బాలయ్య ‘డాకు మహారాజ్’: ఆ దొంగ బయోగ్రఫీనా, ఎవరతను?అతని కథేంటి
నిజ జీవితంలో జరిగిన చరిత్ర డాకు మహరాజ్ సినిమా. పోలీసులను రాజకీయ నాయకులను డాకు సింగ్ ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు అనేది కథాంశం. ఈ సినిమాలో బాలక`ష్ణ హీరోగా నటిస్తున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్‌తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎగై్జటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమిటి, అసలు ఈ టైటిల్ ఏమిటి, బాలయ్యకు సరిపోయే కథేనా అనేది చర్చనీయాంశం.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 1980లో దాదాపు దశాబ్దన్నర పాటు పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని ముప్పుతిప్పలు పెట్టిన ‘డాకు సింగ్’ బయోగ్రఫీనే ఈ డాకు మహారాజ్. ఇప్పటికే డాకు సింగ్‌పై సినిమాలు వచ్చాయి. అయితే.. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని డాకు సింగ్‌ను కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎవరీ మాన్ సింగ్ అంటే...
డాకు మాన్ సింగ్.. పోలీసులకు నేరస్తుడు... కొన్ని ఊళ్లకు దేవుడు. ఎంతోమందికి మేలు చేసిన గొప్ప నాయకుడు. ఈ సినిమాని మాన్ సింగ్ స్టోరీ ఇన్‌స్పిరేషన్‌తోనే తీశారు! లెక్కలేనన్ని దోపిడీలు చేసిన అతన్ని దేవుడిలా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. మాన్ సింగ్ 1890లో ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరా రాథోడ్ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో పుట్టాడు. ఎక్కువగా ఛంబల్ ఏరియాలో పెరిగాడు. 17 మంది సహచరులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత తన అనుచరుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
అతనికోసం పరోక్షంగా, ప్రత్యక్షంగా 400 మందికి పైగా పనిచేసేవాళ్లు. అతని మీద185 హత్యలు,1,112 దోపిడీ కేసులు ఉన్నాయి. లెక్కలేనన్ని కిడ్నాప్‌లు చేశాడు. 32 మంది పోలీసులను చంపాడు. నాలుగు రాష్ట్రాలకు చెందిన వందల మంది పోలీసులు 15 సంవత్సరాల పాటు అతనికోసం వెతికారు. అయితే.. ఇదంతా వన్ సైడే. మరోవైపుచూస్తే.. అతను నిజంగానే రాజ్యం లేని రాజు. కొన్నివేల మంది అతన్ని దేవుడిలా కొలుస్తున్నారు.
ఎలా దొంగగా మారాడు
మాన్‌సింగ్‌కి చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండేవని చెప్తారు. ఓ వయస్సు వచ్చాక ఊరిలో చిన్న చిన్న పంచాయితీలకు తీర్పులు చెప్పేవాడు. అతని ఎదుగుదల అక్కడి కొందరు రౌడీలు, వడ్డీ వ్యాపారులకు నచ్చలేదు. దాంతో అతనిపై కుట్రలు చేయడం మొదలుపెట్టారు. అతని భూమిని అన్యాయంగా లాక్కున్నారు. తర్వాత తప్పుడు కేసు పెట్టి, జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలయ్యాక కోపంతో తను జైలుకు వెళ్లడానికి కారణమైనవాళ్లపై దాడి చేశాడు. వాళ్ల ఇళ్లకు నిప్పుపెట్టాడు. ఆ తర్వాత ఛంబల్ లోయల్లోకి వెళ్లిపోయాడు.
కానీ.. కొన్నాళ్లకు చంబల్ లోయ నుంచి తిరిగి ఊరికి వచ్చారు. వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాన్ సింగ్‌ను మళ్లీ జైలుకు పంపింది. జైలులో ఉన్నప్పుడే అతని ఇద్దరు కొడుకులు జస్వంత్ సింగ్, ధన్వన్ సింగ్‌ని ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. ఆ తర్వాత మాన్ సింగ్1939లో జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పటినుంచి ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. కొడుకులను చంపినవాళ్ల మీద ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఇక మాన్ సింగ్ ఆ తర్వాత దోపిడీలు చేసేవారు. కానీ.. అలా సంపాదించిన డబ్బుని ఎక్కువగా మంచి పనుల కోసమే ఖర్చు చేసేవాడు. ధనికుల ఇళ్లను దోచి.. పేదల జేబులు నింపేవాడని చెప్తారు. చాలామంది అమ్మాయిలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. ఈ క్రమంలో ఆగ్రా చుట్టుపక్కల జిల్లాల్లోని చాలా గ్రామాల్లో మాన్ సింగ్‌ను దేవుడిగా గౌరవిస్తారు. అతనికి గుడి కూడా కట్టారు. ఆ ఆలయం ఇప్పటికీ ఉంది.
ఇక అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి తన బ్లాగ్‌లో డాకు సింగ్ గురించి ప్రస్తావించారు. ‘నా చిన్నప్పుడు డాకు మాన్ సింగ్ సాహసాల గురించి ఎన్నో కథలు విన్నాం. నలుగురు ఒకచోట కలిస్తే.. కచ్చితంగా మాన్ సింగ్ ప్రస్తావన వచ్చేది’’ అంటూ చెప్పుకొచ్చాడు.
మాన్‌సింగ్ జీవిత కథతో బాబుబాయ్ మిస్త్రీ డైరెక్షన్‌లో1971లో ‘డాకు మాన్ సింగ్’ అనే సినిమా కూడా వచ్చింది. 2019లో వచ్చిన ‘సోంచిరియా’ మూవీలో కూడా మాన్‌సింగ్ ఇన్‌స్పిరేషన్‌తో కొన్ని సీన్లు పెట్టారు. అతని పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ నటించాడు.
తెలుగు విషయానికి వస్తే అదే కథను కొద్ది పాటి మార్పులతో తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కథ, కథలోని పాత్రలను తన గొంతో రవితేజ పరిచయం చేయబోతున్నారు. సంక్రాంతికి ఇప్పటికే గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రేసులో ఉండగా.. ఈ రెండు సినిమాలో డాకు మహారాజ్ పోటీపడాల్సి ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ ఈ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సీనిమా, శ్రీ చక్ర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అనుకుంటున్నారు.
ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్స్ గా చేశారు. చాందిని చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తోంది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవత్ కేసరి’ సినిమాలతో బాలయ్య వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన స్టోరీ సెలక్షన్ కూడా ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటున్నాయి. అందుకే ‘డాకు మహారాజ్’ పైన కూడా అంచనాలు పెరిగిపోయాయి.
Next Story