పార్లమెంటులో పోయిన ఏపీ పరువు
x

పార్లమెంటులో పోయిన ఏపీ పరువు

కక్షపూరిత రాజకీయాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ పరువును తీస్తున్న నేతలు, సోమవారం పార్లమెంట్‌ సాక్షిగా మరో సారి పరువును తీశారు.


ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీలను చూడకూడదు. ప్రజాప్రతినిధులా కాదా అనేది చూడాలి. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించాలి. ఆ చొరవ అధికార పక్షం తీసుకోవాలి. ఔటాఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అందుకు భిన్నంగా ఉంది. సోమవారం పార్లమెంట్‌లో జరిగిన ఓ ప్రారంభోత్సవ సంఘటనే దీనికి నిదర్శనం. పార్లమెంట్‌లో అరకు ఎంపీ లేకుండానే అరకు కాఫీ ఔట్‌లెట్‌ ఓపెన్‌ చేసి ఏపీ పరువును ఢిల్లీ వీధుల్లోకి లాగారు.

సోమవారం పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఖ్యాతిని ప్రపంచ వ్యాపితం చేసిన అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో అరకు కాఫీ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్‌ స్పీకర్‌ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. జాతీయ స్థాయిలో అరకు కాఫీని ప్రమోట్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రులు దీనిని ప్రారంభించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రీజుజు లోక్‌ సభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించగా, రాజ్యసభ క్యాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రారంభించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్‌ ఓరం, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎంపీలు పాల్గొన్నారు.
అంతేకాకుండా జీసీసీ ఎండీ, జీసీసీ చైర్మన్‌తో పాటు అధికారులు పాల్గొన్న అరకు కాఫీ స్టాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదే అరకు పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ కనిపించక పోవడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. అరకు పేరు మీదే పార్లమెంట్‌ నియోజక వర్గం, అరకు పేరుతోనే కాఫీ ఉండటం దీని ప్రత్యేకత. రెండు ఒకే పేరుతో ఉండటం వల్ల సహజంగా అరకు అనగానే ఆ పార్లమెంట్‌ ఎంపీ గుర్తుకు వస్తారు. అదీ పార్లమెంట్‌లో జరుగుతున్న వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ఆ ఎంపీ ఎవరనేది చర్చకు వస్తుంది. కానీ స్థానిక ఎంపీ లేకుండా పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్‌ను ఓపెనింగ్‌ చేశారు. అరకు కాఫీ అనేది ఆంధ్రప్రదేశ్‌ సొత్తు. అధికార పక్షం సొత్తు కాదు. దీనిని డెవలప్‌ చేయడం, నలుదిశల దీనిని వ్యాపింప చేయడం ప్రభుత్వ బాధ్యత. స్థానిక ఎంపీ లేకుండానే ఈ కార్యక్రమం జరగడం వల్ల సాక్షాత్తు పార్లమెంటులో ఏపీరువు పోయినటై్టందనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యం. పార్టీలు కాదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాజకీయాలు కాదు. ఏ పార్టీ నుంచి గెలిచినా.. వారు ప్రజా ప్రతినిధులే. కాబట్టి అందరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా అధికారంలో ఉన్న వాళ్లు చర్యలు తీసుకోవాలి. మధ్య విభేదాలు ఉన్నా.. వైరుద్యాలు ఉన్నా.. ఎన్ని గొడవలు ఉన్నా.. ప్రభుత్వ కార్యక్రమం వచ్చే సరికి అందరూ పాల్గొనే వాతావరణం క్రియేట్‌ చేసుకోవాలి. ఆ విధంగా చేయడంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అలా చేయడం వల్ల అటు ప్రజల్లోను, ఇటు నేతల్లోను ప్రభుత్వం మీద గౌరవం పెరుగుతుంది. లేకుంటే ప్రజాస్వామ్య స్పూర్తి దెబ్బతింటుంది. ప్రజలు రోడ్డున పడుతారు. అది కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికార çపక్షాలు వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజాస్వామ్య స్పూర్తి బాగా దెబ్బతినింది. పార్టీల మధ్య విద్వేషాలు పెరిగి పోయాయి. రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య కక్షపూరిత వాతావరణం నెలకొంది. నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఈ వాతావరణంలో కూరుకొని పోయారు. రాయలసీమ ముఠా నాయకుల్లా వ్యవహరిస్తున్నారు.
ఎన్నికల ముందు వరకు ఎంత ఘర్షణ వాతావరణం ఉన్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం వ్యవహరించాలనే విజ్ఞతను ప్రదర్శించాలి. విపక్షంలోని ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసే విధంగా అధికార పక్షం చొరవ చూపించాలి. కానీ 2014 ఎన్నికల తర్వాత అలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో కరువైంది. 2024 ఎన్నికల తర్వాత మితిమీరి పోయింది. కూటమి పార్టీలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్య ఓ యుద్ద వాతావరణమే నెలకొంది. ప్రతీకారమే ప్రథమ కర్తవ్యంగా అధికార పక్షం వ్యవహరిస్తోంది. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులు దాటింది. పార్లమెంట్‌కు పాకింది. ఇరువురు కలిసి సాక్షాత్తు పార్లమెంట్‌లో రాష్ట్ర పరువును తీస్తున్నారని చర్చించుకుంటున్నారు. సోమవారం సాక్షాత్తు పార్లమెంట్‌లో చోటు చేసుకున్న సంఘటనే దీనికి ఉదాహరణ. అరకు ఎంపీగా డాక్టర్‌ తనూజా రాణి గెలిచారు. 2024 ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లకు గాను 4 సీట్లను వైసీపీ గెలుచుకుంది. కడప నుంచి అవినాష్‌రెడ్డి, రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, తిరుపతి నుంచి డాక్టర్‌ మద్దిల గురుమూర్తి, అరకు నుంచి డాక్టర్‌ గుమ్మా తనూజారాణి గెలుపొందారు. కూటమి పార్టీలైన టీడీపీ 16 ఎంపీ స్థానాలు, బీజేపీ 3, జనసేన 2 స్థానాలను గెలుచుకున్నాయి.
Read More
Next Story