బీఆర్ఎస్ కు స్పీకర్  రివర్స్ షాక్
x

బీఆర్ఎస్ కు స్పీకర్ రివర్స్ షాక్

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ఫిరాయింపు ఎంఎల్ఏకి అసెంబ్లీ తరపున నియమించిన కమిటీలో కీలకమైన పదవి అప్పగించారు.


బీఆర్ఎస్ కే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రివర్స్ షాకిచ్చారు. ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సోమవారం హైకోర్టు అసెంబ్లీ సెక్రటేరియట్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఉదయం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలంతా పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ముగ్గురు ఫిరాయింపు ఎంఏల్ఏల దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు పడినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ తదితరులు రెచ్చిపోతున్నారు. ఫిరాయింపులను తప్పుపడుతు హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టంటు ఏదేదో మాట్లాడేస్తున్తున్నారు. నిజానికి కోర్టు ఫిరాయింపు ఎంఎల్ఏలపై ఎలాంటి తీర్పివ్వలేదు. ఫిరాయింపులపై నాలుగువారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని స్పీకర్ కార్యాలయానికి సూచన మాత్రమే చేసింది.

ఫిరాయింపులపై గతంలో కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో బీఆర్ఎస్ కూడా ఫిరాయింపులపై కోర్టు ఇచ్చిన ఆదేశాలు, సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇపుడు విషయం ఏమిటంటే ఫిరాయింపులపై ఉదయం హైకోర్టు అలా సూచనలు చేసిందో లేదో సాయంత్రానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ఫిరాయింపు ఎంఎల్ఏకి అసెంబ్లీ తరపున నియమించిన కమిటీలో కీలకమైన పదవి అప్పగించారు. అసెంబ్లీ తరపున మూడు కమటీలను స్పీకర్ నియమించారు. ఇందులో పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి, ఎస్టిమేట్స్ కమిటి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటిలను స్పీకర్ నియమించారు. వీటిల్లో పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి అన్నది చాలా కీలకమైనది. ఎందుకింత కీలకమంటే ప్రభుత్వం చేసే ప్రతి రూపాయి ఖర్చును ఈ కమిటి క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ కమిటి ఏ శాఖను పరిశీలించినా ఆ శాఖ ఉన్నతాధికారులు కమిటి అడిగిన లెక్కలను పూర్తిగా ఇవ్వాల్సిందే.

ఇంతటి కీలకమైన కమిటీకి అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్షంకు చెందిన ఎంఎల్ఏల ఉంటారు. ప్రతిపక్ష ఎంఎల్ఏ ఛైర్మన్ గా ఉంటారు కాబట్టే ఈ కమిటీకి ఇంతటి ప్రాధాన్యత. అయితే తాజా నియామకంలో స్పీకర్ ఛైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికే కట్టబెట్టారు. అయితే ప్రతిపక్షం ఎంఎల్ఏకి కాకుండా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఆరెకపూడి గాంధీ నియమించారు. అంటే సాంకేతికంగా గాంధీ బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అయినా ఉంటున్నది మాత్రం కాంగ్రెస్ లోనే. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి ఛైర్మన్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీమంత్రి, సీనియర్ నేత హరీష్ రావు పేరును సూచించినట్లు తెలిసింది.

అయితే స్పీకర్ మాత్రం కేసీఆర్ సూచించిన హరీష్ ను కాదని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన గాంధిని ఛైర్మన్ గా నియమించటం ద్వారా బీఆర్ఎస్ కు పెద్ద షాకిచ్చారనే అనుకోవాలి. ముగ్గురు ఫిరాయింపు ఎంఎల్ఏలపై ఏదో నిర్ణయం తీసుకోమని ఉదయం హైకోర్టు చెబితే సాయంత్రానికి మరో ఫిరాయింపు ఎంఎల్ఏకి స్పీకర్ కీలకమైన పదవిని అప్పగించటంతో అందరు ఆశ్చర్యపోయారు. తాజా నియామకంతో హైకోర్టు సూచనను స్పీకర్ ఏమాత్రం పట్టించుకోలేదని అర్ధమవుతోంది. దీంతో బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది, దానికి స్పీకర్ కార్యాలయం ఎలా ప్రతిస్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

Read More
Next Story