పోసానికి బెయిలా? జైలా? మరో 48 గంటలు ఉత్కంఠ
x
Posani krishna Murali

పోసానికి బెయిలా? జైలా? మరో 48 గంటలు ఉత్కంఠ

సినీనటుడు పోసాని కృష్ణమురళీ బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా కోర్టులో మార్చి 19న వాదనలు పూర్తయ్యాయి. తీర్పును మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు.


సినీనటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ పై మార్చి 21న తీర్పు వెలువడుతుంది. ఆయన బెయిల్ పిటీషన్ పై మార్చి 19 బుధవారం గుంటూరు కోర్టులో జరిగిన వాదనలు ముగిశాయి. తీర్పును 21వ తేదీకి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌పై (Minister Lokesh) అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ముందు అన్నమయ్య జిల్లా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత వివిధ జిల్లాలలో కేసులు నమోదు అయ్యాయి.

గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల కిందట కూడా దీనిపై విచారణ జరిగింది. మార్చి 19న వాదనలు వింటామంటూ కోర్టు పేర్కొంది. దీంతో పోసాని బెయిల్ పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. అయితే ఈనెల 23 వరకు ఆయనకు సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో 21న బెయిల్ వస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది.

ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకరోజు కస్టడీకి తీసుకుని పోసానిని సీఐడీ పోలీసులు విచారించారు. మరోసారి కూడా పోసానిని కస్టడీకి కోరేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కస్టడీ పిటషన్ వేసేలోపు బెయిల్ వస్తుందా లేక ఈలోపు ఎవరైన పీటీ వారెంట్‌లు వేసి మరోసారి ఆయనను రిమాండ్‌కు పంపిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది.
అసలేమిటీ కేసులు...
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యకర్త బండారు వంశీకృష్ణ గత ఏడాది అక్టోబర్‌లో సీఐడీకి ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 12న కర్నూలు జిల్లాలో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై గుంటూరుకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపర్చడంతో ఆయనకు రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా వివిధ జిల్లాలలో కేసులు నమోదు అయ్యాయి.
Read More
Next Story