పుణ్యక్షేత్రాలకు బాబు.. విదేశాలకు జగన్‌
x

పుణ్యక్షేత్రాలకు బాబు.. విదేశాలకు జగన్‌

ఎన్నికల అనంతరం పార్టీల నాయకులు విశ్రాంతి కోసం టూర్ల బాట పట్టారు. చంద్రబాబు మాత్రం తీర్థ యాత్రల్లో బీజీగా ఉన్నారు.


మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబాలతో కలిసి సేద తీరేందుకు టూర్ల బాట పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన భార్య భారతిరెడ్డితో కలిసి శుక్రవారం రాత్రి లండన్‌ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఉంచి ఫ్రాన్స్, స్విట్జర్‌లాండ్‌ వంటి యూరప్‌ దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత లండన్‌లో కుమార్తెలు ఉన్నందున వారితో కలిసి గడిపేందుకు జగన్‌ దంపతులు వెళ్లారు. టూర్‌ ప్రోగ్రామ్‌ రెడీ చేసుకున్న తర్వాత సీబిఐ కోర్టు అనుమతి తీసుకోవలసి వచ్చింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌పై ఉన్నందు వల్ల కోర్టు అనుమతి తప్పనిసరైంది. కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన తర్వాత విదేశీ పర్యటనకు కోర్టు అనుమతినిస్తూ జగన్‌కు కొన్ని సూచనలు చేసింది. సీబీఐకి ఫోన్‌లో అందుబాటులో ఉండాలని, మెయిల్‌ ఐడీని వారికి అందజేయాలని, ప్రయాణ ప్రణాళికను సీబీఐకి పంపించాలని అదేశాల్లో పేర్కొన్నారు.

చంద్రాబు నాయుడు మే 15 నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్‌ కార్యక్రమానికి కాశీలో హాజరయ్యారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా హాజరై నామినేషన్‌ వేసే వరకు ఉండి అక్కడ జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో కూడా పాల్గొన్నారు. వారణాసిలోని దేవాలయాల్లో పవన్‌ కల్యాణ్‌ పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి హైదరాబాద్‌కు వచ్చి మహారాష్ట్రలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి వెళ్లారు. కొల్హాపూర్‌ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, పూజలు చేశారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలనేది నా చిరకాల వాంఛ అని అది ఇప్పటికి నెరవేరిందని బాబు అన్నారు. షిరిడీ సాయిబాబాను దర్శించుకొని పూజలు చేశారు. షిరిడీలో తెలుగు వారైన బండ్లమూడి శ్రీనివాస్‌ రామ్మోహన్‌రావులు షిరిడీలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని చంద్రబాబు దంపతులు సందర్శించి వారిని అభినందించారు.
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల పర్యటనల్లో జ్వరం బారిన పడటం వల్ల హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. ఆమె కుమారుడు రాజారెడ్డి అమెరికాలో ఉంటుంద వల్ల షర్మిల తల్లి విజయమ్మ ఇప్పటికే మనుమడి వద్దకు వెళ్లింది. విజయమ్మ అమెరికాలోనే ఉన్నందు వల్ల షర్మిల దంపతులు కూడా అమెరికాకు వెళ్లి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే ఆమె విదేశీ పర్యటన కానీ, ఎక్కడ ఉన్నారనే విషయం కానీ ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు తెలియక పోవడం విశేషం.
మంత్రి ఆర్కే రోజా ఎన్నికలు అయిపోగానే కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లారు. చెన్నైలోని అత్తగారి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు మంత్రులు కూడా హైదరాబాద్‌లో సేద తీరుతున్నట్లు సమాచారం.


Read More
Next Story