తెలుగు ప్రముఖల చిత్ర పటాలతో అసెంబ్లీ క్యాలండర్‌
x

తెలుగు ప్రముఖల చిత్ర పటాలతో అసెంబ్లీ క్యాలండర్‌

అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సెక్రెటరీ జనరల్‌ సూర్యదేవరలతో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.


నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ క్యాలండర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లు లేకుండానే అసెంబ్లీ క్యాలండర్‌ను ఆవిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరం క్యాలండర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. క్యాలండర్‌లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తుచేశారు. సైమన్‌ గో బ్యాక్‌ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాంతంత్య్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని సీఎం చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థలు, గవర్నర్‌ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయసహకారాలు అందించారని చెప్పారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని అన్నారు. ఢిల్లీలో పరిపాలన– శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని అన్నారు.

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జాతీయ భాష, న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రం, మానవ అక్రమ రవాణాపై చేసిన కీలక సూచనలను రాజ్యాంగ సభ ఆమోదించిందన్నారు. మోటూరి సత్యనారాయణ జాతీయ భాష గురించి విలువైన సలహాలిచ్చారని అన్నారు. గోగినేని రంగనాయకులు(ఎన్జీ రంగా) రాజ్యాంగంలో అధికార వికేంద్రీకరణ, అత్యవసర అధికారాలు, రెండు సభలు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై పలు సూచనలు చేశారని తెలిపారు. భూ సేకరణకు నష్ట పరిహారం చెల్లించేలా నిబంధన తీసుకురావడంతో పాటు పాఠశాలలు, దేవాలయాల్లో ఎక్కడా వివక్ష ఉండకూడదని మతం, జాతి, కులం, లింగం ఆధారంగా నిరాదరణ చూపించకుండా నిబంధన రూపొందించాలని వీసీ కేశవరావు రాజ్యాంగసభలో ప్రతిపాదించారని సీఎం చంద్రబుబు తెలిపారు. డ్రాఫ్టింగ్‌ కమిటీ, అడ్వైజరీ కమిటీ, ప్రాథమిక హక్కులపై సబ్‌–కమిటీతో సహా తొమ్మిది కమిటీలలో అల్లాడి కృష్ణ స్వామి భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఎమర్జెన్సీ నిబంధనలపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. రాజ్యాంగంలో మహాత్మా గాంధీ ఆలోచనలు ప్రతిబింబించేలా మొసలికంటి తిరుమలరావు కృషి చేశారని అన్నారు. ఆస్తి హక్కు, జమీందారీ వ్యవస్థ రద్దు గురించిన చర్చలో కళా వెంకటరావు ప్రముఖంగా పాల్గొన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బారావు, రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు రాజ్యాంగ రూపకల్పనలో అందించిన సహకారాన్ని మరువలేమన్నారు.
తెలుగు ప్రముఖులు టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, అల్లాడి కృష్ణ స్వామి, కల్లూరు సుబ్బారావు, కళా వెంకట రావు, ఆచార్య ఎన్‌జీ రంగా, మొసలికంటి తిరుమల రావు, రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు, మోటూరి సత్యనారాయణ, దుర్గాబాయి దేశ్‌ ముఖ్, నీలం సంజీవ రెడ్డి, వీసీ కేశవరావుల చిత్ర పటాలతో పాటు, నాడు రాజ్యాంగ సభలో వారు చేసిన ప్రసంగాంశాలను ఈ క్యాలండర్‌లో పొందుపరచారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ శాసన వ్యవస్థ కోసం తొలిసారి ప్రవేశపెట్టిన సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా ప్రారంభించారు. ఎక్స్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ద్వారా ఇకపై ఎప్పటికప్పుడు శాసన వ్యవస్థకు సంబంధించిన సమాచారం తక్షణం అందుబాటులోకి వస్తుంది. సభా కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని చంద్రబాబు అన్నారు.
Read More
Next Story