బీజేపీ ఎంపీలు టార్గెట్ అవబోతున్నారా ?
x

బీజేపీ ఎంపీలు టార్గెట్ అవబోతున్నారా ?

అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణా విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే.


తొందరలోనే బీజేపీ ఎంపీలందరు టార్గెట్ అవబోతున్నారా ? అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణా విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే. తెలంగాణా అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్దగా పట్టించుకోవటంలేదని కాంగ్రెస్ పార్టీకి బాగా మంటగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగు ప్రాజెక్టులను పక్కనపెట్టినా పోయిన నెలలో భారీవర్షాల కారణంగా తెలంగాణాలోని చాలా ప్రాంతాలు భారీగా నష్టపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, ప్రాణ నష్టం, పంటల నష్టాలన్నింటినీ లెక్కకట్టి రాష్ట్రప్రభుత్వం రు. 10,320 కోట్ల నష్టం జరిగిందని రిపోర్టు పంపింది. జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా భావించి సాయంచేయటంలో ఉదారంగా వ్యవహరించాలని రేవంత్ నరేంద్రమోడిని చాలాసార్లు విన్నవించుకున్నారు. అయితే కేంద్రంనుండి తెలంగాణాకు అన్నీరకాల నష్టపరిహారాల కింద అందిన మొత్తం కేవలం రు. 416 కోట్లు మాత్రమే.

రిపోర్టు ప్రకారం జరిగిన నష్టం రు. 10,320 కోట్లయితే అందిన సాయం మాత్రం రు. 416 కోట్లు. దీంతోనే తెలంగాణా విషయంలో కేంద్రప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోందో అందరికీ అర్ధమైంది. ఇదే విషయాన్ని తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా లేవనెత్తాలని రేవంత్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈలోగా ఎక్కడైనా బహిరంగసభ జరిగినపుడు కూడా తెలంగాణా విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న విధానాన్ని ప్రస్తావించాలని అనుకుంటున్నారు. ఇదే విషయం గనుక రేవంత్ లేవనెత్తితే సమాధానం చెప్పటానికి బీజేపీ ఎంపీల దగ్గర సమాధానం లేదన్నది వాస్తవం. తెలంగాణాలో బీజేపీకి 8మంది ఎంపీలున్నారు. అందులో ఇద్దరు గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రులుగా ఉన్నారు. వీరిలో కూడా కిషన్ క్యాబినెట్ మంత్రి.

బీజేపీ నుండి 8 మంది ఎంపీలున్నప్పటికీ తెలంగాణాకు జరిగిన లాభం ఏమిటనే చర్చను రాష్ట్రవ్యాప్తంగా జరిగేట్లు చూడాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతోంది. జరిగిన నష్టాలపై కేంద్రబృందాలు తెలంగాణాలో పర్యటించినపుడు ఇద్దరు కేంద్రమంత్రులు పరిశీలన బృందాలతోనే ఉన్నారు. జరిగిన నష్టాలపై అంచనాలు వేసేటపుడు కూడా కేంద్రమంత్రులతో బృందాల్లోని సభ్యులు చర్చించారని సమాచారం. ఇంత జరిగినా తెలంగాణాకు కేంద్రం ఇచ్చింది మాత్రం రు. 416 కోట్లే. కేంద్రం ఇచ్చిన మొత్తం నిజానికి ఏ శాఖకు కూడా సరిపోదు. సాయం చేయటంలో బీజేపీ పాలితరాష్ట్రాల విషయంలో కేంద్రం ఒకలాగ వ్యవహరిస్తు, బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల విషయంలో మాత్రం మరోలాగ వ్యవహరిస్తోందనే ఆరోపణలు చాలాకాలంగా వినబడుతున్నాయి.

వరద నష్టాల సాయాన్నే తీసుకుంటే ఏపీలో, తెలంగాణాలో ఇంచుమించు తుపాను దెబ్బకు ఒకే విధంగా నష్టాలు సంభించాయి. ఏపీకి మాత్రం రు. 1032 కోట్లు విడుదలచేసిన కేంద్రప్రభుత్వం తెలంగాణాకు మాత్రం రు. 416 కోట్లనే విడుదలచేసింది. జరిగిన నష్టానికి కేంద్రంచేసిన సాయానికి ఏమాత్రం పొంతన లేదని తెలుస్తున్నా కేంద్రమంత్రులు ఇద్దరు ఈ విషయంలో నోరిప్పటంలేదు. కేంద్రమంత్రులే నోరిప్పనపుడు ఇక మిగిలిన ఎంపీలు మాత్రం ఏమి మాట్లాడుతారు ? అందుకనే ఈ విషయంపై బీజేపీ ఎంపీలు ఎక్కడా మాట్లాడటంలేదు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను వివరించి తెలంగాణాక వీలైనంత ఎక్కువసాయాన్ని రాబట్టాల్సిన కేంద్రమంత్రులు, ఎంపీలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాలనే ప్రస్తావించి ఇద్దరు కేంద్రమంత్రులతో పాటు మిగిలిన ఎంపీలను ఇరుకునపెట్టాలని కాంగ్రెస్ గట్టి వ్యూహంతో ఉంది.

రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఇదే విషయాన్ని గట్టిగా నిలదీస్తే ధీటుగా సమాధానం చెప్పలేని పరిస్ధితుల్లో బీజేపీ ఎంపీలున్నారన్నది వాస్తవం. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, హైడ్రా యాక్షన్ పై నానా గోలచేస్తున్న కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలను కట్టడిచేయటానికి కేంద్రం ఇచ్చిన తుపాను సాయం నిధులను వీలైనంతగా ప్రస్తావించాలని రేవంత్ ఇప్పటికే డిసైడ్ అయ్యారని పార్టీవర్గాల సమాచారం. ఆ పరిస్ధితే వస్తే కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read More
Next Story