యాక్సిస్ పవర్.. బాబుకు లాభం, జనానికి భారమా?
x

యాక్సిస్ పవర్.. బాబుకు లాభం, జనానికి భారమా?

YCP నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణ


యాక్సిస్‌ పవర్‌తో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒప్పందం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ చీఫ్‌ విప్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. యూనిట్ కి‌ రూ.4.60 చొప్పున కొనుగోలుతో ప్రజలపై పెనుభారం పడనుందన్నారు. దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని స్కామ్‌ అని, బినామీల జేబులు నింపడానికే సీఎం చంద్రబాబు దీన్ని కొనుగోలు చేశారని అన్నారు.
‘వైస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐఎస్‌టీసీ చార్జీలు లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా యూనిట్‌ విద్యుత్తు రూ.2.49కు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటేనే కూటమి పార్టీలు గగ్గోలు పెట్టాయి. ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ రూ.1.10 లక్షల కోట్లు నష్టం చేశారంటూ చంద్రబాబు, ఆయన వర్గం దారుణమైన అబద్ధపు ప్రచారం చేశారు. మరి యాక్సిస్‌ పవర్‌ నుంచి యూనిట్‌ రూ.4.60కు కొనుగోలుకు ప్రస్తుత ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ అడ్డగోలు ఒప్పందం ద్వారా మరో భారీ కుంభకోణానికి ప్రణాళికలు రచించింది.
పైగా 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించడానికి వీల్లేకుండా సీలింగ్‌ షరతు విధించి కాంట్రాక్టర్ల ఆదాయానికి రాజమార్గం చూపింది. యూనిట్‌ మీద రూ.2.11 అధికంగా చెల్లించి కొనడం, ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్‌ 108 పేరుతో బెదిరించి మరీ ఒప్పందాన్ని ఆమోదించుకోవడం చూస్తుంటే ఎంత భారీ అవినీతికి తెగించారో తెలుస్తోంది’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
చంద్రబాబు పాలనంతా చీకట్లే
‘గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎప్పుడూ లో ఓల్టేజీ సమస్యలతో రైతులు అల్లాడేవారు. పంపిణీ సంస్థలను దివాలా తీయించారు. వైఎస్సా­ర్‌ సీఎం అయ్యాక విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించి వ్యవసాయాన్ని పండుగ చేశారు. మళ్లీ 2014లో బాబు సీఎం అయ్యాక తప్పుడు ఒప్పందాలతో దోపిడీకి తెరతీశారు. ఉమ్మడి ఏపీ విడిపోయేనాటికి రూ.29 వేల కోట్ల విద్యుత్తు బకాయిలు ఉండగా, 2019లో దిగిపోయే నాటికి అవి రూ.86,300 కోట్లకు చేర్చారు. సీఏజీఆర్‌ (కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌) 24 శాతం పెరిగింది. 2019లో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కరోనా సంక్షోభంలోనూ సీఏజీఆర్‌ రేషియో 7.2 శాతమే నమోదైంది’ అని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.
వైఎస్‌ జగన్‌ 2019–24 మధ్య డిస్కంలకు రూ.47,800 కోట్లు చెల్లిస్తే, 2014–19 నడుమ టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించిందని, రైతులకు ఉచిత విద్యుత్తు బకాయిలు రూ.8,845 కోట్లు ఎగ్గొట్టిందని, వాటిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వమే చెల్లించిందని తెలిపారు. 2014 వరకు 11 పీపీఏలు (పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు) మాత్రమే ఉంటే, 2014–19 మధ్య చంద్రబాబు 39 సోలార్‌ పీపీఏలు చేసుకున్నారని, అన్నీ 25 ఏళ్ల కాల పరిమితితో, మూడేళ్లకోసారి ధరలు పెంచేలా ఒప్పందం కుదుర్చుని ప్రజల నెత్తిన అప్పు మోపారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 2014 వరకు 91 విండ్‌ పీపీఏలు జరిగితే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 133 ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ యూనిట్‌ రూ.4.84 కనీస చార్జితో చేసుకున్నవే అని చెప్పారు.
Read More
Next Story