
బాబు, పవన్ బంధం మరింత పటిష్టం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్యం, రాష్ట్ర వ్యవహారాలపై చర్చ.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్‌తో మాట్లాడి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత లేదని దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని తెలిపారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తోందని ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని వైద్యులు చెప్పినట్లు వివరించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని స్ఫూర్తిని నింపారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంపై చర్చించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని తద్వారా మహిళలకు ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం మూలంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక భరోసాను కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని 4వ తేదీన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసిన చేపట్టిన ఈ పథకం కూడా కచ్చితంగా అందరి మన్ననలు పొందుతుందనే విశ్వాసాన్ని ఉప ముఖ్యమంత్రి వ్యక్తపరిచారు.
అక్టోబర్ 16వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయడంపై చర్చించుకున్నారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న రోడ్ షో నిర్వహణ అందుకు సంబంధించిన ప్రణాళికల ప్రస్తావన వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలను ప్రస్తావించారు.
సభలో సభ్యుల తీరు కూడా వీరి మాటల్లో చర్చకు వచ్చింది. ప్రధాని మోదీ పర్యటన విజయవంతంపై చర్చించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికే సందర్భంలో పుష్పగుచ్ఛం ఇచ్చి ఇంట్లోకి వెళుతూ ముఖానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నారు. అంటే తీవ్రమైన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని చూసే వారికి అర్థమైంది. సభకు హాజరు కాలేక పోయిన పవన్‌తో సభ పరిస్థితులు, సభా మర్యాదలు, కొందరు ఎమ్మెల్యేల తీరు, చిరంజీవిపై వ్యాఖ్యలు వంటి అంశాలను కూడా సీఎం డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చాయి. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టాలనుకున్నా కలిసి పనిచేద్దామనే చర్చ ముందుకు తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య సమన్వయం మరింత బలపడినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఆరోగ్యం మెరుగుపడి తిరిగి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఆరోగ్యం సహకరించకపోయినా హాజరైన పవన్ కల్యాణ్ ఇప్పుడు హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.