2026లోనైనా జగన్ అసెంబ్లీ మొహం చూస్తారా, తాడేపల్లి నుంచే యుద్ధమా?
x

2026లోనైనా జగన్ అసెంబ్లీ మొహం చూస్తారా, తాడేపల్లి నుంచే 'యుద్ధమా'?

వ్యూహాత్మక మౌనమా లేక రాజకీయ మొండితనమా?


ఆంధ్రప్రదేశ్ అంతటా కొత్త సంవత్సర శోభ కనపడుతోంది. పెద్ద పండుగ సంక్రాంతికి సంపన్న గ్రామాలు సమాయత్తం అవుతున్నాయి. రాజకీయపరిస్థితులు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ 2026 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్నాయి.. "2026లోనైనా జగన్ అసెంబ్లీ మెట్లు ఎక్కుతారా?" అనే చర్చ ఊళ్లల్లో రచ్చబండలపై సాగుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలైంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ మొహం చూడడం లేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో తన సీట్లో కూర్చున్నదే లేదు. రాష్ట్రంలో ఇదో హాట్ టాపిక్కే. దీని వెనుక కేవలం ప్రతిపక్ష హోదా వివాదం మాత్రమే కాదు, లోతైన రాజకీయ వ్యూహాలు, అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న 'మైండ్ గేమ్' స్పష్టంగా కనిపిస్తోంది.
బహిష్కరణ వెనుక బలమైన కారణాలు..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతానికి పైగా ఓట్లు వచ్చినా కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సీట్లకి ప్రతిపక్ష హోదా దక్కదు. ఇచ్చేంత ఔదార్యం అధికార పక్షానికి ఉండదు. ఈ పరిస్థితుల్లో కేవలం ఒక సాధారణ సభ్యుడిగా సభలో కూర్చోవడం, అధికారపక్ష స్పీకర్ ఇచ్చే రెండుమూడు నిమిషాల సమయం సరిపోక ఆయన నేరుగా ఇంటి దగ్గరో, పార్టీ ఆఫీసులోనో మీడియా సమావేశం పెట్టుకుని గంటో, రెండు గంటలో మాట్లాడి తాను చెప్పాలనుకున్నది విడమర్చి చెప్పడమే బెటర్ అని జగన్ భావిస్తున్నారు.
మరోపక్క, సభలో అధికార పక్షం చేసే వ్యక్తిగత విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉండదు. పదేపదే మైక్ కట్ చేస్తారనే భయం ఉండనే ఉంటుంది. దీంతో సభ కంటే ప్రజా క్షేత్రమే మేలనుకుంటున్నారు జగన్.
కౌన్సిల్‌లో పోరాటం యధావిధిగా...
అసెంబ్లీని బహిష్కరించినప్పటికీ, శాసనమండలిలో (Council) ఉన్న బలాన్ని వాడుకుంటూ ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ వంటి నేతలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీలలో కొందరు జారిపోయే పరిస్థితి వచ్చినా..'ఉండేవాళ్లు ఉంటారు, పోయేవాళ్లు పోతారు' అనే ధోరణిలోనే జగన్ వైఖరి ఉంది.

ఇక, రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం 60 రోజులు గైర్హాజరైతే సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉన్నా, జగన్ దానిని ఏమాత్రం ఖాతరు చేయరు. పట్టించుకోరు. అది కేవలం సాంకేతిక వెసులుబాటు అని జగన్ కి స్పష్టత ఉంది. ఆయన నిరంతరాయంగా 60 రోజులు అసెంబ్లీకి వెళ్లకుండా లేరు. ఒకసారి ప్రమాణ స్వీకారానికి వచ్చారు. మరోసారి రాజ్యసభ ఎన్నికలపుడు వచ్చారు. కనుక అనర్హత వేటు వేయడం స్పీకర్‌కు చట్టపరంగా ఇబ్బందే అవుతుంది. గతంలో చంద్రబాబు సభలో భీష్మప్రతిజ్ఞ చేసి ఏకంగా రెండేళ్లపాటు సభకు వెళ్లకపోయినా వైసీపీ వేటు వేయలేకపోయింది. ఇప్పుడూ అదే జరుగుతుందన్నది జగన్ ధీమా అని సాక్షాత్తు టీటీడీ నేతలే చెబుతున్నారు.
ఇద్దరికీ బీజేపీ మద్దతు ఉండనే ఉంది...
ఒకవేళ ప్రభుత్వం తన సభ్యత్వాన్ని రద్దు చేస్తే, దాన్నీ ఒక ఆయుధంగా మలుచుకుని ప్రజల్లో సానుభూతి పొందే నేర్పు జగన్ కు ఉంది. అందుకే ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. పైగా అటు అధికార పార్టీకి ఇటు వైసీపీకి- ఇద్దరికీ- కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండదండలు ఉన్నాయి.
టీడీపీ వెనకడుగు వేయడానికి కారణాలు...
సభ్యత్వం రద్దు చేస్తే పులివెందులలో ఉప ఎన్నిక వస్తుంది. అక్కడ జగన్ మళ్లీ భారీ మెజారిటీతో గెలిస్తే, అది కూటమి ప్రభుత్వానికి నైతిక ఓటమి అవుతుంది.
ప్రతిపక్ష నేతను సభ నుంచి పంపించేశారనే 'అప్రజాస్వామిక' ముద్ర పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. అందుకే కేవలం "జీతాలు నిలిపివేస్తాం" అనే హెచ్చరికలకే పరిమితం అవుతోంది.
2026 వ్యూహం: తాడేపల్లి నుంచే జనంలోకి?
గతంలో మాదిరిగానే 'జనంలో ఉండటం' ద్వారానే పోయిన పట్టును తిరిగి పట్టుకోవాలన్నది జగన్ నమ్మకం. అందుకే ఆయన పదేపదే 'పైన దేవుడున్నారు, కింద ప్రజలున్నారు' అంటుంటారు. నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేయడం జగన్ ప్రాధాన్యతగా కనిపిస్తోంది.
గత కొద్ది కాలంగా జగన్ ఏ జిల్లాకు వెళ్లినా అక్కడి దృశ్యాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పరామర్శలు, పెళ్లిళ్లు పేరిట ఆయన పర్యటనలు సాగుతున్నా పోయిన ప్రతిచోటా భారీ రోడ్ షోలను తలపిస్తున్నాయి.

