తెరమరుగైన తెనాలి
తొలి సార్వత్రిక ఎన్నికల నాటికే తెనాలి ఏర్పాటు. 1952 నుంచి 2009 వరకు కొనసాగింది. ఇక్కడ గెలిచి కేంద్రంలో ఎన్‌జి రంగా, నిశ్శంకరరావు, పి శివశంకర్ చక్రం తిప్పారు.
తెనాలి పార్లమెంట్ నియోజక వర్గం నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ప్రాముఖ్యత కలిగిన స్థానం. ఎందరో మహా నేతలు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. డీలిమిటేషన్ చట్టం 2002 ప్రకారం తెనాలి పార్లమెంట్ స్థానం 2008లో రద్దు చేశారు. ఈ లోక్ సభ కింద ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాలు గుంటూరు పార్లమెంట్‌లో కలిపారు.
ఆంధ్ర పారిస్‌గా తెనాలి ప్రసిద్ధి
గుంటూరు జిల్లాలో తెనాలి ప్రముఖ నగరం. తెనాలి నగరం ఆంధ్ర పారిస్‌గా ప్రసిద్ధి. తెనాలి బంగారు నగలు తయారీకి పేరుగాంచింది. చుట్టు పక్కల ప్రాంతాలకు ఇదే వ్యాపార కేంద్రం. తెనాలి పార్లమెంట్‌కు విశేషమైన చరిత్ర ఉంది. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం తెనాలి పార్లమెంట్‌ను ఏర్పాటు చేశారు.
1952 నుంచి 2009 వరకు
1952 నుంచి 2004 వరకు తెనాలి లోక్ సభ నియోజక వర్గం కొనసాగింది. ఈ నియోజక వర్గంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కమ్యునిస్టు పార్టీలు, తెలుగుదేశం పార్టీ పోటీ పడ్డాయి. ఇక్కడ ఒక్క సారి గెలిచిన కొత్త రఘురామయ్య గుంటూరు నుంచి ఐదు సార్లు గెలుపొందారు. కేంద్రంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. తెనాలి నుంచి గెలిచిన ఎన్‌జీ రంగా గుంటూరు పార్లమెంట్ నుంచి మూడు సార్లు, శ్రీకాకుళం నుంచి ఒక సారి, చిత్తూరు నుంచి మరో సారి మొత్తం ఆరు సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. రంగా రాజ్య సభకు కూడా ఎన్నికయ్యారు. ఈయన స్వాతంత్య్ర సమర యోధుడు. రైతు నాయకుడు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు.
తర్వాత జరిగిన ఎన్నికల్లో లావు బాలగంగాధరావు సీపీఐ తరఫున గెలిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మేడూరు నాగేశ్వరరావు తెనాలి నుంచి రెండు సార్లు, మచిలీపట్నం నుంచి ఒక సారి గెలిచారు. తెలుగుదేశ పార్టీ ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి నిశ్శంకరరావు వెంకటరత్నం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ నుంచి సింగం బసవపున్నయ్య గెలవగా 1991లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గెలిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లోను టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ప్రముఖ సినీనటి శారద గెలుపొందారు.
శివశంకర్ గెలుపు
అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి శివశంకరరావు విజయం సాధించారు. ఈయన కూడా కేంద్ర రాజకీయాలను శాసించిన నేతగా గుర్తింపు పొందారు. వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగా పని చేశారు. తర్వాత టీడీపీ నుంచి ఉమ్మారెడ్డి గెలుపొందారు. చివరి సారి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీలోకి దిగిన వల్లభనేని బాలశౌరి గెలుపొందారు. అనంతరం జరిగిన డీలిమిటేషన్‌లో తెనాలి పార్లమెంట్‌ను రద్దు చేశారు.
సినీ నటి శారద ఒక్కరే బీసీ
రఘురామయ్య, ఎన్‌జి రంగా, కొల్లా వెంకయ్యలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. మేడూరు నాగేశ్వరరావు, నిశ్శంకరరావు వెంకటరత్నం, సింగం బసవపున్నయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి శివశంకర్, బాలశౌరీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. సినీనటి శారద మాత్రం పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన వారు. తెనాలిలో మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ, నాలుగు సార్లు కాంగ్రెస్ ఐ, నాలుగు సార్లు టీడీపీ, రెండు సార్లు సీపీఐలు గెలిచాయి.
Next Story