
బాబు, పవన్ మాటల వైరుధ్యం!
లిక్కర్ స్కాంపై నేను మాట్లాడేదేమీ లేదన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. లిక్కర్ స్కాంలో చార్జ్ షీట్ వేయగానే స్పందించాలని ఎంపీలకు హిత బోధ చేశారు సీఎం చంద్రబాబు.
మద్యం కుంభకోణం రాష్ట్రాన్ని రాజకీయంగా కుదిపేస్తున్న అంశం. ఈ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య మాటల వైరుధ్యం కొనసాగుతోంది. ఒకరు దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించాలంటే, మరొకరు తానేమీ స్పందించేది లేదంటారు. ఇంతకూ కూటమిలో ఏమి జరుగుతోంది? ఎందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య వైరుధ్యం మాటల వైరుధ్యం ఏర్పడిందనేది రాష్ట్రంలో చర్చగా మారింది.
సీఎం చంద్రబాబు ఏమన్నారు...
మద్యం కుంభకోణంపై పోలీసులు చార్జ్ షీట్ వేయంగానే స్పందించాలని పార్లమెంట్ సభ్యులకు ఉద్భోదించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా 19న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులపై కేసులకు సంబంధించి పోలీసులు చార్జ్ షీట్ వేయగానే ఎండగట్టే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. మద్యం కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు అనేక సార్లు మాట్లాడారు. మంత్రులు కూడా అనేక సార్లు మాట్లాడారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏమన్నారు...
ఉప ముఖ్యమంత్రి కె పవన్ కల్యాణ్ మద్యం కుంభకోణంపై మాట్లాడేందుకు తిరస్కరించారు. మద్యం కుంభకోణం వ్యవహారం కోర్టులో ఉంది. దానిపై నేను మాట్లాడేది ఏమీ లేదన్నారు. సోమవారం హైదరాబాద్ లో హరిహర వీరమల్లు సినిమా విశేషాలు చెప్పేందుకు పవన్ కల్యాణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సినిమా విశేషాలు మాట్లాడిన తరువాత ఒక విలేకరి ప్రశ్నిస్తూ మద్యం కుంభకోణం విషయంలో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు. దీంతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జగన్ పై మాకు కక్షలు ఏమీ లేవు. రాజకీయాలు మాత్రమే ఉన్నాయని అనటంతో పాటు మద్యం కుంభకోణం కేసు కోర్టులో ఉన్నందున నేను మాట్లాడేదేమీ లేదన్నారు.
ఎందుకు ఇద్దరి మద్య వైరుధ్యం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల మధ్య మాటల వైరుధ్యం కనిపించింది. ఎందుకు ఇలా జరిగిందనేది ప్రస్తుతం చర్చగా మారింది. కూటమిలో స్పర్థలు ఉన్నాయని, ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉందని స్పష్టమైంది. జగన్ పై ఇటీవలి వరకు భగ్గుమన్న పవన్ కల్యాణ్ ఒక్క సారిగా కూల్ గా మాట్లాడటం వెనుక దాగి ఉన్నది ఏమిటనే చర్చ కూడా మొదలైంది.
బీజేపీ ప్లాన్ ఉందా?
పవన్ మాటల వెనుక పవన్ కల్యాణ్ వ్యూహం ఏమైనా ఉందా? అనే చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అధికార ప్రతినిధి యామినీ శర్మలు మద్యం కుంభకోణంపై స్పందించారు. మద్యం కుంభకోణంలో బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ వారే ఇటీవల గట్టిగా డిమాండ్ చేస్తుంటే పవన్ కల్యాణ్ కూల్ గా మాట్లాడటంపై చర్చ జరుగుతోంది. బీజేపీ పవన్ కల్యాణ్ తో కూల్ గా మాట్లాడించి ఉంటే అధ్యక్షులు మాధవ్, ఇతర బీజేపీ వారు మద్యం వ్యవహారంపై గట్టిగా ఎలా మాట్లాడతారనే చర్చ కూడా జరుగుతోంది.
కూటమిలో స్పర్థలు ఉన్నాయా?
కూటమి ప్రభుత్వంలో స్పర్థలు ఉన్నాయని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకరికి ఒకరు పొంతన లేని విధంగా మాట్లాడటం, జగన్ పై మాకు కోపం లేదని పవన్ అంటే... జగన్ ను ఎలాగైనా బదనాం చేయాలనే ఆలోచన టీడీపీ వారిలో ఉంది. దీనిని బట్టి స్పర్థలు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయని అర్థం అవుతోంది.