చాలా చోట్ల పోలీసులు పరిమిత సంఖ్యలో అనుమతులు ఇచ్చినా, జనం వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతున్నా, ప్రజలు రోడ్ల మీద వేచి చూడటం ఆయనకున్న 'మాస్ అప్పీల్'కు నిదర్శనంగా కనిపిస్తోంది.
జగన్ పర్యటనలకు వస్తున్న ఈ అనూహ్య స్పందనపై టీడీపీ, ఇతర కూటమి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. "ప్రజలను రెచ్చగొట్టడానికి, బలప్రదర్శన చేయడానికే జగన్ పర్యటిస్తున్నారు" అని మంత్రులు విమర్శిస్తున్నారంటేనే క్షేత్రస్థాయిలో ఆయన పట్ల ఆదరణ పెరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చునని వైసీపీ నాయకుడు పేర్ని నానీ అన్నారు.
ప్రజా క్షేత్రమే అసలైన సమాధానం!
జగన్ కేవలం బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్‌ల మధ్యే పరిమితమైతే 2029 నాటికి పార్టీ ఉనికి కష్టమని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే 2026లో ఆయన తన రూట్ మార్చబోతున్నారు. 2026 ద్వితీయార్ధం తర్వాత రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర లేదా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.
సూపర్ సిక్స్ వైఫల్యాలే ఆయుధాలుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎట్టగట్టడానికి ప్రజల్లోకి వెళ్లాలన్నది తన వ్యూహంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత సహచరుడొకరు చెప్పారు. తద్వార అటు తన గైర్హాజరీని ప్రశ్నిస్తున్న చెల్లెలు షర్మిలకు ఇటు టీడీపీ, జనసేన నేతలకు- ప్రజా క్షేత్రంలో బలం నిరూపించుకోవడం ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నారు.
సోషల్ మీడియా, డిజిటల్ వార్...
వైసీపీ ఎప్పుడూ సోషల్ మీడియాను ఒక బలమైన ఆయుధంగా వాడుకుంటుంది. ఇప్పుడు పార్టీ క్యాడర్‌ను డిజిటల్ వేదికలపై మరింత యాక్టివ్ చేస్తూ, ప్రభుత్వంపై 'పర్సెప్షన్ వార్' (Perception War) నడుపుతుంది. యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే అసలు మీడియా కన్నా డిజిటల్ మీడియాకే జగన్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్లనే పదేపదే కలుస్తున్నారు.

ప్రస్తుతానికి అసెంబ్లీలో అధికార పక్షం, బయట ప్రతిపక్షం.. ఎవరి దారిలో వారు పోరాడుతున్నారు. 2026లో జగన్ అసెంబ్లీకి రాకపోతే అది ఒక రికార్డు అవుతుంది. కానీ, రాజ్యాంగ వేదికను వదులుకుని కేవలం ప్రజా క్షేత్రంపైనే ఆధారపడటం ఓ సాహసమే. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే వరకు వేచి చూసే ఈ "మౌన వ్యూహం" జగన్‌కు ఎంతవరకు ఫలిస్తుందో కాలమే నిర్ణయించాలి.
Read More
Next Story