‘రాజ్యాంగానికి తూట్లు పడ్డాయి’.. బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి
x

‘రాజ్యాంగానికి తూట్లు పడ్డాయి’.. బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి

రాజమండ్రిలో జరిగిన బీజేపీ విస్తృత సమావేశంలో కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు. ఎన్‌డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి బీజేపీ విస్తృత సమావేశం నిర్వమించింది. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, మురుగన్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీజేపీ నేతల చర్చించారు. పార్టీలోకి ఎటువంటి వారిని చేర్చుకోవాలి, పార్టీలోకి చేర్చుకునే ముందు ఒక నేత గురించి ఎలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి అన్న అంశాలపై కూడా వారు చర్చించుకున్నారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి మురుగన్ మాట్లాడుతూ.. ఇది దేశమంతా ఎమ్మెల్యేలు, ఎంపీలను సన్మానం చేసుకునే సమయమని అన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చామని, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీతో కలిసి ముందుకు వెళ్లామని గుర్తు చేశారు.

అభివృద్ధికి పెద్దపీట

‘‘బీజేపీ పాలనలో దేశమంతా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది. గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి వేగం రెట్టింపయింది. అది డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సాధ్యమైంది. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌లో ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను కూడా అభివృద్ధి చేసుకుందాం. ఏపీని రూ.5 లక్షల కోట్లతో అభివృద్ధి చేయాలి. పోలవరం నిర్మాణం, అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ట్రైబల్ యూనివర్సిటీని ఇప్పటికే మంజూరు చేశాం’’ అని వెల్లడించారు.

అదే విధంగా దేశంలో తొలిసారి ఫిషర్ మెన్‌కి ప్రత్యేక మంత్రిని ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని మోదీకే చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోర్ట్‌లను అభివృద్ధి చేస్తామని, రూ.1.20 లక్షల కోట్ల విలువైన స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం కల్పించామని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనేక సార్టు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని, ఇండి కూటమి రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని ఆరోపించారు. రాష్ట్రంలో విజయం సాధించిన ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేలకు అభినందనలు అని తెలిపారు.

ఆత్మనిర్భర్‌కే ప్రజలు ఓటేశారు

ఈ సందర్భంగానే పురందేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్‌కు ఓటు వేశారని అన్నారు. ‘‘ప్రజలు ఎన్‌డీఏ కూటమి విధానాలకు అనుకూలంగా ఓటు వేశారు. ఐదో ఆర్థికశక్తిగా భారత్ ఎదగడం వల్లే ఈ వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైంది. దేశాభివృద్ధి కోసమే ప్రధాని మోదీ పనిచేస్తారు. ఆయన నిత్యాలోచన కూడా అదే. మూడోసారి ప్రధాని అయిన తర్వాత పేదలకు 3 కోట్ల ఇళ్ల పథకంపైనే ఆయన తన తొలి సంతకం చేశారు. రైతులకు ఖాతాల్లో రూ.20 వేట కోట్లు జమ చేయడంపై రెండో సంతకం చేశారు. అటువంటి ప్రధాని పాలనలో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చారామే.

Read More
Next Story