టీడీపీ కార్యకర్తలకు బాబు అభయం
తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ విభాగం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షలు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. నాయకుల మాదిరిగానే కార్యకర్తలకు కూడా రకరకాల సమస్యలు ఉంటాయని, కార్యకర్తలే లేకుంటే 2024 ఎన్నికల్లో టీడీపీ ఇంత భారీ స్థాయిలో మెజారిటీతో గెలిచేదే కాదనే అభిప్రాయాన్ని బాబు వెలుబుచ్చారు. అందుకోసం ప్రతి వారం కార్యకర్తలకు ముఖ్యమంత్రిగా తాను అందుబాటులో ఉండాలనే నిర్ణయానికి బాబు వచ్చారు. ప్రజల నుంచి వచ్చే గ్రీవెన్స్ పరిష్కరించడం ఒక ఎల్తైతే పార్టీ కార్యకర్తల నుంచి వచ్చే అభిప్రాయాలను తీసుకొని పార్టీని బలోపేతం చేయడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించడం మరొక ఎత్తనే అభిప్రాయాంలో సీఎం చంద్రబాబు ఉన్నారు. అందుకే ప్రతి శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి క్రమం తప్పకుండా వస్తానని, గెలిచిన తర్వాత మొదటి సారి టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా బాబు వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయా జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలకు తరచుగా వెళ్లాలని బాబు ఆదేశించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మంత్రులు వెళ్లాలని బాబు చెప్పడం విశేషం. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.