
కోసిన ఆవకాడోలు
‘అల్లూరి’ అడవుల్లో ‘ఆవకాడో’ అడుగులు!
అక్కడి గిరిజన రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఉద్యానశాఖ అధికారులు కూడా వీరిని ప్రోత్సహిస్తున్నారు.
ఆవకాడో.. ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న ఖరీదైన ఫలం. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండు విదేశాల్లోనే ఎక్కువగా పండుతోంది. ప్రస్తుతం దేశంలోని తూర్పు హిమాలయ ప్రాంతంతో పాటు కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లో కొన్నిచోట్ల మాత్రమే సాగులో ఉంది. ఖరీదైన ఈ ఆవకాడో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ అడుగులు వేస్తోంది. అక్కడి గిరిజన రైతాంగం దీని సాగుపై ఆసక్తి చూపుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ ద్వారా ఆవకాడో మొక్కలను పంపిణీ చేయిస్తోంది. ఆ జిల్లాలోని గొందిపాకలు, పెద్దబరడ గ్రామాల్లో గిరిజన రైతులు ఆవకాడో సాగు ఇప్పటికే మొదలు పెట్టారు. ఎన్నో దశాబ్దాలుగా అల్లూరి జిల్లా గంజాయి సాగుకు అడ్డాగా ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి, మిర్చి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకం ఇస్తూ ఈ ఆవకాడోను ప్రోత్సహిస్తోంది. గతంలో అసలు ఆవకాడో అంటే ఏమిటో తెలియని గిరిజన రైతులు ఇప్పుడిప్పుడే దానిపై ఆసక్తి పెంచుకుంటున్నారు.

చెట్లకు కాసిన ఆవకాడోలు
అల్లూరి జిల్లా ఎందుకు అనుకూలం..?
ఆవకాడో సాగుకు పొడి వాతావరణం ఉండాలి. ఈ చెట్లకు ఎక్కువ నీరు, ఎక్కువ చల్లదనం ఉండకూడదు. ఎర్ర ఇసుక నేల ఉండాలి. అందుకే ఉత్తర భారత్‌కంటే దక్షిణ భారతదేశం వీటి సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో ఉండడంతో ఆవకాడోకు అనువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లాభాలను పండిస్తాయి..
ఈ ఆవకాడో చెట్లు మామిడి చెట్లను పోలి ఉంటాయి. మొక్కలు నాటిన ఐదారేళ్లకు కాపుకొస్తాయి. కోసిన పది రోజుల్లో పండుతాయి. సీజనుకు చెట్టుకు 100 నుంచి 200 పండ్లు కాస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పండ్లు చేతికొస్తాయి. ధర కిలో మార్కెట్లో నాణ్యతను బట్టి రూ.250 నుంచి 350 వరకు ఉంది. కిలోకు ఐదారు కాయలు తూగుతాయి. ఒక్కోటి విడిగా రూ.40–50 పలుకుతుంది. వ్యాపారులు వీటిని రైతుల నుంచి కిలో రూ.140–160 మధ్య కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆవకాడో కిలో రూ.700–900 వరకు ఉంది. అదే దేశీయంగా పండినవైతే అందులో సగం ధరకే లభిస్తున్నాయి. వీటి పెంపకానికి రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులే వాడతారు. ఈ ప్రాంతంలో హాస్ రకం ఆవకాడోను వేస్తున్నారు. ఒక్కో మొక్క రూ.150–200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి 60–80 వరకు మొక్కలు అవసరమవుతాయి. సగటున ఎకరానికి మొక్కలు, సేంద్రియ ఎరువు, ఇతర ఖర్చులు కలిపి మొదటి ఏడాది రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. మొక్క నాటిన నాలుగేళ్లకే కాపు మొదలవుతుంది. ఇలా ఒక్కో చెట్టు పూర్తిస్థాయిలో కాపుకొచ్చే సరికి 150 కాయల దిగుబడినిస్తుంది. ఇలా ఏటా ఒక్కో ఎకరం నుంచి సగటున రూ.3 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని చింతపల్లి మండలం లంబసింగికి చెందిన ఆవకాడో రైతు గంగాధర్ చెబుతున్నాడు. దీంతో ఈ గిరిజన రైతులు ఆవకాడో వైపు ఆసక్తి చూపుతున్నారు. హాస్ రకం ఆవకాడోలో ‘గుడ్ ఫ్యాట్’ ఉండడం వల్ల దీనికి డిమాండ్ ఎక్కువ. అల్లూరి జిల్లాలో ఈ రకమే పండుతోంది. పైగా ఇతర ప్రాంతాల్లో కంటే ఇక్కడ కాస్తున్న ఆవకాడోల సైజు కూడా పెద్దవే.
