అందరి మనసు దోచుకుంటున్న అరకు కాఫీ కాయకు అంతలోనే గాయం
x
కాఫీ కాయపై కాయ తొలుచు పురుగు

అందరి మనసు దోచుకుంటున్న అరకు కాఫీ కాయకు అంతలోనే గాయం

మన్యం గిరిజనులను భయపెడుతున్నమాయదారి రోగం


గిరిజనులకు ఆదాయాన్ని తెచ్చి పెట్టే కాఫీ పంటను దెబ్బతీసే తెగులు సోకడంతో తీవ్ర అలజడి రేపుతోంది. తన ప్రత్యేకమైన రుచితో ప్రపంచంలో కాఫీ ప్రియులను మనసు దోచుకుంటున్న అరకు కాఫీ ఈ కాఫీ తోటల నుంచి పండిన గింజలే. అలాంటి కాఫీ పంటకు బెర్రీ బోరర్‌ (Coffee berry borer :CBB) అనే తెగులు మొట్టమొదటిసారిగా సోకి గిరి రైతులను బెంబేలెత్తిస్తోంది.

బెర్రీ బోరర్‌ (హైపోతినెమస్‌ హంపె)గా పిలిచే కాఫీ కాయ తొలిచే పురుగు ఇన్నాళ్లూ కర్నాటక, కేరళ, తమిళనాడుల్లోనే ప్రభావం చూపుతోంది. తాజాగా ఈ ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశించింది. దీని నివారణకు ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది.

బెర్రీ బోరర్‌ సోకిన కాఫీ పండ్లు

మూడు వేల ఎకరాల్లో బెర్రీ బోరర్‌?
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. గిరిజన రైతులు రసాయనాలు వాడకుండా సంప్రదాయ పద్ధతిలో వీటిని సాగు చేస్తున్నారు. దీంతో అక్కడ పండించిన కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఇన్నాళ్లూ ఈ కాఫీ తోటలకు ఎలాంటి తెగుళ్ల బెడద లేకపోవడంతో గిరిజన రైతులు నిశ్చింతగా ఉన్నారు. ఈ పంటపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాది బెర్రీ బోరర్‌ అనే కాయ తొలుచు పురుగు సోకడంతో కలవర పడుతున్నారు. గత నెల 11న అరకులోయ మండలం పకనగుడలో మొదటి సారి ఈ బెర్రీ బోరర్‌ బయటపడింది. ఇలా వివిధ మండలాల్లో దాదాపు మూడు వేల ఎకరాల్లో ఇది సోకినట్టు అనధికార సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని పెదలబుడు, చిన లబుడు, మాడగడ, తురాయిగుడ, పకనగుడ, కొర్రాయి తదితర ఎనిమిది గ్రామాల్లో 150 ఎకరాల్లో దీని ప్రభావం ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

బెర్రీ బోరర్‌ బారిన పడ్డ కాఫీ మొక్క

కాయ తొలిచి.. రంధ్రాలు పెట్టి..
ఈ బెర్రీ బోరర్‌ పురుగు కంటికి కనిపించనంత చిన్న సైజులో ఉంటుంది. ఇది కాఫీ కాయ కొన భాగంలో గుండ్రటి సూక్ష్మ రంధ్రాన్ని చేస్తుంది. ఆపై పిండిలాంటి పదార్థాన్ని ఆ రంధ్రం నుంచి బయటకు పంపుతుంది. కాఫీ గింజ గట్టి పడ్డ కాయలనే ఎంచుకుని పురుగు తన సంతతిని పెంచుకుంటుంది. ఫలితంగా కాఫీ పంటను పూర్తిగా నాశనం చేస్తుంది. ఆరబెట్టిన/ఎండిపోయిన కాయల్లో ఈ పురుగు గుడ్లు పెట్టదు. కానీ పురుగు వాటిలో నివసించి తర్వాత సంవత్సరం నుంచి పంటను ఆశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.దీనితో కాఫీ క్వాలిటీ పడిపోతుంది. దీనిని నివారించకపోతే, ఎంతో కష్టపడి సాధించిన అంతర్జాతీయంగా ఖ్యాతి నాశనమవుతుందని అధికారులు,రైతులు ఆందోళనచెందుతున్నారు.

బెర్రీ బోరర్‌పై సర్వేలో పాల్గొన్న విద్యార్థులు, శాస్త్రవేత్తల బృందం

కాఫీ రైతుల్లో కలవరం..
ఇన్నాళ్లూ కాఫీ రైతులు పండించిన కాఫీ గింజల దిగుబడి తగ్గడం, వీటికి సరైన «మార్కెట్‌ ధర దక్కకపోవడంపైనే ఇబ్బందులు పడేవారు. ఇప్పటిదాకా ఇతర రాష్ట్రాల్లోనే ప్రభావం చూపుతున్న బెర్రీ బోరర్‌ పురుగు గురించి చాలామంది గిరిజన రైతులకు తెలియనే తెలియదు. అలాంటిది ఇప్పుడు కాఫీ పంటను నాశనం చేసే బెర్రీ బోరర్‌ ప్రవేశించిందని తెలియగానే అందోళన చెందుతున్నారు. కాఫీ తోటలకు బెర్రీ బోరర్‌ పురుగు సోకితే పంట పూర్తిగా దెబ్బతింటుంది. రైతు తీవ్రంగా నష్టపోయి ఆశ వదులుకోవల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దశాబ్దాల నుంచి సాగు చేస్తున్న కాఫీ రైతులకు బెర్రీ బోరర్‌ ఓ చేదు అనుభవంలా పరిణమించింది. ‘మా తోటలకు ఎప్పడూ తెగుళ్లు ఎరగం. ఇప్పుడు ఏదో పురుగొచ్చిందంట. కాఫీ గింజల్ని తొలుచుకుని తినేత్తంది. ఈ ఏడాది పంటంతా పోతాదని అంటన్నారు. మా కష్టం కూడా మిగిలేలా లేదు. ఆపీసర్లు సెప్పినట్టు సేత్తన్నాం’ అని అరకులోయ మండలం మాడగడకు చెందిన కాఫీ రైతు కిల్లో సొనాయి ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పాడు.

