నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మన సంగీత సామ్రాట్ ఏఆర్ రహమాన్ పాల్గొనబోతున్నారా? తమిళనాడు మూలాలున్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ తరఫున ప్రచారం చేస్తారా? తన బృందంతో నేరుగా వెళ్లి ప్రచారం చేస్తారా లేక వీడియో విడుదల చేసి దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోమంటారా? అనేది ఇంకా స్పష్టం తెలియనప్పటికీ పీటీఐ లాంటి వార్తా సంస్థలు ఇచ్చిన కథనాల ప్రకారం రహమాన్ ప్రచారం మాత్రం నిజం.
మరో మూడు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ పడుతున్నారు. హోరాహోరిగా సాగుతున్న ఎన్నికల ప్రచారం సాగుతోంది. కమలా హారిస్ తమిళనాడు నుంచి వలస వెళ్లిన తల్లికి పుట్టిన బిడ్డ. వీళ్లు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉండేవారు. ఇప్పటికీ కమలాహారిస్ మేనత్తలు, సమీపబంధువులు చైన్నై, తదితర ప్రాంతాలలో ఉంటున్నారు. కమలాహారిస్ గెలుపునకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సర్వేలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన తమిళులు, దక్షిణాసియా వాసులు, డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులు రహమాన్ పాటలున్న వీడియోను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
రహమాన్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి భారతీయ సంగీత ప్రియులలో ఆయనకు మంచి ఆదరణ ఉంది. అటువంటి వారి సంఖ్య అమెరికాలోనూ ఎక్కువగానే ఉంది. వారిని ప్రభావితం చేసేలా రహమాన్ సంగీత విభావరిని ఏర్పాటు చేసి కమలాహారిస్ కి మద్దతు కూడగట్టాలని అనుకుంటున్నారు.
57 ఏళ్ల రహమాన్ కనుక రంగంలోకి దిగితే అది కమలాహారిస్ ఎన్నికల ప్రచారానికి పెద్ద ఊతమిచ్చినట్టవుతుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఓ అరగంట వీడియోను విడుదల చేస్తారు. "అమెరికా పురోగతి కోసం నిలబడిన నాయకులు, కళాకారుల బృందం నిలబడి చేస్తున్న నినాదాలకు ఏఆర్ రెహమాన్ తన గాత్రాన్ని జోడించారు" అని ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ చెప్పారు. "ఇది కేవలం సంగీత కార్యక్రమమే కాదు అంతకుమించింది. ఇది మన కమ్యూనిటీల భవిష్యత్ కి సంబంధించింది. మనం చూడాలనుకుంటున్న భవిష్యత్తు కి సంబంధించింది. మన ఉజ్వల భవిష్యత్ కోసం కృషి చేస్తున్న వారందరూ కమలాహారిస్ వైపు నిలిచి ఓటు వేసేలా తీసుకుంటున్న చర్యలో ఇదో భాగం. మంచి ముందడుగు" అన్నారు శేఖర్.
ఏఆర్ రహమాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇండియన్ మ్యూజిక్ కంపోజర్. సంగీతదర్శకుడు, పాటగాడు. కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి మద్దతుగా 30 నిమిషాల ప్రత్యేక వీడియోను విడుదల చేస్తారు అంటున్నారు అమెరికాలో స్థిరపడిన ఎన్.సందీప్. ఇదే జరిగితే దక్షిణాసియా వాసులు పెద్ద సంఖ్యలో కమలాహారిస్ వైపు మొగ్గు చూపుతారన్నారు సందీప్.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దక్షిణాసియా ఓటర్లలో కమలా హారిస్‌కు మద్దతును పెంచే వ్యూహాంలో ఇదో భాగం. ఆసియా సహా ప్రధాన దక్షిణాసియా నెట్‌వర్క్‌లు, యూట్యూబ్, ఇతర ప్రసారమాధ్యమాలలో ఈ వీడియోను ప్రసారం చేస్తారు. అక్టోబర్ 13న రాత్రి 8 గంటలకు ఇది ప్రసారం అవుతుందని భావిస్తున్నారు.
30 నిమిషాల ప్రదర్శనలో రెహమాన్‌కి అత్యంత ఇష్టమైన కొన్ని పాటలు ఉంటాయి. కమలా హారిస్ చారిత్రాత్మక అభ్యర్థిత్వం, ఆఫ్రో ఆసియన్ వాసుల నిబద్ధతను హైలైట్ చేసే సందేశాలతో ఈ వీడియో ఉంటుంది. యూట్యూబ్‌లో టీజర్ వీడియో విడదలైంది. దీనిలో రెహమాన్, భారతీయ సంతతికి చెందిన ఎంఆర్ రంగస్వామి ఇతరులుకనిపిస్తారు. ఏదిఏమైనా అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఓ భారతీయ సంగీత దర్శకుడు తొలిసారి ఆటా, పాటలతో అలరించబోతున్నారు.