వైసీపీ ఎమ్మెల్యేల్ని దొంగలతో పోల్చిన ఏపీ స్పీకర్
x
Chintakayala ayyanna patrudu

వైసీపీ ఎమ్మెల్యేల్ని దొంగలతో పోల్చిన ఏపీ స్పీకర్

ప్రతిపక్ష శాసనసభ్యులను ఓ స్పీకర్ దొంగలనవచ్చా? అది సభా సంప్రదాయమేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చ ఇది.


ప్రతిపక్ష శాసనసభ్యులను ఓ స్పీకర్ దొంగలనవచ్చా? అది సభా సంప్రదాయమేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చ ఇది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభా వేదిక నుంచే ఈ కామెంట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇదేం మర్యాదని వైసీపీ నాయకులు తప్పుబట్టగా అందులో తప్పేముందని టీడీపీ నేతలు అంటున్నారు. అబద్ధమనే పదమే అన్ పార్లమెంటరీ పదం అయినపుడు దొంగలనే పదం కాదా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అసలింతకీ ఏమి జరిగిందంటే...
మార్చి 20న సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష వైసీపీ సభ్యులు వేసిన ప్రశ్నలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రశ్నలు అడిగినపుడు సంబంధిత ఎమ్మెల్యేలు సభలో ఉండడం సంప్రదాయం. వైసీపీ సభ్యులు సభకు రావడం లేదు. రాతపూర్వక ప్రశ్నలు మాత్రం పంపిస్తున్నారు. ఈ తీరుపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు సభకు రాకపోవడాన్ని ప్రస్తావించారు. కొందరు సభ్యులు సభకు రాకపోయిన అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలు వచ్చిన సమయంలో స్పీకర్ స్పందించారు. 'సభలో చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు.. ఈ సమావేశాల్లో దురదృష్టవశాత్తూ దాదాపు 25 ప్రశ్నలకు సభలో సమాధానాలు లభించలేదు. ప్రతిపక్షానికి చెందిన సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు సభకు రావడం లేదు.. ప్రశ్నలు వేయడం వల్ల మరో ఇద్దరు సభ్యులు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సమంజసం కాదు' అన్నారు.ఎవరికీ కనిపించకుండా ఆ సభ్యులు వచ్చి దొంగల్లా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రజలు సభ్యులుగా ఎన్నుకుంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. హాజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదని స్పష్టం చేశారు. వై బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధ రెడ్డి, విశ్వేశరరాజులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగం తరువాత వేర్వేరు రోజుల్లో వీరు సంతకాలు చేసి వెళ్లినట్టు తెలుస్తోందని అన్నారు. ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని అయ్యన్నపాత్రుడు హితవు పలికారు.
Read More
Next Story