అరెస్ట్ జత్వానీ కేసు... చిక్కుకుంది ఏపీపీఎస్సీలో...
x

అరెస్ట్ జత్వానీ కేసు... చిక్కుకుంది ఏపీపీఎస్సీలో...

ఒక కేసు అధికార దుర్వినియోగం, రెండో కేసు ఆర్థిక అవకతవకలు. ఏపీలో మొదటి సారి ఓ సీనియర్ ఐపీఎస్ పై రెండు కేసులు నమోదయ్యాయి.


సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అధికారి దుర్వినియోగం, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో కూరుకు పోయారు. సీఐడీ పోలీసులు ఆయనను సినీ నటి జత్వానీ కేసులో అరెస్ట్ చేసి ఏపీపీఎస్సీ కేసులో పిటీ వారంట్ కు అనుమతి తీసుకున్నారు. ఏపీపీఎస్సీ కేసులో ఇష్టానుసారం వ్యవహరించారని, నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టటమే కాకుండా మూల్యాంకనం ఒక ప్రైవేట్ సంస్థకు ఇచ్చి ఆర్థిక నేరానికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని సీఐడీ పోలీసులు చెబుతున్నారు.

పీఎస్ఆర్ ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. 2024లో అధికార మార్పిడి తర్వాత ఆయనపై కాదంబరి జత్వానీ వేధింపు కేసు, ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాల కేసు నమోదు కావడంతో ఆయన వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ రెండు కేసులు వేర్వేరు స్వభావం కలిగినవైనప్పటికీ, ఆంజనేయులు అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రేరేపిత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతిన్నది.

అధికార దుర్వినియోగ ఆరోపణలు

తనను 2024 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని నటి కాదంబరి జత్వానీ ఆరోపించారు. తన వృద్ధ తల్లిదండ్రులను 40 రోజులకు పైగా వేధించారని ఆరోపించారు. ఈ కేసు వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు నమోదైంది. ఇందులో భూమి సంబంధిత మోసం, డాక్యుమెంట్ ఫోర్జరీకి జత్వానీ పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే జత్వానీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, తనపై కేసు రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమని, విద్యాసాగర్ తనతో వ్యక్తిగత విభేదాల కారణంగా ఈ కేసును రాజకీయంగా ఉపయోగించారని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసులో కీలక నిందితునిగా (A2) పోలీసులు చేర్చారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా జత్వానీ అరెస్టును సమన్వయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన మౌఖిక ఆదేశాలతో, ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే అరెస్టు చేయాలని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రానా టాటా, డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నిలకు సూచించారని సీఐడీ దర్యాప్తు వెల్లడించింది. దీంతో 2024 సెప్టెంబర్‌లో పిఎస్ఆర్ ఆంజనేయులు సహా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. 2025 ఏప్రిల్ 22న పిఎస్ఆర్ ను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

జత్వానీ కేసులో ఆంజనేయులు రిమాండ్ 2025 మే 7 తో ముగిసింది. దీనిని ఈ నెల 21 వరకు కోర్టు తిరిగి పొడిగించింది. టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంగా ఈ కేసును తీసుకుందని వైఎస్ఆర్‌సీపీ నాయకులు అంటున్నారు. అయితే ఆంజనేయులు అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆధారాలను సీఐడీ దర్యాప్తులో సేకరించింది.

ఆర్థిక అవకతవకల ఆరోపణలు

పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో (2018-2019) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల ఆరోపణల ప్రకారం మాన్యువల్ మూల్యాంకనం జరగకుండానే జరిగినట్లు చిత్రీకరించారని, దీని ద్వారా కోట్ల రూపాయలు అక్రమంగా సమకూరాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణల ఆధారంగా 2025 ఏప్రిల్ 29న ఆంజనేయులుపై సెక్షన్ 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 420 (మోసం) కింద కేసు నమోదైంది.

ఈ కేసులో ఆంజనేయులును అరెస్టు చేసేందుకు పోలీసులు పీటీ వారంట్ కోసం విజయవాడ మొదటి ఏజేసీజే కోర్టును ఆశ్రయించారు. కోర్టు 2025 మే 7న అనుమతించింది. మరుసటి రోజు (మే 8, 2025) న్యాయస్థానంలో ఆయనను హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆంజనేయులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన వృత్తిపరమైన ప్రతిష్టను ఈ కేసు దెబ్బతీసింది.

అధికార దుర్విని యోగమే అసలు కారణాలు

జత్వానీ కేసులో ఆయన రాజకీయ ఒత్తిడితో చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మౌఖిక ఆదేశాలతో అరెస్టు జరిగినట్లు సీఐడీ దర్యాప్తు వెల్లడించింది. ఏపీపీఎస్సీ కేసులో మూల్యాంకన అవకతవకలు జరిగాయని సీఐడీ పోలీసులు నిర్థారించారు. ఈ రెండు కేసులు ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలకు బలం చేకూర్చాయి. ఈ రెండు కేసులు చర్చకు దారి తీశాయి. జత్వానీ కేసు ఒక సినీ నటి కావటం, ఏపీపీఎస్సీ కేసు యువత ఉద్యోగ ఆకాంక్షలతో ముడిపడి ఉండటం వల్ల ప్రజల దృష్టిని ఆకర్షించాయి. 2024 సెప్టెంబర్‌లో సస్పెండ్ కావడం, 2025 ఏప్రిల్‌లో అరెస్టు, రిమాండ్ పొడిగింపు ఆంజనేయులును ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి అనే ప్రతిష్ఠను దెబ్బతీశాయి.


ఏపీపీఎస్సీ కేసులో మధు అరెస్ట్

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పేపర్లు దిద్దేందుకు ఎంపిక చేసిన ‘కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెట్టారు. ఈనెల 21 వరకు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. గతంలో డిజిటల్ పద్ధతిలో చేసిన మూల్యాంకనాన్నే తర్వాత మాన్యువల్ పద్ధతిలో చేసినట్లు చూపించి అవే మార్కులు వేశారని, పేపర్లు దిద్దకుండానే ప్రభుత్వ డబ్బును దోచుకున్నారనే నేరం కింద మధుసూదన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పిఎస్ఆర్ మొదటి నిందితుడు కాగా ఈ కేసులో రెండో నిందితునిగా మధు అరెస్ట్ అయ్యారు. ఈ సంస్థకు మూల్యాంకనం కోసం రూ. 1.14 కోట్లు ఇవ్వగా ఇందులో రూ. 66 లక్షలు అవినీతి జరిగిందని సీఐడీ వారు నిర్థారించారు.

Read More
Next Story