టికెట్ ధరల విషయమై చొరవ తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. తొలుత అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడి, ఆయన ఆహ్వానంతో మాజీ సీఎం జగన్‌ను కలిశానని, ఆ సందర్భంలో సాదరంగా ఆహ్వానించారని చిరంజీవి వివరించారు. లంచ్ సందర్భంగా సినీ పరిశ్రమ ఇబ్బందులను వివరించానని, సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య గ్యాప్ ఉందనే చర్చ జరుగుతోందని చెప్పానని, అందరం కలిసి వస్తామని తెలిపితే గత ప్రభుత్వం సమావేశానికి తేదీ ఖరారు చేసిందని ఆయన అన్నారు.
సమావేశానికి ముందు బాలకృష్ణతో ఫోన్‌లో మాట్లాడేందుకు మూడుసార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని, జెమినీ కిరణ్ ద్వారా కలవాలని చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. తర్వాత స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి, నారాయణమూర్తితో పాటు పలువురు సినీ ప్రముఖులతో కలిసి జగన్‌ను కలిసి సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించానని, ఈ చర్చలకు తోడ్పడినవారే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చల ఫలితంగా టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, దీనివల్ల సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు టికెట్ ధరలు పెరిగి, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందని చిరంజీవి తెలిపారు. తాను ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా గౌరవంగా మాట్లాడే సహజ ధోరణిని కలిగి ఉన్నానని, ప్రస్తుతం భారత్‌లో లేనందున ప్రకటన ద్వారా స్పష్టత ఇస్తున్నానని ఆయన వెల్లడించారు.
Next Story