లోకేష్‌ రెడ్‌ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా
x

లోకేష్‌ రెడ్‌ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా

గిరిజనులకు న్యాయం చేయరా.. గిరిజనులు కేవలం ఓట్లకే పనికొస్తారా అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.


మంత్రి నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రశ్నించారు. గురువారం విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగురాలైన తాను ఎనిమిది ఏళ్లుగా తనకు న్యాయం చేయాలని కోరుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్ల మైనర్‌ బాలిక అయిన తన కూతురు సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేస్తే ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మొదట సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారని కానీ కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి అయినా సుగాలి ప్రీతి కేసును పట్టించుకోలేదని పార్వత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఎన్నికల్లో ఓట్లకే పనికొస్తారా వారికి న్యాయం చేయరా అని ఆమె ప్రశ్నించారు. హోం మంత్రి అనిత దృష్టికి కూడా సుగాలి ప్రీతి కేసును తీసుకెళ్లానని, ఆమె కూడా న్యాయం చేయలేదన్నారు. జైల్లో ఖైదీగా ఉన్న శ్రీకాంత్‌కు పెరోల్‌ మంజూరు విషయంలో మంత్రి అనిత బిజీ ఉన్నారని, మరి సుగాలి ప్రీతి కేసును పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎందుకు తన కుమార్తె ప్రీతి కేసుపై ఇంత నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సెప్టెంబరులో జరిగే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో సుగాలి ప్రీతి కేసు మీద చర్చించాలని ఆమె డిమాండ్‌ చేశారు. చర్చించి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సీబీఐకి సుగాలి ప్రీతి కేసును అప్పగించాలని కోరారు. లేదంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయినా ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కోరారు. హంతకులను గుర్తించి వారిని శిక్షించాలని కోరారు. డ్రైవర్‌ హత్య చేసి డోర్‌డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ప్రత్యేక శ్రద్ద తీసుకొని, బాధితుల ఇంటికెళ్లి పరామర్శించిన హోం మంత్రి అనితకు అతికిరాతంగా అత్యాచారానికి గురై చంపబడిన తన కుమార్తె కేసు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసులో తమకు న్యాయం చేయాలని అలా జరగని పక్షంలో గవర్నర్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాలను, అక్రమాల గురించి తమ గోడును తెలియజెప్పుకుంటామని పార్వతి వెల్లడించారు. దాని కంటే ముందు సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ క్యాంపెయిన్‌ కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. తమకు న్యాయం జరక్కపోతే నిరాహార దీక్ష కూడా చేపడుతామన్నారు. ఎనిమిదేళ్లుగా ఓ దివ్యాంగురాలైన తాను తన కుమార్తె కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చదువుకోవడానికి పాఠశాలకు పంపిన మైనర్‌ బాలిక సుగాలి ప్రీతిని అన్యాయంగా చంపేసిన నిందితుల మీద ప్రభుత్వానికి ఎందుకు అంత ప్రేమ అని ఆమె ప్రశ్నించారు. ఈ కేసులో న్యాయం జరిగేంత వరకు తన పోరాటం ఆగదన్నారు.
Read More
Next Story