కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయా ?
x

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయా ?

తెలంగాణలోని ప్రధానపార్టీల అగ్రనేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు విన్నతర్వాత మూడుపార్టీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలే చేస్తున్నాయా అన్న సందేహం జనాల్లో పెరిగిపోతున్నాయి


తెలంగాణలోని మూడు ప్రధానపార్టీల అగ్రనేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు విన్నతర్వాత మూడుపార్టీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలే చేస్తున్నాయా అన్న సందేహం జనాల్లో పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన పద్నాలుగు మాసాలుగా టెలిఫోన్ ట్యాపింగ్(Telephone tapping) విచారణ సా...........గుతునే ఉన్నది. ఇప్పటి పరిస్ధితులను గమనిస్తే అసలు విచారణ పూర్తవుతుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ట్యాపింగ్ లో పాల్గొన్న పోలీసు అధికారులందరు అరెస్టయినా వీరికి ఆదేశాలిచ్చిన కీలకపాత్రదారులిద్దరు హైదరాబాద్ నుండి పారిపోయి అమెరికాలో దాక్కున్నారు. దాంతో కీలకపాత్రదారులు దొరికి విచారణచేస్తే కాని ట్యాపింగ్ అసలు సూత్రదారులు ఎవరో బయటపడదు.

సూత్రదారులు ఎవరో తేలాలంటే ముందు కీలకపాత్రదారులు దొరకాలి. కీలకపాత్రదారులను పట్టుకునేందుకు రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా అడుగు కూడా ముందుకుపడటంలేదు. ఇక్కడే మూడుపార్టీలు ఒకదాన్ని మరొకటి నిందించుకుంటున్నాయి, ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా(America)కు పారిపోయిన మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టీ ప్రభాకరరావు, ఒక మీడియా అధినేత శ్రవణ్ కుమార్ ను హైదరాబాదుకు రప్పించేందుకు రేవంత్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడగానే ట్యాపింగ్ అంశంపై విచారణ మొదలైంది. కేసీఆర్ హయాంలో యధేచ్చగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వంలో అయినా ట్యాపింగ్ అన్నది సాధారణమే. అయితే కేసీఆర్(KCR) హయాంలో మాత్రం వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు బయటపడటం సంచలనంగా మారింది.

అసాంఘీక శక్తుల, ప్రభుత్వ వ్యతిరేక శక్తుల ఆచూకీని తెలుసుకోవటమే ఉద్దేశ్యంగా జరగాల్సిన టెలిఫోన్ ట్యాపింగ్ ను కేసీఆర్ తన రాజకీయప్రత్యర్ధులను ఇబ్బందులకు గురిచేయటం కోసం ఉపయోగించుకున్నారు. ట్యాపింగులో కీలకంగా పనిచేసిన నలుగురు పోలీసు అధికారులు తిరుపతయ్య, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావుతో పాటు మరికొందరిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) అరెస్టుచేసింది. విచారణలో తాము చేసిన ట్యాపింగ్ మొత్తాన్ని పై నలుగురు అధికారులు పూసగుచ్చినట్లు వివరించారు. ఎవరెవరి ఫోన్లను, ఎందుకోసం ట్యాపింగ్ చేశామనే విషయాన్ని కూడా వీళ్ళు అంగీకరించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు ఆదేశాల ప్రకారమే తాము ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు రాతపూర్వకంగా అఫిడవిట్లు కూడా దాఖలుచేశారు. బీఆర్ఎస్ ప్రత్యర్ధుల్లో ఎవరెవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టామన్న వివరాలను కూడా వివరించారు.

ట్యాపింగులో ఎప్పుడైతే మొదటి అరెస్టు జరిగిందో మరుసటి రోజే అంటే 2024, మార్చ్ 12వ తేదీన ప్రభాకరరావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోయారు. అప్పటినుండి పై ఇద్దరు అమెరికాలోనే హ్యాపీగా గడిపేస్తున్నారు. ఇండియాకు వస్తే తమ పరిస్ధితి ఏమిటో పై ఇద్దరికీ బాగా తెలుసు. అందుకనే తాము అమెరికాలోనే ఉండిపోయేట్లుగా, తమను ఇండియాకు అప్పగించేందుకు వీల్లేనట్లుగా వాళ్ళ ప్రయత్నాలేవో వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకవైపు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటుండగా అమెరికాలో వాళ్ళని కాపాడుతున్నది బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్(KTR) అని రేవంత్, మంత్రులు ఆరోపిస్తున్నారు. అమెరికానుండి ఇద్దరినీ ఇండియాకు రప్పించటంలోను, కేసీఆర్ ను అరెస్టుచేయటంలో కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు కేంద్రమంత్రులు బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి(kishan Reddy) పదేపదే రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు.