ఆవకాడోకి పెట్టుబడి ప్రోత్సాహకం..
‘ఈ జిల్లాలో చింతపల్లి, జీకేవీధి మండలాల్లో కొంతమంది రైతులు 25 ఎకరాల్లో ఆవకాడోను పండిస్తున్నారు. ఈ పంట లాభాలను తెచ్చిపెడుతుండడంతో రైతులు ముందుకొస్తున్నారు. ఆవకాడో సాగు చేసే రైతుకు హెక్టారుకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో సంవత్సరం రూ.20 వేల చొప్పున పెట్టుబడి (డీబీటీ) ప్రోత్సహకం ఇస్తున్నాం. రైతులు ఆసక్తి చూపుతుండడంతో ఈ ఏడాది 250 ఎకరాల్లో పెంచడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని ఏఎస్సార్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎ.రమేష్‌కుమార్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
‘అల్లూరి’లోకి అలా అడుగెట్టాయి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ఈ ఆవకాడో ప్రవేశం అనూహ్యంగా జరిగింది. ఇరవయ్యేళ్ల క్రితం అప్పటి కాఫీ బోర్డు అధికారి ఒకరు కాఫీ తోటల్లో నీడనిచ్చే చెట్లుగా వీటిని కర్నాటక నుంచి రప్పించారు. అప్పటికి ఆవకాడో పండ్లకు అంత గిరాకీ లేదు. చాలామందికి ఆ పండ్ల గురించే తెలియదు. అలా అప్పట్లో నాటిన ఆవకాడో చెట్లు ఫలాలనివ్వడం మొదలు పెట్టాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పండ్ల వినియోగం ఇప్పడు నగరాలు, మహానగరాల్లో పెరుగుతోంది. డిమాండ్‌తో పాటు ధర బాగుండడంతో గిరి రైతులు వీటి సాగుపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఎకరాల్లోకంటే తమకున్న కొద్దిపాటి స్థలాల్లో కూడా ఆవకాడో చెట్లను పెంచుతున్నారు.
ఆవకాడో.. ఆరోగ్య ఫలం..
ఆవకాడో పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చెడు కొలస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వుల వల్ల కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఇది ఎక్కువ తిండి తినకుండా నిరోధించి బరువు దక్కడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం ఉండడం వల్ల శరీరంలో మంటను తగ్గిస్తుంది. లుటిన్‌తో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. దీనిలో ఉన్న విటమిన్లతో చర్మ, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకా ఆవకాడోలో ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలుంటాయి. ఇవి గర్భధారణ, తల్లి పాలు ఇచ్చే సమయంలో అవసరమవుతాయి.
ఆవకాడోది వెన్నలాంటి రుచి..
ఆవకాడో పండు రుచి భిన్నంగా ఉంటుంది. తీపి లేకుండా చప్పగా వెన్న తిన్న అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల సలాడ్‌ల రూపంలోను, ఉప్పు, మిరియాల పొడిని వేసుకుని తినొచ్చు. ఇంకా నిమ్మరసం, వెనిగర్‌తో ఇతర మసాలా దినుసులను కూడా జోడించి, తింటే బాగుంటుంది.

చెట్టి బిందు
ఆవకాడోపై గిరిజన రైతులకు ఆసక్తి..
‘ఆవకాడో చెట్ల పెంపకంపై గిరిజన రైతుల్లో గతంకంటే ఆసక్తి పెరుగుతోంది. ఈ పండుకున్న ఆరోగ్య గుణాల వల్ల అర్బన్ ప్రాంతాల్లో వినియోగం అధికమవుతోంది. మా దగ్గరకు వస్తున్న రైతులకు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నాం. ఆవకాడోలో అనువైన రకాలను సూచిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతులకు ఈ మొక్కలను కేరళ, కర్నాటక నుంచి తెచ్చి విక్రయిస్తున్నారు. కడియం నర్సరీల్లోనూ అమ్ముతున్నారు. నేల, వాతావరణ పరిస్థితులను బట్టి, సేంద్రియ ఎరువు వాడకంతో అల్లూరి జిల్లాలో పండుతున్న ఆవకాడోలు పెద్ద సైజులో ఉంటున్నాయి. రెండు మూడేళ్లలో ఈ ప్రాంతంలో ఆవకాడో విస్తీర్ణంతో పాటు ఉత్పత్తి కూడా మరింత పెరుగుతుంది. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా ఆవకాడో సాగుకు అనుకూల పరిస్థితులపై అధ్యయనం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఆవకాడోలో ఏ వెరైటీ అనువైనదో అధ్యయనం చేస్తున్నాం’అని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రం విభాగాధిపతి చెట్టి బిందు ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధికి చెప్పారు.
Next Story