అచ్చెన్నకు ఇంటి పోరు
x

అచ్చెన్నకు ఇంటి పోరు

శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీలో ఇంటిపోరు తప్పలేదు. గుండా లక్ష్మీదేవికి శ్రీకాకుళం నుంచి కలమట వెంకటరమణకు పాతపట్నం టిక్కెట్‌లు దక్కలేదు.


జి విజయ కుమార్

ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడికి ఇంటిపోరు ఎక్కువైంది. ఏపి రాజకీయాల్లో బలమైన ముద్రకలిగిన నాయకుడు అచ్చెన్నాయుడు. అటువంటిది తెలుగుదేశం పార్టీలో తనకు ఎదురు తిరిగే వాళ్లను లేకుండా చేసుకోలేక పోయారు. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కేటాయింపు అచ్చెన్నపై వ్యతిరేకతకు కారణమైందని చెప్పొచ్చు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గుండా లక్ష్మిదేవిని కాదని గోండు శంకర్‌కు అసెంబ్లీ టికెట్‌ కేటాయించారు. అలాగే పాతపట్నం అసెంబ్లీ స్థానం నుంచి కలమట వెంకటరమణకు పక్కన పెట్టి మామిడి గోవిందరావును అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఇద్దరు పార్టీ పెద్దలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గుండా లక్ష్మిదేవి చంద్రబాబునాయుడుతో ఇప్పటికే భేటీ కాగా కలమట వెంకటరమణ మాత్రం తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వీరిద్దరూ అచ్చెన్నాయుడుపై గుర్రుగా ఉన్నారు. తమకు టిక్కెట్‌ రాకుండా చేసింది అచ్చన్నేననే అనుమానంతో ఉన్నారు. జిల్లాలో సీట్ల కేటాయింపు విషయం చంద్రబాబునాయుడు అచ్చెన్నాయుడికి చెప్పకుండా చేస్తారా? అనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఒక సారి ప్రకటిస్తే ఇక అదే ఫైనల్‌
టిక్కెట్‌ ప్రకటించిన వారిని మార్చే అవకాశం లేదని ఇప్పటికే చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీంతో శ్రీకాకుళం నుంచి గుండా, అటు పాతపట్నం నుంచి కలమటలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీనంతటికీ కారణం అచ్చెన్నాయుడేనని అంటున్నారు. తమకు టిక్కెట్‌ రాకుండా అడ్డుకుంది అచ్చెన్నాయుడేనని విమర్శలు చేయడం విశేషం. ఎలాగైనా కింజరాపు కుటుంబ ఆదిపత్యానికి చెక్‌ పెట్టాల్సిందేననే ఆలోచనలో వీరు ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థులుగా
శ్రీకాకుళం నుంచి గుండా లక్ష్మీదేవి, పాతపట్నం నుంచి కలమటి వెంకటరమణలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చారు. ఇప్పటికే తమ అనుచరులతో వారు మాట్లాడుకున్నారు. తాము ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తామని అధిష్టానానికి హింట్‌ ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి గుండా అప్పలసూర్యనారాయణ పార్లమెంట్‌కు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చారు. దీంతో శ్రీకాకుళం పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడను మంగళవారం గుండా లక్ష్మీదేవి, సూర్యనారాయణలను పిలిపించారు. ఉదయం పలాసలో గుండా లక్ష్మీదేవి, సూర్యనారాయణలు చంద్రబాబును కలిసి మాట్లాడారు. మీకు టిక్కెట్‌ ఇచ్చే అవకాశం లేదని, ఈ సారికి నేను చెప్పినట్లు వినాలని చంద్రబాబు వారికి సూచించారు. దీంతో వారు ఏమి చేయాలో ఆలోచించుకునేందుకు సమయం ఇవ్వాలని బాబును కోరారు. బుధవారం పార్టీలోని ముఖ్యనాయకులు, సిటీ కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని వారి అభిప్రాయాలు తీసుకున్నారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే చెప్పడంతో చేసేది లేక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. బహిరంగంగా ప్రకటించకపోయినా కార్యకర్తలతో మాత్రం చెప్పారు. గొండు శంకర్‌కు మాత్రం తాము సపోర్టుచేసేది లేదని, ఆయన తరపున ప్రచారం కూడా చేసేది లేదనే నిర్ణయానికి వచ్చారు. 2014 ఎన్నికల్లో గుండా లక్ష్మిదేవి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ధర్మాన ప్రసాదరావును ఓడించారు. అప్పల సూర్యనారాయణ నాలుగు సార్లు శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంత సీనియారిటీ ఉన్నప్పటికీ ఇరువురిలో ఒక్కరికి కూడా అవకాశం లేకుండా చేయడాన్ని వారు జీర్నించుకోలేకపోతున్నారు. భార్యాభర్తలు ఇరువురూ తెలుగుదేశం పార్టీకి నమ్మకస్తులుగా ఉన్నవారు కావడం విశేషం.
అచ్చెన్నపై 15 మంది రంగంలోకి
కలమట వెంకటరమణ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగటం దాదాపు ఖాయమైంది. చంద్రబాబునాయుడు మంగళవారం కలవాల్సిందిగా కలమటకు చెప్పినా ఆయన బాబును కలవలేదు. కేవలం గంట ముందు చెప్పి కలవాలంటే సాధ్యం కాదని చెప్పి చంద్రబాబును కలవలేదు. టెక్కలి నియోజకవర్గంలో కనీసం 15 మందిని అచ్చెన్నాయుడుపై స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌లు వేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు వివ్వసనీయ సమాచారం. అదే జరిగితే పాతపట్నంలో తెలుగుదేశం పార్టీకి ఎదురీత తప్పదని స్థానికులు చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం వీరికి టిక్కెట్‌ లేని విషయాన్ని తేల్చి చెప్పారు.
Read More
Next Story