
భువనేశ్వరికి అవార్డిచ్చిన సంస్థ బ్యాక్ గ్రౌండ్ ఏందంటే..
ప్రపంచ ప్రతిష్ఠాత్మక వ్యాపార నాయకత్వ సంస్థగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) ప్రఖ్యాతి గాంచింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (Institute of Directors - IoD) యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మక వ్యాపార నాయకత్వ సంస్థ. 1903లో దీనిని స్థాపించారు. ఈ సంస్థ కార్పొరేట్ గవర్నెన్స్, వ్యాపార నీతి, నాయకత్వ అభివృద్ధి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. లండన్‌లోని 116 పాల్ మాల్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 30,000కు పైగా సభ్యులు (డైరెక్టర్స్, సీఈఓలు, వ్యాపారవేత్తలు) ఈ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు.
ముఖ్య లక్ష్యాలు:
- కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం.
- వ్యాపార సంస్థలకు, ఆ సంస్థల నాయకులకు శిక్షణ ఇవ్వడం. నెట్‌వర్కింగ్, పరిశోధన వంటి సేవలు అందించడం.
- ప్రపంచవ్యాప్తంగా సస్టైనబిలిటీ, ఎథికల్ లీడర్‌షిప్ను ప్రోత్సహించడం.
ప్రతిష్ఠాత్మక అవార్డులు:
IoD ప్రతి సంవత్సరం గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తూ వ్యాపార, సామాజిక సేవ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులను, సంస్థలను గుర్తించి వారికి అవార్డులను ప్రకటించి సత్కరిస్తుంది. రెండు రకాల అవార్డులతో గౌరవిస్తుంది.
- డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్: ఆయా సంస్థలను డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన వారి లీడర్ క్వాలిటీస్ను గుర్తించి, వారు సామాజికంగా అందిస్తున్న సేవలను గుర్తించి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపిక చేస్తారు. గతంలో భారత రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం, ప్రముఖ వ్యాపారవేత్తలు రాజశ్రీ బిర్లా, సంజీవ్ గోయెంకాలకు కూడా ఈ అవార్డును ప్రధానం చేసి గౌరవించారు.
- గోల్డెన్ పీకాక్ అవార్డు: కార్పొరేట్ గవర్నెన్స్, సస్టైనబిలిటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి గాను సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ సంస్థ వీసీ, ఎండీ అయిన నారా భువనేశ్వరిని ఎంపిక చేశారు.
- ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న సామాజిక సేవలకు గాను నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్- 2025 ను, కార్పొరేట్ గవర్నెన్స్ కింద హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తున్నందుకు గాను గోల్డెన్ పీకాక్ అవార్డు అందించారు. IoD భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా భారత దేశంలో కూడా IoD ఇండియా బ్రాంచ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా హెరిటేజ్ ఫుడ్స్ 2017లో కూడా గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా మొదలైన వారు కూడా ఈ అవార్డులను అందుకున్నారు. ఈ IoD కి ప్రస్తుతం జోనాథన్ గెల్డార్ట్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు.
Next Story

