Fear started in KTR|కేటీఆర్ లో భయం మొదలైందా ?
x

Fear started in KTR|కేటీఆర్ లో భయం మొదలైందా ?

ఎప్పుడైతే తన కేసును హైకోర్టు కొట్టేసిందో అప్పటినుండే కేటీఆర్ లో టెన్షన్ పెరిగిపోతోంది.


దర్యాప్తుసంస్ధలు కేటీఆర్ ను వెంటాడుతున్నాయి. విచారణకు కోర్టుపరంగా అడ్డంకులు తొలగిపోవటంతో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఏసీబీలు కేటీఆర్ ను విచారించేందుకు మరో తేదీని నిర్ణయించాయి. ఏసీబీ(ACB) ముందుకు 9వ తేదీన హాజరుకావాల్సిన కేటీఆర్, ఈడీముందుకు ఈనెల 16వ తేదీన హాజరుకావాల్సుంది. నిజానికి ఏసీబీ ముందుకు 6వ తేదీ, ఈడీ(ED) విచారణకు 7వ తేదీన కేటీఆర్ హాజరవ్వాలి. అయితే హైకోర్టులో(Telangana Highcourt) తాను దాఖలుచేసిన క్వాష్ పిటీషన్ను కారణంగా చూపుతూ ఈడీ విచారణను కేటీఆర్ ఎగొట్టారు. అలాగే 6వ తేదీన ఏసీబీ విచారణకు హాజరైనట్లే హాజరైన కేటీఆర్(KTR) తనతో పాటు లాయర్ ను అనుమతించలేదన్న కారణాన్ని చూపి తిరిగి వెళిపోయారు. అదేమిటంటే హైకోర్టు తీర్పు నేపధ్యంలో తనను వేధించటానికే ఏసీబీ విచారణకు పిలిపించిందని మండిపోయారు. అలాగే పోలీసుల మీద తనకు నమ్మకంలేదు కాబట్టి విచారణలో తనతో పాటు తన లాయర్ కూడా ఉండాల్సిందే అని అడ్డదిడ్డమైన వాదన వినిపించి రోడ్డుమీదే దాదాపు అర్ధగంటపాటు హైడ్రామా నడిపి తిరిగి పార్టీ ఆఫీసుకు వెళ్ళిపోయారు.

విచారణకు హాజరవ్వటానికి కోర్టులో విచారణకు ఎలాంటి సంబంధంలేదు. తనపైన ఏసీబీ నమోదుచేసిన కేసును కొట్టేయాలని కేటీఆర్ కోర్టులో కేసువేశారు. కేసును విచారించిన కోర్టు డిసెంబర్ 31వ తేదీవరకు అరెస్టు చేయద్దని చెప్పింది. ఇదేసమయంలో కేసును విచారించుకోవచ్చని ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేటీఆర్ మాత్రం బుధవారం కోర్టుతీర్పు వచ్చేముందే తనను ఏసీబీ విచారించాల్సిన అవసరం ఏమొచ్చిందంటు మంగళవారం పిచ్చిలాజిక్ వినిపించారు. కేసు కోర్టు విచారణలో ఉండగా తనను విచారించేందుకు ఏసీబీ ఎందుకింత తొందరపడుతోందని అడ్డదిడ్డమైన వ్యాఖ్యలుచేశారు. కోర్టులో కేసు విచారణకు, ఏసీబీ విచారణకు ఎలాంటి సంబంధంలేదు. కేసు విచారించుకోమని చెప్పిన హైకోర్టు తాను చెప్పేంతవరకు అరెస్టు చేయద్దని మాత్రమే ఏసీబీని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉన్నా కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి(Revanth), ఏసీబీపై నోటికొచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. అయితే బుధవారం ఇచ్చిన తీర్పులో కేటీఆర్ దాఖలుచేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. ఎప్పుడైతే తన కేసును హైకోర్టు కొట్టేసిందో అప్పటినుండే కేటీఆర్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏసీబీ తనను ఎప్పుడైనా అరెస్టు చేయచ్చని నేతలు, క్యాడర్ కు సమాచారం పంపించారు. దాంతో రాష్ట్రంలోని అనేకప్రాంతాలనుండి నేతలు, క్యాడర్ కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్నారు. కోర్టు తీర్పుతో సంబంధంలేకుండానే ఈనెల 9వ తేదీన విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ రెండోసారి నోటీసులు జారీచేసింది. అలాగే ఈనెల 16వ తేదీన విచారణకు హాజరవ్వాలని ఈడీ కూడా తాజాగా నోటీసులు ఇచ్చింది. దాంతో కేటీఆర్ విచారణకు దర్యాప్తుసంస్ధలు ఏసీబీ, ఈడీలు పోటీపడుతున్నట్లుగా ఉంది.

విచారణకు పిలిపిన దర్యాప్తుసంస్ధలు కేవలం విచారించి వదిలేస్తాయా లేకపోతే అరెస్టు కూడా చేస్తాయా ? అన్న టెన్షన్ బీఆర్ఎస్ వర్గాల్లో పెరిగిపోతోంది. మొన్నటివరకు ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race) కేసును లొట్టిపీసు కేసని ఎద్దేవాచేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు తన కేసును కొట్టేసిన తర్వాత కేటీఆర్ మాటల్లో భయం స్పష్టంగా కనబడుతోంది. అందులోను గ్రీన్ కో కంపెనీ(GreenKo Company) నుండి ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds) రూపంలో బీఆర్ఎస్ రు. 41 కోట్లు అందుకుందన్న విషయం ఆధారాలతో సహా బయటపడగానే కేటీఆర్ తో పాటు మొత్తం పార్టీ శ్రేణులు ఆత్మరక్షణలో పడిపోయాయి. విచిత్రం ఏమిటంటే గ్రీన్ కో కంపెనీ నుండి బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లను అందుకోలేదని చెప్పకుండా అదే కంపెనీ నుండి కాంగ్రెస్, బీజేపీలు కూడా ఎలక్టోరల్ బాండ్లు అందుకున్నాయని ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎలక్టోరల్ బాండ్లు అందుకోవటానికి, అధికారంలో ఉన్న పార్టీ ఎలక్టోరల్ బాండ్లు అందుకోవటానికి చాలా తేడా ఉంటుందన్న విషయాన్ని కేటీఆర్ కన్వీనియంట్ గా వదిలేశారు.

Read More
Next Story