వీళ్ళ ఆరోపణలకు రేవంత్ ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో సమాధానమిచ్చాడు. ప్రభాకరరావు, శ్రవణ్ ను ఇండియాకు రప్పించటంలో సాయంచేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖలు రాసినా బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవటంలేదని రేవంత్ మండిపోయాడు. కేసీఆర్(KCR) తో ఉన్న చీకటి ఒప్పందం కారణంగానే ట్యాపింగ్ లో కీలకపాత్రదారులిద్దరినీ కేంద్రమంత్రులు కాపాడుతున్నారంటు రేవంత్ ఆరోపణలతో రెచ్చిపోయాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ట్యాపింగులో కీలక సూత్రదారి కేసీఆరే అన్న విషయాన్ని రేవంత్, మంత్రులు ఇప్పటికే చాలాసార్లు ఆరోపించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్, కేటీఆర్ ను అరెస్టుచేసేందుకు లేదు. తమహయాంలో ట్యాపింగ్ జరిగినట్లు కేటీఆర్ కూడా అంగీకరించారు. అంతమాత్రాన కేసీఆర్, కేటీఆర్ ను అరెస్టుచేయటం సాధ్యంకాదు. కిందస్ధాయి పోలీసు అధికారులతో ట్యాపింగ్ చేయించింది ప్రభాకరరావే అన్న విషయం బయటపడింది. ట్యాపింగ్ చేయమని తనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అన్న విషయాన్ని చెప్పాల్సింది ప్రభాకరరావే. ప్రభాకరరావు ఎవరిపేరును చెబితే సిట్ అధికారులు వాళ్ళపై కేసునమోదు చేసి అరెస్టుచేస్తారు. తర్వాత ఈ విషయం కోర్టులో నిరూపితమవ్వటం అన్నది మరో ఘట్టం.

ట్యాపింగ్ సూత్రధారి అన్న ఆరోపణతో కేసీఆర్ లేదా కేటీఆర్ ను అరెస్టుచేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఆ ముక్క చెప్పాల్సింది కీలక పాత్రధారి ప్రభాకరరావు మాత్రమే. ఆయన దొరికి, విచారణలో నోరిప్పేంతవరకు దర్యాప్తు ముందుకుజరగదు. ఈ విషయం కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డికి బాగా తెలుసు. ప్రభాకరరావును ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా కేంద్రమంత్రులకు బాగా తెలుసు. అయినా సరే పదేపదే రేవంత్ ను టార్గెట్ చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ(CBI)కి అప్పగిస్తే అప్పుడు కేసు ఎలాముందుకు వెళ్ళదో చూస్తానని కిషన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. అమెరికాలో ఉన్న కీలకపాత్రదారుడిని ఇండియాకు రప్పించమని రేవంత్ ప్రభుత్వం రెండులేఖలు కేంద్రహోంశాఖకు పంపింది. ఈ రెండు లేఖల ఫాలోఅప్ ఏమైందో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి, కిషన్ రెడ్డి చెప్పటంలేదు. తమప్రభుత్వం లేఖలు రాసినా కేంద్రం ఎందుకు పట్టించుకోవటంలేదని రేవంత్ పదేపదే కేంద్రమంత్రులిద్దరినీ టార్గెట్ చేస్తున్నారు.

తమ లేఖలను కేంద్రం పట్టించుకోకపోవటానికి కేసీఆర్ తో బీజేపీకి కుదిరిన చీకటి ఒప్పందమే కారణమని రేవంత్, మంత్రులు ఆరోపిస్తున్నారు. రేవంత్ ఆరోపణల్లో కొంత లాజిక్ కనబడుతోంది. ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించేందుకే బీఆర్ఎస్ పోటీచేయటంలేదన్న రేవంత్ ఆరోపణలు ఆలోచించాల్సిందే. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో బలంగా ఉన్నాకూడా బీఆర్ఎస్ ఎందుకు పోటీచేయటంలేదో సమాధానం చెప్పలేదు ఇంతవరకు. ట్యాపింగ్ విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించమని కేంద్రమంత్రులు అడగటాన్ని కూడా రేవంత్ తప్పుపడుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో సీఐడీ కేటీఆర్ మీద కేసులు నమోదుచేయగానే మధ్యలో ఈడీ దూరి మొత్తం ఫైళ్ళన్నింటినీ ఎందుకు తీసుకెళ్ళిందని రేవంత్ ప్రశ్నిస్తున్నాడు. కేటీఆర్ ను రక్షించే ఉద్దేశ్యంతోనే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫార్ములా ఫైళ్ళను తీసుకెళ్ళినట్లు రేవంత్ ఆరోపిస్తున్నాడు.

ఇదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడుతున్నా కేంద్రప్రభుత్వం ఎందుకు రేవంత్ మీద యాక్షన్ తీసుకోవటంలేదని కేటీఆర్, హరీష్ పదేపదే కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం అవినీతికి తాను కేంద్రానికి సాక్ష్యాలు కూడా ఇచ్చానని కేటీఆర్ చెబుతున్నారు. నిజంగానే రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ ఇచ్చిన సాక్ష్యాలు విలువైనవే అయితే ఇంతకాలం యాక్షన్ తీసుకోకుండానే కేంద్రం ఉంటుందా ? నాన్ బీజేపీ ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా నరేంద్రమోడీ ప్రభుత్వం పావులు కదుపుతున్న విషయం అందిరికీ తెలిసిందే. అలాంటిది రేవంత్ ప్రభుత్వాన్ని మోడి ప్రభుత్వం వదిలిపెడుతుందా ? మొత్తంమీద ముగ్గురు అగ్రనేతలు ఒకళ్ళపై మరొకళ్ళు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు చూసిన తర్వాత మూడుపార్టీలూ కుమ్మక్కు రాజకీయాలే చేస్తున్నాయా లేకపోతే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయా అనే సందేహాలు జనాల్లో పెరిగిపోతే అది వాళ్ళ తప్పు ఎంతమాత్రం కాదు.

Read More
Next Story