‘మిట్టల్ స్టీల్ కు ప్రభుత్వం సేకరించిన భూములు ఇవ్వకూడదు’
x

‘మిట్టల్ స్టీల్ కు ప్రభుత్వం సేకరించిన భూములు ఇవ్వకూడదు’

ప్రజా ప్రయోజనం" అంటే, సేకరించిన భూమిని కేవలం ప్రభుత్వ రంగ సంస్థల కోసం మాత్రమే ఉపయోగించడం, ప్రైవేట్ సంస్థలకు, బదలాయించడం చట్టవిరుద్ధం.


ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర, స్టీల్ కర్మాగారాన్ని, తీరప్రాంతంలో పోర్ట్ నిర్మించడం కోసం ‘ప్రజాప్రయోజనం’ అంటూ, APIIC సేకరించిన 2,000 ఎకరాలకు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్సెలర్ మిట్టల్ ప్రైవేట్ కంపెనీకి బదలాయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఇది చట్ట విరుద్ధమని మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ ఇఎ ఎస్ శర్మ పేర్కొన్నారు. ఈ భూములు ఎందుకు చట్ట విరుద్ధమో చెబుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు ఒక లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.


సమాచార హక్కుల చట్టం క్రింద సేకరించబడిన వివరాల ప్రకారం, APIIC కోసం 2010 జూలైలో ప్రభుత్వం, నక్కపల్లి మండలం లో 2,338 ఎకరాల జిరాయితీ భూమిని, 724 ఎకరాల ప్రభుత్వ భూమిని, 753 ఎకరాల డీ పట్టా భూమిని, 58 ఎకరాలు సాగులో ఉన్న ఇతర ప్రభుత్వ భూమిని కూడా, ప్రభుత్వం APIIC కి బదలాయించే నిర్ణయం తీసుకుంది.

1894 భూ సేకరణ చట్టంలో, 3వ సెక్షన్ లో, సబ్ సెక్షన్ (f) క్రింద "ప్రజా ప్రయోజనం" అర్ధం, ఈ క్రింది విధంగా నిర్వచించబడింది.

S3[(f) the expression “public purpose” includes-

(iv) the provision of land for a corporation owned or controlled by the State;

ఆ సెక్షన్ క్రింద, "ప్రజా ప్రయోజనం" అంటే, సేకరించిన భూమిని కేవలం ప్రభుత్వ రంగ సంస్థల కోసం మాత్రమే ఉపయోగించాలి. ప్రైవేట్ సంస్థలకు, సేకరించిన భూమిని బదలాయించడం చట్టవిరుద్ధం.

అప్పటి ప్రభుత్వం, భూముల యజమానులకు, తమ భూములను "ప్రజా ప్రయోజనం", అంటే, ప్రభుత్వ రంగ సంస్థల కోసం మాత్రమే సేకరిస్తున్నామని తెలియపరచి, 1894 చట్టం క్రింద ప్రక్రియ చేపట్టింది. అటువంటి భూములను, ప్రైవేట్ కంపెనీ అయిన ఆర్సెలర్ మిట్టల్ కు బదలాయించడం, ఆ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ఆ భూములను కోల్పోయిన వారికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది. అటువంటి భూమి బదలాయింపు చెల్లదు.

అదే కాకుండా, నాకు తెలిసిన సమాచారం ప్రకారం, APIIC కోసం ఆ భూములను ప్రభుత్వం సేకరించినా, ఆ భూములు ఈరోజు వరకు, యజమానులు కాని, కౌలుదారులు కాని, ఇతరులు కాని సాగుచేస్తున్నారు. అంటే, రికార్డులలో APIIC పేరు ఉన్నా, ఆ భూములు ఇంకా అసలు యజమానులు, ఇతరులు, ముఖ్యంగా చిన్నకారు రైతుల సాగులో ఉన్నాయి. ఆ భూముల మీద ఉన్న చెట్లకు, బావులకు ప్రభుత్వం ఈ రోజు వరకు నష్ట పరిహారం పూర్తిగా ఇవ్వలేదు. అంటే, ఈ రోజు వరకు భూసేకరణ ప్రక్రియ పూర్తికాలేదు. ఆ కారణంగా కూడా, అటువంటి భూములను, ఆర్సెలర్ మిట్టల్ కు బదలాయించే ప్రతిపాదన చెల్లదు.

సేకరిస్తున్న డీ పట్టా భూముల వారికి కూడా చెట్లకు నష్ట పరిహారం ఇవ్వలేదు. కొంతమంది భూమిలేనివారు, మీద సూచించినట్లు, 58 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను సాగు చేస్తూ, ఉపాధి పొందుతున్నారు. అటువంటి భూములను APIIC కి బదలాయించినా, అటువంటి భూమి లేని రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి కలిగించలేదు. ప్రభుత్వ విధానం ప్రకారం, వారికి ప్రభుత్వం డీ పట్టాలు ఎప్పుడో ఇచ్చి ఉండాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారికి పట్టాలు ఇవ్వబడలేదు. ఇతర డీ పట్టా రైతులతో సమానంగా, వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వవలసి ఉంది.

