
పవన్ కల్యాణ్ పర్యటనలు పార్టీ పట్టు పెంచేందుకేనా?
రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యవహారం తెలుగుదేశం పార్టీని అతలాకుతలం చేస్తోంది. మరో వైపు గిరిజన గురుకులంలో ఇద్దరు బాలికలు మృతి, శిశుగృహలో బాలుడు మృతి నేపథ్యంలో...
జనసేన పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో అధినేత కె. పవన్ కల్యాణ్ త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేపట్టనున్నారు. పర్యటన షెడ్యూల్ త్వరలోనే ఖరారవుతుంది. మొదటిగా పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఎస్టీ గురుకుల పాఠశాలలో జరిగిన దుర్ఘటన వివరాలు పవన్ కల్యాణ్ తెలుసుకుంటారు. 200 మంది నివాసం ఉంటున్న గురుకులంలో సుమారు 150 మంది విద్యార్థినులు కామెర్ల వ్యాధి భారినపడి అస్వస్థతకు గురై, ఇద్దరు మరణించారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ లో 50 మంది, మరి కొందరు పార్వతీపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కొందరిని తల్లిదండ్రులు ఇండ్లకు తీసుకెళ్లారు.
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పవన్ కల్యాణ్ అక్కడికి వెళ్లి పరిస్థితులు తెలుసుకుని, స్థానికులతో మాట్లాడతారు. తర్వాతి రోజు నుంచి పిఠాపురం నియోజకవర్గంలో, ఆ తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలు అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కలిపి నిర్వహిస్తారు. జనసేనను బలోపేతం చేయడమే కాకుండా, టీడీపీ పాలిటిక్స్‌పై అసంతృప్తి, కల్తీ మద్యం వంటి సున్నిత అంశాలపై పవన్ మాట్లాడే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి.
కురుపాం గురుకులానికి పవన్ ఎందుకు వెళుతున్నారు?
పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఎస్టీ గురుకుల పాఠశాలలో ఇటీవల జరిగిన సంఘటన, రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల సంక్షేమం, విద్యా వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది. 150 మంది విద్యార్థినులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. కలుషిత నీరు కారణంగా అస్వస్థతకు గురై, ఇద్దరు మరణించడటం కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. పవన్ కల్యాణ్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి, మొదటిగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించడం, జనసేన పార్టీని సామాజిక సమస్యలపై సున్నితంగా చూపించే వ్యూహంగా కనిపిస్తుంది. అక్కడి పరిస్థితులు తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడతారా? లేదా కేవలం సానుభూతి చూపుతారా? అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. విశ్లేషకులు అంచనా వేస్తున్నది ఏమిటంటే... పవన్ ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని శిశు సంరక్షణ లోపాలను, గిరిజన బాలికలకు విద్యా సౌకర్యాల విషయంలో చోటుచేసుకున్న లోపాలను హైలెట్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఇది జనసేనకు మరింత మద్దతును చేకూర్చవచ్చు.
పిఠాపురం, ప్రకాశం, నెల్లూరు, రాజోలు పర్యటనలు
పర్యటనలు మొదటి దశలో పిఠాపురం నియోజకవర్గంతో ప్రారంభమవుతాయి. ఇక్కడ పవన్ MLAగా ఉన్నారు. కొన్ని రోజులు అక్కడ ఉండి, స్థానిక సమస్యలు పరిశీలిస్తారు. తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలు అధికారిక కార్యక్రమాల తరువాత పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. జనసేన నాయకులు TDP తీరుపై అసంతృప్తిని పవన్ ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇది జనసేన-TDP అలయన్స్‌లోని టెన్షన్‌లను సూచిస్తుంది. పవన్ ఈ అవకాశాన్ని పార్టీని బలోపేతం చేయడానికి, TDPపై మృదువైన విమర్శలు చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 2029 ఎన్నికల ముందు జనసేనకు స్వతంత్ర గుర్తింపును తెచ్చుకోవడానికి ముఖ్యమైన అడుగుగా కనిపిస్తోంది.
