బెయిల్‌ మంజూరు చేసి షరతులు విధించింది
x

బెయిల్‌ మంజూరు చేసి షరతులు విధించింది

సాక్షులను బెదిరించకూడదు. ఆధారాలను ధ్వంసం చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది.


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఏపీ ఫైబర్‌నెట్‌ మాజీ చైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూనే కొన్ని షరతులు కూడా విధించింది. దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, సాక్షులను బెదిరించడం కానీ, కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడం వంటి పనులకు పూనుకోకూడదని ఆదేశించింది. ఆ మేరకు జస్టిస్‌ జేబీ పార్థివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ సుప్రీం కోర్టు ధర్మాసనం గౌతమ్‌ రెడ్డి కేసులో తీర్పును వెలువరించింది. గౌతమ్‌రెడ్డి తరపున ప్రముఖ సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్‌లు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం దాడి చేసిన వ్యక్తే బెయిల్‌పై ఉన్నప్పుడు ఆ దాడికి కుట్ర చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్‌రెడ్డి కూడా విచారించాలి కదా అని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన నిందితులు కూడా బెయిల్‌పైనే ఉన్నారు, ఈ కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదు, ఈ కుట్రను విచారణలో తేల్చండని పేర్కొంది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ్‌రెడ్డి మీద కేసు తెరపైకొచ్చింది. రూ. 5 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జాకు పాల్పడ్డాడని, అంతేకాకుండా ఆ స్థల యజమానిని హత్య చేసేందుకు కూడా గౌతమ్‌రెడ్డి సుపారీ ఇచ్చాడనే ఆరోపణలతో ఆయనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. గౌతమ్‌రెడ్డి మీద విజయవాడకు చెందిన గుండూరి ఉమామహేశ్వర శాస్త్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోర్జరీ పత్రాలతో తన స్థలాన్ని గౌతమ్‌రెడ్డి ఆక్రమించాడు. అంతేకాకుండా తనను చంపేందుకు ప్లాన్‌ చేశాడు. అని ఫిర్యాదులో ఉమామహేశ్వర శాస్త్రి పేర్కొన్నారు.
ఆ మేరకు నగరంలోని సత్యనారాయణపురం పోలీసులు గౌతమ్‌రెడ్డి మీద కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కోట్ల విలువ చేసే ఉమామహేశ్వర శాస్త్రి స్థలాన్ని ఆక్రమణలకు పాల్పడ్డాడు. దీని కోసం అతనని చంపించేందుకు కిరాయి హత్యకు కూడా గౌతమ్‌రెడ్డి ప్లాన్‌ చేశాడని పోలీసులు గుర్తించారు. పోలీసుల కేసు నమోదైన తర్వాత గౌతమ్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌతమ్‌రెడ్డి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. అందులో భాగంగా ఆయన ఇంటికి కూడా వెళ్లారు. ఈ కేసులో తాను అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగా గౌతమ్‌రెడ్డి తొలుత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గౌతమ్‌రెడ్డి పిటీషన్‌ను కొట్టేసింది. దీంతో గౌతమ్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 2న తొలి సారి విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణ వరకు గౌతమ్‌రెడ్డిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. శుక్రవారం మరో సారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ షరతులు విధించింది.
Read More
Next Story