1894 చట్టం ప్రకారం, 2010 లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించబడిన ప్పటికీ, 2013 లో మరింత ప్రగతిశీల చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా, పాత చట్టం కింద విచారణ కొనసాగుతోంది. భూ యజమానులకు, భూమి మీద ఆధారపడే ఇతరులకు, 2013 చట్టం ఎన్నో విధాలుగా హక్కులు, ప్రయోజనాలను ఇవ్వడం దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ, ఆ చట్టం కింద కొనసాగించవలసి ఉంది.

2013 చట్టం ప్రకారం, భూసేకరణ చేసే ముందు, అటువంటి భూసేకరణ ప్రక్రియ కారణంగా, ఆ ప్రాంతంలో సమాజం మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో, నిపుణుల చేత అధ్యయనం చేయించి, ఆ రిపోర్టును ప్రజల ముందు సమర్పించి, వారి అభిప్రాయాలను, సలహాలను, ముఖ్యంగా వారి ముందస్తు సమ్మతిని తీసుకోవాల్సి ఉంది. ఆ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి ప్రభుత్వం ఉదారమైన పరిహారం ఇవ్వాలి. వారికి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా, వారి పునరావాసం ఏర్పాట్లు చేయకుండా, ప్రభుత్వం వారి భూములను ఆక్రమించకూడదు. పైగా, 2013 చట్టంలో, 10వ సెక్షన్ ప్రకారం, పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను తరలిస్తే, అక్కడ ప్రాంతీయ ఆహార భద్రత మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో పరిశీలించి, ప్రభుత్వం సేకరించే వ్యవసాయ భూముల విస్తీర్ణం పరిమితించాలి.

అధికారులు, 2013 చట్టం లో సూచించబడిన అటువంటి ప్రగతిశీల మైన నిబంధనలను పాటించడంలో విఫలమైందని స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ కారణంగా, నా ఉద్దేశంలో, ప్రభుత్వం నక్కపల్లి మండలంలో APIIC కోసం చేపట్టిన భూసేకరణ చట్టం ప్రక్రియ చెల్లదు.

జిరాయితీ భూములే కాకుండా, ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు బదలాయించకూడదని సుప్రీం కోర్టు వారు జగ పాల్ సింగ్ vs పంజాబ్ ప్రభుత్వం [సివిల్ అప్పీల్ No. 1132 /2011 @ SLP(C) No.3109/2011 arising from Special Leave Petition (Civil) CC No. 19869 of 2010)] ]కేసులో, 2011 జనవరి 28న ఇచ్చిన తీర్పులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరిగింది. ఆ తీర్పు ను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను ఆర్సెలర్ మిట్టల్ కు బదలాయించడం చెల్లదు.

మీద సూచించిన చట్టపరమైన కారణాలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్సెలర్ మిట్టల్ కు నక్కపల్లి మండలం లో భూములను కేటాయించే ప్రతిపాదనను తత్ క్షణం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదే కాకుండా, ఆ భూములను సాగు చేస్తూ, మనుగడ పొందుతున్న రైతులకు పూర్తి నష్టపరిహారం ఇప్పించమని కూడా నా విజ్ఞప్తి.

నక్కపల్లి మండలం లో, ఆర్సెలర్ మిట్టల్ కు స్టీల్ కర్మాగారం కోసం భూములను ఇవ్వడమే కాకుండా, D L పురం దగ్గర సుమారు 3 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని, తమదైన పోర్టును నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది. సముద్ర తీరం అక్కడ సంప్రదాయ మత్స్యకారుల, ప్రజల ప్రకృతి వనరు. అటువంటి వనరు విషయంలో ప్రభుత్వం ప్రజల తరఫున ట్రస్టీ మాత్రమే. ఆ వనరును ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటు కంపెనీకి బదలాయించడం చట్టవిరుద్ధమే కాకుండా, ప్రజల విశ్వాసాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది.

నక్కపల్లి తీరప్రాంతంలో గ్రామాల్లో, సంప్రదాయ మత్స్యకారులు నివసిస్తున్నారు. వారు, కేవలం భూముల మీదే కాకుండా, సముద్రంలో మత్స్య సంపద మీద కూడా ఆధారపడేవారు. APPIIC వారు ప్రోత్సహిస్తున్న పరిశ్రమల నుండి వచ్చే కాలుష్య పదార్థాల కారణంగా, ఆ మత్స్య సంపద తగ్గడమే కాకుండా, కాలుష్యానికి గురి అయ్యే అవకాశం ఉంది. వారికి భూములు ఉన్నా లేకపోయినా, వారి ఉపాధికి, ఆ విధంగా నష్టం కలగడాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారికి, ప్రత్యేకమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని, అప్పటి విశాఖపట్నం కలెక్టర్ గారి దృష్టికి, స్థానిక అధికారులు 31-3-2016 న జరిగిన సమీక్షలో తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో, ఈరోజు వరకు, ప్రభుత్వం సంతృప్తికరంగా స్పందించలేదు. నా ఉద్దేశంలో ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి.

ఆర్సెలర్ మిట్టల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన స్టీల్ కర్మాగారం వలన, D L పురం వద్ద ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఆర్సెలర్ మిట్టల్ పోర్ట్ కారణంగా, రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు, అపారమైన నష్టం కలుగుతుంది. ఆ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఎన్నో విధాలుగా దోహదం చేసిన సంస్థలు. అటువంటి సంస్థలకు హానిచేసే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోవడం, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కించపరిచినట్లు అవుతుంది. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి.




Read More
Next Story