
ఏపీలోని ఐదు నగరాలకు అవార్డులు
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా మంత్రి నారాయణ అవార్డులు అందుకున్నారు.
పరిశుభ్రత అంశంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు దక్కాయి. రాష్ట్రంలోని ఐదు ప్రముఖ నగరాలకు ఈ అవార్డులు దక్కాయి. దేశ వ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛసర్వేక్షణ్‌కు ఏపీ నుంచి ఈ ఐదు నగరాలు ఎంపికయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి నగరాలను ఎంపిక చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఈ నగరాలు అగ్రభాగాన నిలవడంతో ఈ అవార్డులను ప్రకటించారు. స్పెషల్ కేటగిరీ మినిస్టరియల్ అవార్డును విశాఖ నగరం సొంతం చేసుకోగా, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ కేటగిరీలో అవార్డులకు ఎంపిక చేశారు.
నగరాల్లోని పరిశుభ్రతతో పాటుగా వ్యర్థాల నిర్వహణ, పౌరుల సహకారం, స్థిరమైన పరిష్కారాలు వంటి పలు అంశాలను తీసుకొని అవార్డులకు ఎంపిక చేస్తారు. పరిశుభ్రతను పాటించడంలోను, వ్యర్థాల నిర్వహణలోను విశాఖపట్నం నగరం రాష్ట్రంలోనే అగ్ర భాగాన నిలిచింది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఈ ఐదు నగరాల కార్పొరేషన్‌ల కమిషనర్లతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా గురువారం ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, మంత్రి నారాయణ, ఆయా కార్పొరేషన్ల అధికారులు పాల్గొన్నారు.