కూటమిలో తన ప్రాధాన్యతను పెంచేందుకు ఏడాది క్రితం పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల మధ్య మాట్లాడుతూ తన కుమార్తెలపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వచ్చిన పోస్టులపై స్పందించి నేను హోం మంత్రి స్థానంలో ఉంటే ఈ పోస్టులు పెట్టిన వారిని తాట తీసే వాడనని అన్నారు. హోంమంత్రి అనిత పనితీరును పరోక్షంగా విమర్శించారు. ఆ తరువాత టీడీపీలోని పెద్దలు అడుగు ముందుకు వేసి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టడం మొదలు పెట్టారు.
అలాగే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, గిరిజన సంక్షేమ శాఖ తమ తప్పిదాలను సరిదిద్దుకునే విధంగా ఏవైనా వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అది జరగకుంటే గిరిజనుల్లో జనసేన పార్టీ పట్టుతప్పే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి గిరిజనుల్లో మంచి ఓటింగ్ ఉందని రుజువు అయింది. అందువల్లే పవన్ కల్యాణ్ ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించే కార్యక్రమాన్ని చేపట్టారు. పైగా కొండలపైకి నడుచుకుంటూ వెళ్లారు. గిరిజన దేవతలకు పూజలు చేశారు. ప్రతి గూడేనికి రోడ్లు సౌకర్యం కల్పిస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. త్వరలో జరగబోయే పర్యటన కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు.
అక్టోబర్ 9న పిఠాపురం నియోజక వర్గంలో పర్యటన
ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ ప్రాంతం పరిశీలించేందుకు సముద్రంలో ప్రయాణించనున్నారు. ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత పిఠాపురం నియోజక వర్గంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.
కల్తీ మద్యం పై పర్యటనలో మాట్లాడతారా?
కల్తీ మద్యం వ్యవహారం రాష్ట్రంలో ఇటీవల బట్టబయలైన ఈ కుంభకోణం. ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఈ అంశంపై మాట్లాడలేదు. కానీ ఈ పర్యటనలో పవన్ మాట్లాడే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పవన్ మౌనం TDPతో అలయన్స్‌ను కాపాడుకోవడానికి ఉద్దేశించినది కావచ్చు. కానీ పర్యటనలు జనసేనను సామాజిక సమస్యలపై గట్టిగా నిలబెట్టడానికి ఉపయోగపడతాయి. కల్తీ మద్యం విషయంలో మాట్లాడితే, అది TDPపై ఒత్తిడి పెంచుతుంది. ఇది అలయన్స్‌లో టెన్షన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. పవన్ ఈ అవకాశాన్ని TDP విమర్శలకు ఉపయోగపడేలా చేస్తారా? లేదా మౌనాన్ని కొనసాగిస్తారా? ఈ పర్యటనలు జనసేనకు రాజకీయ దిశను నిర్ణయిస్తాయా? అనేది త్వరలోనే వెల్లడవుతుంది.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు
పవన్ పర్యటనలు కూటమి ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించడానికి, పార్టీని బలోపేతం చేయడానికి రూపొందిస్తున్నారు. గిరిజన, శిశు సంక్షేమం, విద్యా వ్యవస్థలు వంటి అంశాలపై దృష్టి సారించడం, పవన్‌ను సామాజిక నాయకుడిగా చూపించడానికి సహాయపడుతుంది. అయితే TDP తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తే, అలయన్స్‌లో చీలికలు వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనలు 2029 ఎన్నికల ముందు జనసేనకు మద్దతును పెంచడానికి, TDPపై మృదువైన ఒత్తిడి తీసుకురావడానికి ముఖ్యమైనవి. ప్రభుత్వం ఈ పర్యటనలను జాగ్రత్తలతో పరిగణిస్తుంది, ఎందుకంటే పవన్ మాటలు TDP ఇమేజ్‌ను ప్రభావితం చేయవచ్చు. మొత్తంగా ఈ పర్యటనలు జనసేనను రాజకీయంగా బలోపేతం చేస్తాయా? లేదా TDPలో టెన్షన్‌లను పెంచుతాయా? కాలమే చెప్పాలి.