పురుగు పట్టిన కాఫీ కాయలను వేడి నీటిలో పోస్తూ

నకిలీ కాఫీ విత్తనాలే కారణమా?
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీ తోటలకు తొలిసారిగా బెర్రీ బోరర్‌ ఎలా సోకిందన్న దానిపై అధికారులు ఇంకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఆ జిల్లాలోని కాఫీ తోటల సాగుకు ఐటీడీఏ, కాఫీ బోర్డు విత్తనాలను సమకూరుస్తుంటాయి. కొంతమంది గిరి రైతులకు అధిక దిగుబడి పేరుతో కొన్ని ప్రైవేటు కాఫీ సంస్థలు కూడా విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. అయితే ఐటీడీఏ, కాఫీ బోర్డు ఇచ్చిన విత్తనాలతో పెరిగిన తోటల్లో బెర్రీ బోరర్‌ కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న విత్తనాలతో సాగయిన కాఫీ తోటల్లో ఎక్కువగా ఈ పురుగు జాడ ఉందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధన సాగిస్తున్నారు. ఆ తర్వాతే ఇందుకు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తెగులు సోకిన కాఫీ కాయలను గోతిలో వేస్తున్న దృశ్యం

కాఫీ తోటలు విస్తరించే వేళ..
అరకు కాఫీ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన నేపథ్యంలో అల్లూరి జిల్లాలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అక్కడ పండే ఆర్గానిక్‌ కాఫీని ప్రోత్సహించేందుకు రైతులకు కిలోకు రూ.330 చొప్పున (నాన్‌ ఆర్గానిక్‌కు రూ.280) చెల్లించి కాఫీ గింజలను జీసీసీ ద్వారా కొనుగోలు చేయిస్తోంది. ఇంతలో ఇప్పుడు బెర్రీ బోరర్‌ సోకడం ప్రభుత్వంతో పాటు గిరిజనులను కలవరానికి గురి చేస్తోంది. మరోవైపు బెర్రీ బోరర్‌ సోకిన కాఫీ గింజలు కిలోకు రూ.50 చొప్పున కొనుగోలు చేయాలని, ఎకరానికి అదనంగా మరో రూ.5 వేల చొప్పున కాఫీ రైతులకు పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అధికారులు ఏం చేస్తున్నారంటే..
అల్లూరి జిల్లాలో కాఫీ తోటలకు బెర్రీ బోరర్‌ సోకినట్టు తెలియగానే ప్రభుత్వ ఆదేశాలతో సంబంధిత ఐటీడీఏ, ఉద్యాన శాఖలతో పాటు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు నివారణ చర్యలకు ఉపక్రమించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలకు చెందిన 169 మంది విద్యార్థులు, 27 మంది శాస్త్రవేత్తలు ఈ కాఫీ తోటల్లో సమగ్ర సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ తోటలకు బెర్రీ బోరర్‌ ప్రభావం ఉందో పరిశీలన చేస్తున్నారు. ‘బెర్రీ బోరర్‌ పురుగు నివారణకు బవేరియా బేసియానా సిలీంద్రాన్ని పిచికారి చేయిస్తున్నాం. ఇంకా బ్రోకో ట్రాప్స్‌ ద్వారా ఎరలతో తోటల్లో వేలాడదీసి పురుగులను ట్రాప్‌ చేస్తున్నాం. వీటిని వేడి నీళ్లలో వేసి గొయ్యి తీసి పాతి పెడ్తున్నాం. దీనిపై రైతులకూ అవగాహన కల్పిస్తున్నాం’ అని కేంద్ర కాఫీ బోర్డు సీనియర్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌ ఎస్‌.రమేష్‌ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధికి చెప్పారు.

శాస్త్రవేత్త చెట్టి బిందు

బెర్రీ బోరర్‌పై సర్వే : చెట్టి బిందు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో బెర్రీ బోరర్‌పై ఈనెల 9 నుంచి 12 వరకు మా విశ్వవిద్యాలయంతో పాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి (95+74) మంది విద్యార్థులు, అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి కాఫీ తోటల్లో సర్వే చేశాం. అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లోని కాఫీ తోటల్లో బెర్రీ బోరర్‌ ఉనికిని గుర్తించాం. ఈ కాయ తొలుచు పురుగు నివారణకు కాఫీ బోర్డు సూచనతో మా యూనివర్సిటీ నుంచి వంద కిలోల బవేరియా బేసియానా శిలీంద్రాన్ని అందజేశాం. మరో 400 కిలోలు సరఫరా జరుగుతుంది’ అని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం (చింతపల్లి) సైంటిస్ట్‌ అండ్‌ హెడ్‌ చెట్టి బిందు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Read More
Next Story